“Free” “Net”

wp

cyber001

‘వందేమాతరం!‘ అంతర్ ‘‘జాలంలో భారతం‘‘ -ఏలూరిపాటి

భారతదేశంలోని అన్ని కార్యాలయాల్లోనూ అతిముఖ్యమైనది ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంఓ). దీనితో సహా అనేక జాతీయ అంతర్జాతీయ వ్యాపార కార్యాలయాలు టెలీకాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కార్యాలయం వైపు ఎదురు చూస్తున్నాయి. ట్రాయ్ ఏమంటుంది? ఎస్ అంటుందా? నో అంటుందా? అని నరాలు చిట్లే ఉత్కంఠతతో కుర్చీ అంచున కూర్చుని ఎదురు చూస్తున్నాయి. కొంత మంది కూర్చోలేక నిల్చోలేక సతమతమవుతున్నారు. ట్రాయ్ తన నిర్ణయాన్ని ఈ నెలాఖరులోగా చెప్పబోతోంది.

ట్రాయ్ కనుక ఎస్ అంటే అమెరికా నుంచీ ఇండియా వరకూ కొన్ని వ్యాపార సంస్థలు పండగ చేస్కో బావయో అంటూ పాటలు పాడుకుంటూ టపాసులు కాల్చుకుంటాయి. కానీ, దేశంలో ఒక్కసారిగా వాతావరణం గంభీరంగా మారిపోతుంది. ట్రాయ్ కనుక నో అంటే భారతదేశంలో డిజిటల్ స్వేచ్ఛ కావాలనే కొందరు అల్పసంఖ్యాక పోరాటదారులు సంతోషిస్తారు. అయితే వీరిని ఎదుర్కోవడానికి డాలర్ బాబులు మరో వ్యూహం సిద్ధం చేసుకున్నారు కనుక దాన్ని వెంటనే అమలు చేయడానికి సిద్ధపడతారు.

ఇంతకీ వీరు ఏం కోరుతున్నారు? ట్రాయ్ దేనికి ఎస్ అంటోంది? దేనికి నో అంటోంది? ఇది బిలియన్ బిలియన్ డాలర్ల (అంటే ఒకటి పక్కన పద్ధెనిమిది సున్నాలు వేసి, ఒకటిని అరవైతో హెచ్చవేయాల్సిన) ప్రశ్న. ఇక్కడ వినిపించే పదాలు మూడు. ఫేస్ బుక్ సంధించిన ‘‘ ఫ్రీ బెసిక్స్‘‘. సేవ్ ఇంటర్నెట్ ఔత్సాహికులు సంధించిన ‘‘నెట్ న్యూట్రాలిటీ‘‘ అస్త్రం. వీటి రెండింటి మధ్య ట్రాయ్ అంటున్న ‘‘డిఫరెన్షియల్ ప్రైసింగ్‘‘ పాలసీ.

కేవలం 120 కోట్ల భారతీయుల్లో కేవలం కొద్ది మందికి మాత్రమే ‘‘ వైట్ కాలర్ యుద్ధం‘‘లో జరుగుతున్న బాంబింగులు, మరఫిరంగి గర్జనలు, బీటలు వారుతున్న కోటల గురించి తెలుసు. ఎవరు ఎటువైపున్నారో తెలుసు. హస్తినలో ‘‘బిల్ కుల్ అహింసాత్మకంగా‘‘ జరుగుతున్న ఆధునిక కురుక్షేత్రరణరంగం గురించి తెలుసు. అయితే ఎవరు పాండవులు? ఎవరు కౌరవులో ఇప్పుడే చెప్పడం చాలా కష్టం. తెలిసిన వారు కూడా ఇప్పటి వరకూ వ్యూహాత్మక మౌనం వహించారు.

