జీవనవాహినిలో పుష్కరాలు వస్తూనే ఉంటాయి, పాపాలను తుడిచిపెడుతూనే ఉంటాయి.  ప్రతీ పుష్కర నిర్వహణలోనూ  కొన్ని పాఠాలను నేర్చుకుని, గోదావరిఅంత్యపుష్కరాలకు, కృష్ణమ్మ పుష్కరాలకు వచ్చే ఏడాది నాటికి సిద్ధమవుదాం. వాటిలో ముఖ్యమైనవి ఇవి….

 నేటితో పుష్కరాల వేడుకలకు తెరపడింది. దీని తరువాత గోదావరిఅంత్యపుష్కరాలకు, కృష్ణమ్మ పుష్కరాలకు వచ్చే ఏడాది నాటికి సిద్ధమవుదాం. మళ్లీ గోదారమ్మ చల్లగా చూస్తే, పన్నెండేళ్ల తరువాత వచ్చే పుష్కరాలలో మునకలేస్తాం. అయితే జీవనవాహినిలో పుష్కరాలు వస్తూనే ఉంటాయి, పాపాలను తుడిచిపెడుతూనే ఉంటాయి.  మనది పెరిగే సంసారం. కోట్లలో ఉన్న వసుధైక కుటుంబం. కనుక  ప్రతీ పుష్కర నిర్వహణలోనూ మనం కొన్ని పాఠాలను నేర్చుకోవాల్సి ఉంది. మరొక ఏడాదిలో కృష్ణా పుష్కరాలు రానున్నాయి. కనుక వాటి నిర్వహణలో ఈ లోపాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంది. వాటిలో ముఖ్యమైనవి ఇవి.

పచ్చబొట్టు వేసేవారిని ప్రోత్సహించవద్దు:

భారతదేశంలో పచ్చబొట్టు పొడిచే వారు వందలాది ఏళ్లుగా ఉన్నారు. మన నానమ్మలు, ముత్తమ్మలు పచ్చబొట్టు పొడిపించుకున్నవాళ్లే. చిన్నప్పుడు వారి ఒళ్లో ఆడుకుంటూ, వారికున్న పచ్చబొట్టుని వింతగా చూడని బాల్యం ఉండదు అంటే అతిశయోక్తికాదు. కానీ, కాలం మారుతోంది. భయంకరమైన రోగాలకు కారణం పచ్చబొట్టు అని ఇప్పటికే వైద్యులు తేల్చారు. దీనికి కారణం వేలాది రూపాయల్లో అధునాతన పద్ధతుల్లో పచ్చపొడిచే వారేనని అనేక అధ్యయనాల్లో బయటపడింది. ఎయిడ్స్, హెపటైటిస్ వంటి వ్యాథులు పచ్చపొడిపించుకోవడం వల్ల వస్తున్నాయని పాశ్చాత్యులు తేల్చిచెప్పారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని నాగరిక సమాజంలో వేలాది రూపాయల వ్యాపారంగా సాగుతున్న కళాత్మక, విలాసవంత, వ్యామోహక రంగం పరిస్థితే ఇంత ఘోరంగా, భయంకరంగా ఉంటే ఇంక పది, ఇరవై రూపాయలకూ పచ్చపొడిచే వారి సంగతి చెప్పేదేముందీ?
వీరు కూడా సూదులు మారుస్తున్నారు. డెట్టాల్ వంటి వాటిని ఉపయోగిస్తున్నారు. అయినా, పుష్కరాల సమయంలో వీరిని ప్రోత్సహించకపోవడమే మంచిదని కొందరు వైద్యశాస్ర్త నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి కారణం చాలా బలంగా ఉంది. పుష్కరాలు అంటే నీటి పండుగ. నీటిలో వైరస్లు ఎక్కువ కాలం బతుకుతాయి. ఎయిడ్స్ రోగి నుంచీ రక్తపు చుక్క బయటకు వచ్చినా అందులో మిలియన్ల కొద్దీ హెచ్ ఐ వీ వైరస్ లు ఉంటాయి. సాధారణంగా అవి రోగి శరీరం నుంచీ బయటకు వచ్చిన నిమిషాల్లో చనిపోతాయి. కానీ, ఇవే వైరస్లు నీటిలో కలిస్తే అవి ఎక్కువ కాలం బతికి ఉండే ప్రమాదం ఉంది. ఇదే సూత్రం మిగిలిన హెపటైటిస్ వంటి భయంకర వైరస్లకు కూడా వర్తిస్తుంది.

Photo01051
పచ్చబొట్టు పొడవడం వల్ల రక్తస్రావం జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కనుక భయంకర వైరస్లు నీటిలో కలిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సాధారణంగా నదులలో ఈ వైరస్లు ప్రవేశిస్తే, అవి ఆరోగ్యవంతులకు సోకే అవకాశాలు చాలా తక్కువ. కానీ, నదులలో నీరు లేని కారణం చేత ప్రవాహాలను ఆపి, నిలువ ఉన్న నీటిలో కోట్లాది మంది స్నానాలు చేస్తున్నారు. దీని వల్ల నదులలో కాకుండా మడుగులలో స్నానం చేస్తున్నట్టే లెక్క. గోదావరి సంగతే ఇలా ఉంటే ఇంక బక్కచిక్కిన కృష్ణానది సంగతి చెప్పనవసరం లేదు. రాబోయే కృష్ణా పుష్కరాలకు నీటి సమస్య లేకుండా ఎలా జాగ్రత్తపడాలని ఇప్పటి నుంచే పథకరచన ప్రభుత్వం చేస్తోందంటే నీటి సమస్య ఎంత గంభీరమైందో అర్థం చేసుకోవచ్చు.
ఇటువంటి సమయంలో పచ్చబొట్టు పొడిచేవారిని ప్రోత్సహించకపోవడమే మంచిదని, వైద్యశాస్ర్తంలో పరిశుభ్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. పచ్చపొడిచే చోటే ఒకరి నుంచీ మరొకరికి వైరస్లు పాకుతున్నాయని పాశ్చాత్య అధ్యయనాలు చెబుతుంటే, సామూహిక స్నానాలు చేసే చోట ఈ సమస్య మరింత గంభీరం అవుతుందని, రక్తస్రావమయ్యే గాయాలు ఉన్న మంచి వారికి కూడా ప్రమాదమని అంటున్నారు.
ఈ తద్దినాలన్నీ ఎందుకు, వందల సంఖ్యలో చేరుకుంటున్న ఈ పచ్చపొడిచే వారిని కేవలం నీటితో ముడిపడిన ఈ ఒక్క వేడుకలకూ ఎందుకు దూరంగా ఉంచరాదు? అనే వారు చాలా ఎక్కువ మంది ఉన్నారు.

తీగ మీద బతుకు:

కులవృత్తిగా చేసే ప్రదర్శనల్లో భారతీయ తరహా జిమ్నాస్టిక్స్ ముఖ్యమైనవి. ఇవి చిన్న పిల్లలనే కాదు. పెద్దవారిని కూడా విశేషంగా ఆకర్షిస్తాయి. సరైన ఆదరణ లేక ఈ కళ అంతరించిపోతోంది. జిమ్నాస్టిక్స్ పేరిట ఎన్నో నవీన క్రీడా శిక్షణా సంస్థలు నేడు జిల్లా కేంద్రాలలో కూడా ఉన్నాయి. కానీ, ఏ బాలబాలికలనూ వీటికి తల్లితండ్రులు ప్రోత్సహించడంలేదు. ప్రతీ ముగ్గురు పిల్లల్లో ఒకరికి చక్కెర వ్యాథి రాబోతున్న తరుణంలో ఇటువంటి క్రీడలు ప్రోత్సహిస్తే తప్పులేదని కొందరు అంటున్నారు. ఒలింపిక్స్ వరకూ సాధ్యమైన ఈ క్రీడలపై పిల్లలకు ఆసక్తి కలిగించేది ఇటువంటి ప్రదర్శనలే.

Photo01091 భారతీయ వినోద ప్రదర్శనలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన రోప్ ట్రిక్ వంటివి ఈ విధంగా వీధి ప్రదర్శనలే అని గుర్తుచేసుకంటే మంచిదని కొందరు పెద్దలు అంటున్నారు. వీరిని ప్రోత్సహించకపోతే ఇవి అంతరించిపోతాయని బాధపడుతున్నారు. తోలుబొమ్మలాటలు, నాటకాలు, బుర్రకథలు వంటివి పిల్లలకు చూపించడానికి పుష్కరాలవంటివి మంచి తరుణాలు అని అంటున్నారు. జానపద కళాకారులనూ, భారత హస్తకళలనూ పరిచయంచేసే ప్రదర్శనలు ఏర్పాటు చేయాలి అనేవారు లేకపోలేదు. దీనివల్ల వారికి వ్యాపారం కూడా అవుతుందని పుష్కరఘాట్ దగ్గరి ‘‘బొబ్బట్ల కొట్టు‘‘ సోదాహరణగా చూపించి చెబుతున్నారు.

అన్నప్రసాదాలు:

అన్నదానం అంటే జాతి ఆర్థికశక్తిని చాటి చెప్పేది. అన్నదానం ఎంత ఘనంగా జరిగితే, ఆ జాతి అంత శక్తిమంతమైందిగా లెక్క. ఉభయ గోదావరి జిల్లాల దాతలూ పోటీలు పడి ఇంటి ఆడపడుచు పెళ్లికి కూడా చేయని భారీ స్థాయిలో అన్నశాంతి చేశారు. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. స్వీట్లు, హాట్లు, కూరలూ పప్పుదప్పళాలతో ఇక చాలు బాబోయ్ అనేట్టు అన్నశాంతి చేశారు. ఉదయం ఆరు గంటల నుంచే ఉపాహారాలు పంచడం మొదలు పెట్టారు. వీటిలో కట్టెపొంగలి, పులిహోర, దద్ధోజనం, చక్రపొంగలి, రవ్వకేసరి, ఉప్మా, వడలు, పూరీలు ఉన్నాయి. వీటిని భక్తులకు పోటీలు పడి మరీ పంచిపెట్టారు. కాఫీలు,  టీలతో  పెళ్లింటి  మర్యాదలు చేశారు.

ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన పాఠాలు వెలుగులోకి వచ్చాయి. వీటిని రాబోయే కృష్ణా జిల్లా దాతలు గమనించి మరింత పకడ్బందీగా చేసి గోదావరి పుష్కరాల మాదిరి ( నభూతో నభవిష్యతి అనరాదు) ఇది ప్రారంభం మాత్రమే, ముందు తరాల్లో ఇంకా బాగా చేస్తాం అనే స్ఫూర్తితో చేస్తారని ఆశిద్దాం.

-రామకృష్ణా మఠం వారు చిన్నపిల్లలకు పాలు, అందరికీ చిక్కని మజ్జిగ వితరణ చేయడం చాలా మంది చేత ప్రశంసలు కురిపించింది. వారు 12 రోజులూ అదే స్ఫూర్తితో  పాలు, మజ్జిగ అందించారు. ఇది అందరినీ విశేషంగా ఆకర్షించింది.

-కొందరు పళ్ల ముక్కల సలాడ్, పళ్లూ దానాలు చేశారు.

-పాలు, పళ్లు, అన్నం, పులిహోర వంటివి పంచడమే అన్నదానం కాదు. నిలువ ఉండే బిస్కట్లు, రొట్టెలు, పుల్కాలు వంటివి దానం చేసినా అన్నదానం లోకే వస్తుంది. నిజానికి మంచి పద్ధతి కూడా. గ్రామీణ ప్రాంతాల నుంచీ వచ్చే భక్తులు వీటిని మహా ప్రసాదంగా భావించి దాచుకుని సుదీర్ఘ ప్రయాణంలో వినియోగిస్తారు. అన్నదానం చేసే కొంత మంది ఈ విధమైన వాటిని దానం చేయడం మంచిది. ఎందుకంటే, యాత్రలలో ఏ ప్రయాణాలు అనుకున్న ప్రకారం జరగవు. రైళ్లు రద్దు కావచ్చు, ట్రాఫిక్ సమస్యలు రావచ్చు. ప్రయాణాలు అసహజ రీతిలో ఆలస్యం కావచ్చు. అటువంటి సమయంలో ఈ నిలువ ఉండే తినుబండారాలు యాత్రీకులకు ఎంంతో మేలు చేస్తాయి. ఈ పాఠం ఎన్ సి సి నేర్పుతుంది.  కేడెట్స్ సుదూర ప్రాంతాలలో కేంప్ చేసి ఇంటికి వెళ్లేటప్పుడు ఇటువంటి నిలువ ఉండే ఆహార కిట్ ఇస్తారు. వీటిలో ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్లు కూడా సైనిక సిబ్బంది ఇచ్చేవారు. రాయలసీమ, కృష్ణా జిల్లా వారు గమనించగలరు.

-బఫే vs టేబుల్ భోజనాలు:

* వీటిలో ఏది మంచిదీ అంటే దేని లోటుపాట్లు దానిలో ఉన్నాయి. పిల్లలూ, పిల్ల తల్లులూ, ముసలి వారూ బఫే భోజనాలు చేయలేరు.

* కానీ, బఫేలో వృథా చాలా తక్కువగా ఉంటుంది. ఏది కావాలో అదే వడ్డించుకుంటారు.

*  కూర్చోబెట్టి పెట్టడం మన సంప్రదాయం. కనుక టేబుల్ మీల్స్ మంచిదే. అయితే వృథా ఎక్కువ అవుతుంది. శుభ్రత కష్టం. ఒక బ్యాచ్ లేచే వరకూ మరో బ్యాచ్ వేచి ఉండాలి. కనుక, ఆలస్యం అవుతుంది. కానీ, ఇది తిరుపతి లాంటి చోట్ల కూడా లక్షలాది మందికి నిత్యం సమారాధన బల్ల భోజనాల పద్ధతిలోనే జరుగుతోంది. బల్లలూ, కుర్చీల ఖర్చు దాతలకు భారం అవుతుంది. వడ్డించే వారి సంఖ్య విపరీతంగా పెంచవలసి ఉంటుంది.

* అన్నదానం బఫే అయినా బల్ల భోజనం అయినా రుచిగా లేకపోతే వృథా అవుతుందని గుర్తుంచుకోండి. రుచిగా ఉంటే ఏ గ్రామీణుడూ అన్నాన్ని వృథా చేయడు.

* నిజానికి వృథా అనేది సృష్టిలో లేదు. అన్నం పారేస్తే దాన్ని పశుపక్ష్యాదులు తింటాయి. తద్వారా భూత శాంతి జరుగుతుంది. ఎంగిళ్లను నదిలో కలిపితే జలచరాలు తింటాయి. ప్లాస్టిక్ ఆకుల కన్నా అరిటాకులు వాడడం, వాటిని పశువులకు పెట్టడం మంచిదేమో?

* రుచిగా లేకపోతే, కళ్ల ఎదుటే పారేసిపోతారు. రుచిగా ఉంటే ఉప్పిడి పిండి, ఆవకాయ  పెట్టినా కళ్లకద్దుకుని తింటారు. మారు పెట్టడమే మంచిది. కొంచెం కొంచెం పెట్టడమే మంచిది.

* భోజనానికి పిలిచేటప్పుడే భోజనం పెడుతున్నామా? సాంబారన్నం, పెరుగన్నం, వెజ్ టబుల్ బిర్యానీ వంటి పొట్లాలు ఇస్తున్నామా అనేది స్పష్టంగా యాత్రీకులకు చెప్పడం చాలా మంచిది. ఎందుకంటే వచ్చే వారు ఒకటి ఆశించి వస్తే, దానికి భిన్నమైనది అమృతం ఇచ్చినా పుణ్యం బదులు పాపం వస్తుందని గమనించండి. ఇందుకే కొంత మంది స్పష్టంగా ‘‘ ఉప్పుడు పిండి – ఆవకాయ‘‘ అని చెప్పి ఆహ్వానిస్తే వందలాది మంది రాత్రిపూట వేడివేడి పిండి తిని అన్నదాతా సుఖీభవ అని ఆశీర్వదించడం కనిపించింది.

* అర్ధాకలితో ఎవరినీ పంపవద్దు. అది మహాపాపం. వారు వదిలేసినా మన సంప్రదాయమే. పెద్దలకు పెట్టే శ్రాద్ధాదులలో కూడా ‘‘అయ్యా మహనీయులైన భోక్తలు దొరికారు. మీకు రుచికరమైంది మాత్రమే తినండి, రుచించనిది విడిచిపెట్టండి‘‘ అనడం మన సంప్రదాయం. దీనికి విరుద్ధంగా ఆహారాన్ని వృథా చేయరాదు అనే సూత్రం ఇక్కడ వర్తించదు. ఇక్కడ పుణ్యానికి పెడుతున్నాం. రుచిలేని పదార్థం పెట్టి, యాత్రీకులు దాన్ని వదిలివేస్తే గొడవపడడం సంప్రదాయం కాదు. మహాపాపం. కనుక, ఏం పెట్టినా, రుచిగా పెట్టడం, కడుపు నిండా పెట్టడం పుణ్యం కోరే వారు చేయవలసింది. పెళ్లిళ్లలో, ఫైవ్ స్టార్ హోటళ్లలో జరిగే వృథాను ఖండిస్తూ వస్తున్న ప్రచారాలు ఇక్కడ అమలు చేయరాదు.

*సాధారణంగా పెద్ద ఎత్తున దానాదికాలు చేసే సత్తా వ్యాపారులు, ఆధ్యాత్మిక సంస్థలు, రాజకీయాల్లోకి వచ్చిన వారు, రావాలనుకునేవారికే ఉంటుంది. ఈ మూడు తరగతుల వారే ఎక్కువగా పెద్ద స్థాయిలో దానాలు చేయగలరు. వీరికి అంగ బలం, ఆర్థిక బలం కూడా ఉంటాయి. అన్నింటికీ మించి కార్యకర్తలు అందుబాటులో ఉంటారు. అయితే వారికి అన్నదానాలు చేయడంలో అనుభవం ఉండదు. ఇటువంటి అనుభవాలు స్వచ్ఛంద సంస్థల దగ్గర ఉంటుంది. ఉదాహరణకు సాయిబాబా, ఇకె, పెదముత్తీవి శ్రీకృష్ణాశ్రమం వంటి ధార్మిక సంస్థల వద్ద ఇటువంటి అన్నదానాలు చేసే అనుభవాలు అపారంగా ఉన్నాయి. కనుక వారి సాయం తీసుకుంటే మరింత విజయవంతం అవుతాయి.

* ఉభయ గోదావరి జిల్లాల్లోనూ ఎవరూ యాత్రీకుల నుంచీ విరాళాలు సేకరించలేదు. కనీసం హుండీలు కూడా ఏర్పాటు చేయలేదు.  కేవలం భక్తి భావంతో నే అన్నదానం చేశారు. ఇది అందరి ప్రశంసలనూ పొందింది.

* ఆకలి అందరికీ సమానమే అయినా, బ్రాహ్మణ్యాన్ని విస్మరించిన అన్నదానం నిష్ఫలమే అవుతుంది. బ్రాహ్మణ సంతర్పణలు చేయటం దాతలకు సంపూర్ణత్వాన్ని చేకూరుస్తుంది.

స్వచ్ఛ భారత్ :

గ్రామీణులకు శుచీ శుభ్రతా నేర్పించక పోవడం మన తప్పే. క్యూలలో ఉన్న వారికి పలు అంశాల మీద అవగాహన కలిగించడం మంచిది. ఉదాహరణకు ఉమ్మివేయడం, బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేయడం, పొగాకు మద్యపానం చేయడం వంటివాటికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి ఇదే సరైన సమయం. కుటుంబ సమేతంగా ఉన్నవారు సిగ్గుపడైనా ఈ దోషాలను నివారించుకోవడానికి కనీసం ఆలోచిస్తారు.

వ్యాపార ప్రచారాలు:

కొన్ని వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తుల ప్రచారాలను చేసుకుంటున్నాయి. చూయింగ్ గమ్ వంటి వాటిని ఉచితంగా పంచుతున్నారు. నాణ్యత లేని వ్యాపారులను అరికట్టడమే మంచిది. నాణ్యత ఉండీ ఉచితంగా పంచుతామంటే అటువంటి వ్యాపారులను ప్రోత్సహించడం మంచిదే అనే వారు లేకపోలేదు.

నదులలో రాళ్లు, మట్టి వేయవద్దు:

దయచేసి నదులలో స్నానాల పేరు చెప్పి మట్టినీ, రాళ్లనీ వేయవద్దు. అది శాస్ర్తీయం కాదు. కేవలం మిడిమిడి జ్ఙానంతో శాస్ర్తపాండిత్యం లేని వారు చెప్పిన ఘోరమైన, సామాజిక నేరమైన ప్రవచనం మాత్రమే. శాస్ర్తీయమైన ప్రామాణికతను పుష్కర గోదావరిలో మట్టి, రాళ్లు వేయకండి !!! అనే అనుసంధానం ద్వారా చదవగలరు.

ప్రకటనలు