Photo01211కంభం వారు కట్టించిన 200 ఏళ్ల సత్రం ఐదు రోజుల నుంచీ  చీకట్లో మగ్గుతోంది.  కోటి వీరేశలింగాల పుణ్యభూమిలో కంభంవారి  సత్రం పరిస్థితి ‘‘ఎవడికి పుట్టావురా ఎక్కెక్కి ఏడుస్తున్నావు‘‘ అన్నట్టు తయారైంది.

‘‘ఏదయా మీ దయా మామీద లేదు.. ‘‘ అంటూ మూగగా గంగిగోవులు రాజమహేంద్రి విద్యుత్తు ఆఫీసు చుట్టూ, మున్సిపాలిటీ చుట్టూ తిరుగుతున్నాయి. అయినా ఏలిన వారి అనుగ్రహం వారి మీదకు ప్రసరించడం లేదు. ‘‘కటకటా మీకెంత కరుణలేదయ్య/ యిటువచ్చి యడుగమా కిది పద్ధతయ్య/ ఏదయా మీదయా మామీద లేదు/ యింతసేపుంచుట యిదిమీకు తగునా?/ ఉత్తమాజనులార చిత్తగించండి‘‘ అని మోరలెత్తి అంబా అంటున్నాయి. అయినా అధికారులకు కనికరం కలగడం లేదు. ‘‘ఏదయా మీదయా మామీద లేదు,/ ఇంతసేపుంచుట ఇది మీకు తగదు,/ దిక్కులేకొస్తిమని విసవిసలు పడక,/ చేతిలో లేదనక, ట్రజరీలొ లేదనక/ రేపురా మాపురా మళ్లి రమ్మనక,/ గొప్పగా చూడండి తప్పకను మీరు…‘‘ అని మౌనంగా ప్రార్థిస్తున్నారు. ‘‘ఇంత నిర్లక్ష్యమా ఇది మీకు తగదు‘‘ అనే కఠినోక్తులు పలకలేక నిశ్శబ్దంగా బాధపడుతున్నారు.

ఇదంతా ఏమిటి, ఎందుకనుకుంటున్నారా? కంభం వారి సత్రం చీకట్లోకి జారుకుని ఐదురోజులవుతోంది…! దీని సంపూర్తి వివరాలు ఇవి.

ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుగారు నడయాడిన, కోటి వీరేశలింగాల పుణ్య భూమిలో, కంభం నరసింగరావు పంతులుగారు 1845 లో కట్టించిన సత్రం పరిస్థితి ‘‘ఎవడికి పుట్టావురా ఎక్కెక్కి ఏడుస్తున్నావు‘‘ అన్న చందంగా తయారైంది. దాదాపు రెండు వందల ఏళ్ల క్రితం రేపటి ప్రపంచాన్ని దాని అవసరాలు ఊహించిన మహాదార్శనికుడు, మహాదాత మథ్వశ్రీ కంభం పంతులుగారు కట్టించిన సత్రం ఐదు రోజుల నుంచీ చీకట్లో మగ్గుతోంది. పుష్కరాలు అయిపోయిన శనివారం రోజు రాత్రి సత్రానికి విద్యుత్తు తీసుకు వచ్చే (సన్నా)నాసిరకం సర్వీసు వైర్లు కాలిపోయాయి. దీంతో సత్రంలో చీకట్లు అలముకున్నాయి.

కంభాల వారి సత్రం అంటే ఆత్మీయులను పోగొట్టుకుని, అపార్టుమెంట్ల ఓనర్లు మైలవాళ్లను బయటికి గెంటితే, చనిపోయినవారి అస్తికలు పట్టుకుని ఎక్కడికి వెళ్లాలో తెలియక, అలనాటి పంతులు వారు నేటికీ సజీవంగా ఉండడంతో వారి ఒడికి చేరుకుని,  పుణ్య గోదారమ్మ ఒడ్డున ఆత్మీయులకు అంత్యక్రియలను చేసుకునేందుకు దేశవ్యాప్తంగా అనేక మంది ‘‘కర్తలు‘‘ తమ బంధువులతో సహా వస్తారు. ఇది కేవలం సత్రం కాదు. ‘‘అపర‘‘ దక్షిణ కాశీ వంటిది. పరమ శివుని ఆలయం. ఇటువంటి ఆలయంలో ఈ వ్యాసం రాసే నాటికి ఐదురోజుల బట్టీ దీపం పెట్టే దిక్కులేదు. ఇటువంటి అపర కర్మల భవనం దీపం లేకుండా ఉంచకూడదన్న జ్ఙానం ఏలిన వారికి లేదు.

ఎంతో భారంతో, కడుపు నిండా శోకంతో, మైలతో ఉన్న కర్తల నోటివెంట ఒక్క తిట్టు వచ్చినా అది శాపమై తగులుతుందన్న పాప భీతి అధికారులకు లేదు.

ముసలీ ముతకా, పిల్లా జెల్లాలను వేసుకుని కనీసం 10 రోజుల పాటు గోవింద గోవిందా అంటూ అపర కర్మలు చేసుకునే వారు నీళ్లూ నిప్పులూ లేక అల్లాడుతున్నారు. ఒక్కో గదిలో పది, ఇరవై మంది బంధువులతో కఠిన నేల మీద పడుకుని పది రోజులు వెళ్లదీసే కోటీశ్వరులు కూడా పాయిఖానాలలో పోయడానికి చెంబుడు నీళ్లు లేక, గోదావరి నుంచీ నీళ్లు మోసుకుతెచ్చునే ఓపిక లేక అల్లాడుతున్నారు.

అపర కర్మలంటే, కూంచతో నీళ్లు పోయడం. ఆత్మీయులు అందించే ఉద్ధరిణి నీళ్లకోసం చచ్చిన వారు నరక మార్గంలో అలమటిస్తూ ఉంటారు. అటువంటి చోట మోటార్లు విద్యుత్తులేక మొరాయిస్తున్నాయి. ఇక్కడ అపర కర్మలు చేసే కర్తలు, వారి బంధువులలో ముసలివారు, అనేక రోగా పీడితులు, అంగవైకల్యం ఉన్నవారూ ఉంటారు. వీరు విద్యుత్తు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. రాత్రిళ్లు దోమలు, పగలు ఈగల బాధతో అల్లాడు తున్నారు. ఫానులు లేక, బాత్రూంలలో నీళ్లు లేక నానా ఇబ్బందులూ పడుతున్నారు.

రాజమహేంద్రి పురపాలక సంఘం ఆథ్వర్యంలో నడుస్తున్న సత్రం నరకంగా తయారైంది. సర్వీసు వైరు కాలిపోతే దానికి రూ. 25,000 అవుతుందని అంచనాలు వేశారు. ఆ ఫైలు అంచెలంచలుగా ఆమోదంపొంది, నిధులు మంజూరయ్యి, విద్యుత్తు శాఖకు చేరి, అక్కడి అధికారులకు అనుగ్రహం కలిగితే కానీ ఈ సత్రం లో విద్యుత్తు కాంతులు రావు. కంభం వారి విగ్రహం మళ్లీ వెలుగులోకి రాదు.

అయ్యా ఇదీ పరిస్థితి.

కాషాయదళాలు భారతదేశం మొత్తం విస్తరించిన వేళ, దక్షిణాదిన బిజెపికి పట్టం కట్టిన రాజమహేంద్రిలో హైందవ ధర్మం పరిరక్షణకు రెండు వందల ఏళ్ల క్రితం మహనీయుడు కట్టిన సత్రాన్ని మన నిర్లక్ష్యంతో నాశనం చేసుకుందామా? మీరే నిర్ణయించుకోండి.

జాతి గర్వించదగిన చారిత్రక సంపద ఈ సత్రం కాదా?  చచ్చిన తల్లితండ్రులకు ఇన్ని నీళ్లు కూడా ప్రశాంతగా వదులుకోలేని దుర్దశకు హైందవగోవులను నెడతారా? అవును లెండి…. గోమాంసానికే అంతర్జాతి విలువ పెరుగుతోంది…! గోవులకు కాదు.

Click to access MCR_EMPL_PHONE%20NOS.pdf

సత్రం ఉన్న విద్యుత్ శాఖ ఫిర్యాదు విభాగం ఫోన్ నెంబరు: 0883 2400751

Photo01221

పుష్కరాలు- కొన్ని పాఠాలు : ఏలూరిపాటి