కొత్త సంవత్సరంలో అందరూ ఆనందంగా అడుగుపెడితే, అంతర్జాల మాయామర్మాలు తెలిసిన వారు గుప్పెడంత గుండెను చేతబట్టుకుని 2016ను ఆహ్వానించారు. ఎందుకంటే గత ఏడాది చివరి రోజుతో ఇ-కురుక్షేత్రం ముగిసిపోవాల్సి ఉండగా, ట్రాయ్ జనవరి 7 వరకూ అభిప్రాయ సేకరణ గడువు పెంచింది. మరో వారం రోజులు అంటే జనవరి 14 వరకూ ప్రతి-స్పందనలకు (కౌంటర్ ఒపీనియన్లకు) అవకాశం ఇచ్చింది. దీంతో ఈ ఏడాది చాలా నిశ్శబ్దంగా దేశభవిష్యత్తును నిర్ణయించే వైట్ కాలర్ యుద్ధంతో మొదలైందని నెట్ పండితులకు మాత్రమే తెలుసు. జనవరి 14 తో ముగిసిన ప్రత్యక్షయుద్ధం తన రణరంగాన్ని నాలుగు గోడల మధ్య ఏసీ యంత్రాల కిందకు మార్చుకుంది. మరో వారం అంటే జనవరి 21 వ తేదీన హస్తినలో అతిరథమహారథులను ఏకవేదికపై తెచ్చి వాక్యుద్ధం చేయమంది. చాలా డిప్లమాటిగ్గా కట్ త్రోట్ యుద్ధం గురువారం హస్తినలో జరిగిందని అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు. దీని తరువాత ఎవరు విజేతలో చెప్పాల్సిన బాధ్యత ట్రాయ్ టెన్నిస్ కోర్టుకు వెళ్లింది. అది తన సలహా అనే బంతిని ఎప్పుడు కొడుతుందో అని అందరూ ఎదురు చూస్తున్నారు. ప్రధాన మంత్రి కార్యాలయానికి తన సలహాను ఈ నెలాఖరులోగా పంపడానికి అవకాశాలున్నాయి. దీనితో మరో యుద్ధం మొదలు కాబోతోంది.

ట్రాయ్ ఇచ్చే సలహా ప్రభుత్వం ఏవిధంగా స్వీకరిస్తుంది అనే అంశం పై దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది. కాశ్మీర్ సమస్యనైనా తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు కానీ, డిజిటల్ ఇండియా భవిష్యత్తును తీర్చిదిద్దే కీలకమైన నిర్ణయం అర్థం చేసుకోవడం తేలికకాదు. దీనికి సాంకేతిక పరిజ్ఞానం కావాలి. అంతర్జాతీయ వ్యాపారతీరు తెలియాలి. వ్యాపారయుద్ధతంత్రాలు తెలియాలి. రాజకీయ ఎత్తుగడలు తెలియాలి. అన్నింటికీ మించి స్వచ్ఛమైన హృదయంలోని దేశభక్తి అంటే ఏమిటో తెలియాలి. భారతమాతకు స్వాతంత్ర్యం ఎంత కష్టపడితే వచ్చిందో తెలియ చెప్పే చరిత్ర తెలియాలి.

దీనికి పీఠిక మనలో చాలా మంది ఫ్రీ బేసిక్స్ , నెట్ న్యూట్రాలిటీలో దేనికో ఒక దానికి ఓటు వేయండంతో మొదలైంది. కొంతమంది కనీసం ఆ రెండు పదాలైనా తెలుసుకున్నారు. కానీ, మూడో పదం, ముఖ్యమైంది ఉంది అదే డిఫరెన్షియల్ ప్రైసింగ్. వీటిలో ట్రాయ్ దేన్ని ఓకె అంటుంది? అనేది మనం ఎదురు చూడాల్సిన అంశం.

హస్తినలో కంటికి కనిపించని శస్త్రాస్త్రాలతో కాచుకు కూచున్న ఇ-రణంపై ప్రత్యక్షవ్యాఖ్యానం ఇక మీదట మీకు ఈ బృందం అందించబోతోంది. దయచేసి మీ పిల్లల డిజిటల్ భవితవ్యం కోసం దీన్ని చదవండి. మీ మిత్రుల చేత చదివించండి.

%d bloggers like this: