yar_lyపాముకు పాలు పోయరాదు అంటారు.  కానీ, తెలిసి తెలిసీ నాచేత పాలు పోయించారు. నాచేత అభిషేకం చేయించి ‘‘నాయనా‘‘ సామాన్యుడు కాదు. సాక్షాత్తూ ఆదిశేషుడి అవతారమూర్తి ముత్తీవి లక్ష్మణదాసుల కుమారులు.

పాముకు పాలు పోయరాదు అంటారు. పాముకు పాలు పోసినా విషమే కక్కుతుంది అని కూడా అంటారు. కానీ, తెలిసి తెలిసీ నాచేత పాలు పోయించారు. నల్లటి పడగలు మీద తెల్లని పాలు జాలు వారాయి. అది మామూలు పాము కాదు. మహా సర్పం. దానికి ఒక పడగ కాదు. రెండు పడగలు కాదు. ఏకంగా వేయిపడగలు ఉన్నాయి
దేవుళ్లకూ పాములకూ విడదీయలేని బంధం ఉంది. ఒకడు మెళ్లో చుట్టుకుంటే, మరొకడు ఒళ్లో పడుకున్నాడు. మరొకడు నెత్తినెక్కి చిందులేశాడు. దీంతో పాపం వాళ్ల భార్యలు మాత్రం ఏంచేస్తారు? పిల్లలకు రెడీమేడ్ పంచకట్టు విత్ డైపర్స్ లేవయ్యే. ఏదో చీర చెంగు చింపి పిల్లాడి బానపొట్టకి పంచెకట్టి, వాళ్లాయన దగ్గరున్న పాములకు పుట్టిన పాంపిల్లను బెల్టుగా కట్టింది ఒకావిడ. మరొక కొడుకు ఏకంగా పాము అవతారం గా మారి సుబ్బారాయుడయ్యాడు. విచిత్రం ఏమిటంటే ఈ పాము అవతారం ఉన్నాయన వాహనం నెమలి. దీనికి పాము కనిపిస్తే హాయిగా నాట్యం చేస్తూ విందారగిస్తుంది. అసలు పాములను విడదీసి ఏదేముడైనా ఉన్నాడా అని చూస్తే దాదాపు ఎవరూ లేరు. ఇదంతా ఆలోచిస్తూనే అభిషేకం పూర్తి చేశాను.
నాచేత అభిషేకం చేయించి‘‘నాయనా‘‘ సామాన్యుడు కాదు. సాక్షాత్తూ ఆదిశేషుడి అవతారమూర్తి ముత్తీవి లక్ష్మణదాసుల కుమారులు. ఇక్కడ మరో విచిత్రం ఉంది. ‘‘సీతారాము‘‘లకు లక్ష్మణ స్వామి ఎప్పుడూ కుమారుడే. విచిత్రమే మంటే లక్ష్మణస్వామికి ‘‘సీతారాము‘‘లు పుట్టడం. నా ఆలోచనలకు నాకే నవ్వు వస్తోంది. ఇంతలో నాన్న చెప్పిన సూక్తి గుర్తుకువచ్చింది. ‘‘ఆత్మావై పుత్రనామాసీ.‘‘ ‘‘ కుమారుడిగా ‘తానే‘ పుడతాడ‘‘ని దీని అర్థం. సరైన సందర్భంలోనే గుర్తుకువచ్చిందని అనుకున్నాను.
ఏదైనా ఒకసారి చెప్పింది రెండో సారి చెప్పడం అంటే నాన్నకు ఇష్టం ఉండేది కాదు. కానీ, ఈ సూక్తికి మాత్రం సంపూర్తి మినహాయింపు ఉండేది. నాన్న నాకు అనేక మార్లు దీని గురించి చెప్పేవారు. వేదాంత శాస్ర్తమంతా ఈ సూక్తిలోనే ఉందని, దీన్ని అర్ధం చేసుకుంటే సర్వ సంశయాలూ నశించిపోతాయని ఆయన అనేవారు. ఇక్కడ ఒక విషయం చెప్పితీరాలి.
మా నాన్న ఎప్పుడూ నన్ను‘‘నాన్నా‘‘ అనిపిలిచేవారు.
‘‘నేను నిన్ను నాన్న అని పిలుస్తున్నాను. నువ్వు మా నాన్నవు కాబట్టి. మరి నువ్వేందుకు నన్ను నాన్నా అనిసిలుస్తున్నావు?‘‘ అని అడిగాను.
నా జీవితంలో బహుశా నేను మా నాన్నను వేసిన మొదటి ప్రశ్న ఇదే కాబోలు.
బాగా చిన్నప్పుడు మా నాన్న ‘‘నువ్వు మా నాన్నవురా!‘‘ అనేవారు. నాకు వయసు పెరిగే కొద్దీ అనేక  విశేషాలు ఈ అంశం మీదే చెప్పేవారు. విన్న ప్రతీసారీ కొత్తవిషయాలు నాకు తెలిసేవి.
మా ఇంటి చుట్టు పక్కలవారు అనేక మంది, వాళ్ల నాన్నలను నాన్నగారు అని పిలవడం చూసి, నేను కూడా నాన్నగారు అని పిలుద్దామని చూశాను. దానికి ఆయన ఒప్పుకోలేదు. నాన్న అనే పిలవమనేవారు.

నేను ఎప్పుడు అడిగినా, ఎన్ని సార్లు అడిగినా, నా జీవితంలో అనేక పర్యాయాలు ఈ సూక్తి మీద ఆయన ఉత్సాహంగా చెప్పేవారు.
తండ్రే కొడుకుగా పుట్టడం అంటే ఏమిటో అర్థం చేసుకుంటే వేదాంతశాస్త్రంలో ఇంక అర్థం చేసుకోవాల్సింది ఏమీలేదని అనేవారు. ఆత్మ తనకు తానుగా ఉంటూనే మరొక రూపం ఎలా పొందుతుందో సారూప్యంగా అర్ధం అవుతుంది అని అనేవారు.
కొడుకుని ప్రతీ తండ్రీ ఎంత ప్రేమిస్తాడు అంటే తన మీద తనకు ఉన్నంత ప్రేమగా ప్రేమిస్తాడు. కొడుకు వేరు తాను వేరు అనుకోనంతగా ప్రేమిస్తాడు. తానే కుమారుడు, కుమారుడే తాను అనే మొదటి జ్ఙానం కుమారుడు పుట్టినప్పుడు కలుగుతుందట. ఇంత వరకూ బాగానే ఉంది మరి ఇద్దరు కుమారులు ఉంటేనో అంటే ఇద్దరు కుమారులు ఉన్నా, ఆరుగురు కుమారులు ఉన్నా ‘‘తాను ఒక్కడినే, తాను తానుగా ఉంటూ, ఇంత మంది కుమారులుగా పుట్టాను‘‘ అని తెలుసుకుంటారు. ఆరు కుండలలో ఉన్న నీటిలో ఆరుగురు సూర్యులను చూసి ఆరుగురు సూర్యులు ఉన్నారు అని అనుకోవడం ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో, తనకున్న ఆరుగురు కుమారులను చూసి తెలుసుకుంటాడని ఆయన చెప్పేవారు.
మా కృష్ణ యజుర్వేద శాఖకు గుండెకాయలాంటి తైత్తిరీయోపనిషత్తు వేదాంత శాస్త్రంలోని ‘‘సయశ్చాయం పురుషే‘‘ అనే మంత్రాన్ని అతి తేలిగ్గా అర్ధం అయ్యేట్లు చెప్పేవారు.
అనేక మంది కుమారులకు అనేక మంది తండ్రులు లేనట్లే, అనేక శరీరాలకు అనేక ఆత్మలు లేవు.
‘‘ఉన్నది ఒక్కటే.‘‘
‘‘అదే తాను, తానే అది.‘‘
ప్రతీ జీవికీ ఈ రహస్యం అనుభవంలోకి రావడానికి శాస్ర్తాలు ‘‘ఒక కుమారుని‘‘ కనాలి అని ఆదేశించాయట. అసలు జ్ఞానం పోయింది. కూతుళ్లను చంపడం, కొడుకులను కనడంలోకి హైందవత్వం జారుకుంటోంది. బతికి బట్టకట్టిన బ్రాహ్మణ సంసారాల్లోని ఆడపడుచులు కూడా తండ్రికి కొడుకు అంటేనే ఇష్టం అని తన సోదరుని మీద ద్వేషం పెంచుకుంటున్నారు. పూతన, తాటకీ పుత్రికలుగా మారుతున్నారు.
భార్యతో సంసారం చేస్తూ సకలవేదాంతసారాన్నీ తెలుసుకునే మహత్తర అవకాశం కేవలం హిందూ ధర్మాచరణలోనే ఉంది. కనుకనే సకల సాధనలలోనూ వైవాహిక జీవితం పరమోత్కృష్టమైనది అని వేదాంతులు చెప్పారు. అతి తేలిగ్గా వేదాంతసారం అనుభంంలోకి వస్తుందట. ఇంత తేలిగ్గా జీవన వేదం అర్ధం అవుతుంది కనుకనే వివాహం, సంసారాన్ని మన పూర్వీకులు ఏర్పరచారట. నాన్న చెప్పిన మాటలు ఎందుకో మననం అవుతున్నాయి.
ఏ జ్ఞానం ఉంటే సమస్తం తెలసిపోతుందో, దాన్ని నాన్న ఇచ్చారు. బ్రహ్మోపదేశం అంటే ఇదేనేమో. కొడుకు పుట్టి తండ్రికి బ్రహ్మజ్ఞానం అనుభవంలోకి తెస్తే, కుమారునికి తండ్రి బ్రహ్మోపదేశం చేస్తాడు.
కృష్ణా జిల్లాలోని పెదముత్తీవిలోని ముముక్షుమహాజనపీఠం, శ్రీశ్రీశ్రీ సీతారామ యతీంద్రులు, శ్రీశ్రీశ్రీ లక్ష్మణ యంతీంద్రుల అనుగ్రహం పొందిన వారికి ఈపాటికి నేను ఎవరి గురించి చెబుతున్నానో అర్ధమయ్యే ఉంటుంది. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే జులై 15 బుధవారం అమావాస్య రోజున మా సోదరులు నాచేత పాముకు పాలు పోయించారు. పాలు పోస్తున్న నాకు నవ్వు ఆగడంలేదు. ప్రపంచంలో ఎంతో మంది ధైర్యవంతులు భయంకరమైన అమేజాన్ పరీవాహక అడవులు గాలించి చెట్టు నుంచీ, పుట్టనుంచీ, పామునుంచీ, క్రిమి కీటకాల నుంచీ విషాలు సేకరించి కేన్సర్ చికిత్స కోసం మందులు తయారు చేస్తున్నారు. వీళ్లందరినీ మా సోదరులు పరిహసిస్తున్నట్లు పెరట్లో ఉన్న ఆదిశేషుడికి అందరి చేతా పాలాభిషేకం చేయిస్తున్నారు. బహుశా శేషుడికి మించిన విషం ఇంక ఎవరి దగ్గర ఉంటుంది అని ఆయన ఉద్దేశం అయిఉండవచ్చు. అందుకే ఆయన నాచేత కూడా పాలు పోయించారు. ఇంక ప్రపంచాన్ని నాశనం చేస్తున్న కేన్సర్ ను అంతం చేసే విషం కక్కడమే తరువాయి.
కాలకూట విషమే కేన్సర్ కు విరుగుడైతే, ఆది శేషుడి దగ్గరలేని గరళం ఎక్కడ ఉంటుంది? అటువంటి ఆది శేషువు కాషాయాలు కట్టుకుని మా నట్టింటిలో కొలువుతీరేది. గుంటూరు వస్తే మా ఇంటికి మాత్రమే వచ్చేది. ఇంక ఎవరింటిలో విడిది చేసేది కాదు. అంతగా మా మీద అనురాగం చూపేది. కనుకనే, నాకు కేన్సర్ అంటే భయంలేదు. ఎంతగా భయంలేదు. అంటే కేన్సర్ వైద్యంలో నాకు మించిన వైద్యుడు లేడని రొమ్ము విరుచుకున్న వైద్యుడు కూడా నా ధైర్యం చూసి ఆశ్చర్యపోయేంతగా నాకు కేన్సర్ అంటే భయంలేదు. ఆ వైద్యుడు ఆశ్చర్యపోవడమే కాదు. ఆ విషయం తన నోటితో తానే స్వయంగా చెప్పారు కూడా. ‘‘మీకున్న ధైర్యం చూసి వైద్యం చేస్తున్నాను. కేన్సర్ జయించాలంటే ముందు ఉండాల్సింది ఇటువంటి ధైర్యమే.‘‘ అని ఆయన రహస్యంగా నాతో అసలు రహస్యం చెప్పేశారు. అది వేరే సంగతి. ఆయనకు వైద్యం తెలుసు కానీ, నా వెనుక ఉన్నదెవరో ఆయనకు ఏం తెలుసు? లక్ష్మణయతీంద్రులవారి ఆశీర్వచనం నాకు ఉండగా కేన్సర్ నన్నేం చేయగలదు?
ఇప్పటికీ నాకు బాగా గుర్తున్నది. నేను మొదటి సారి గురువుగారి ఆశ్రమానికి వెళ్లడం.

మగసంతానం లేకపోతే మా అమ్మ చిన్న తిరుపతి వెంకన్నకు మొక్కులు మొక్కింది. పుట్టినప్పటి నుంచీ మూడు సార్లు దర్శనానికి కుమారుడిని పంపించడమో, తీసుకురావడమో చేస్తానని మొక్కుకుందట. మొక్కులో భాగంగా నేను చిన్నతిరుపతి వెళ్లాలని హైస్కూలులో చేరినప్పుడు నాకు ఆమె చెప్పింది. దాదాపు 10 ఏళ్ల వయసు నాకు. మా నాన్న రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. గుంటూరు నుంచీ నేను ఏలూరు వెళ్లడం. అక్కడ ఆశ్రమానికి వెళ్లడం. ఆశ్రమంలో ఆ రోజు ఉండి మరునాడు మొదటి బస్సుకు బయల్దేరి చిన్నతిరుపతికి వెళ్లడం. తరువాత అక్కడికి దగ్గరలో ఉన్న మా మేనత్తగారి ఇంటికి వెళ్లడం చేయాలి. ప్రతి మజిలీలోనూ కావలసిన చిరునామాలూ, కొండ గుర్తులూ మానాన్న వివరంగా చెప్పారు. వాటి ప్రకారం నేను బయల్దేరి ముందుగా ఏలూరులోని ఆశ్రమానికి వెళ్లాను. వెళ్లి ఆశ్రమం తలుపు కొట్టి నేను ఫలానా అని చెప్పి లోపలకు వెళ్లే సరికి ఆశ్రమంలోని వారంతా ఆశ్చర్యపోయారు. గురువుగారు మాత్రం నవ్వుతూ నమస్కరిస్తున్న నా వీపుమీద తట్టి, లేవదీసి నన్ను అక్కున చేర్చుకున్నారు. నేను ఒంటరిగా వచ్చాను అంటే ఆశ్రమంలోని వాళ్లకు నమ్మడం ఓపట్టాన శక్యం కాలేదు. ‘‘వామనుడు‘‘ అంటూ ఏదేదో చెప్పారు.
నాకు బాగా గుర్తున్నంత వరకూ పవర్ పేట రైల్వే స్టేషన్ దగ్గర సరిగ్గా ‘‘పవర్ పేట‘‘ అని రైల్వే బోర్డు ఎదురింట్లో సీతారాం అన్నయ్య ఉండేవారు. ఆ ఇంటిలో నేను ఉన్నట్లు నాకు జ్ఙాపకం ఉంది. సోదరులు నాకు ఒక ఆశ్రమవాసిని తోడిచ్చి ఆరాత్రి ఒక సినిమా చూపించారు. మరుసటి రోజు ద్వారకా తిరుమల బస్సు ఎక్కించారు. అది మొదలు అనేక సార్లు నేను ఒంటరిగానే ఆశ్రమానికి వెళ్లే వాడిని.
అప్పుడు మొదలైంది నా ఒంటరి ప్రయాణం అని చెప్పవచ్చు. నాన్న నన్ను పెంచిన తీరు, ఆయన దార్శనికత కొంచెం కొంచెం వయసు పెరిగే కొద్దీ అర్ధం అవుతున్నాయి. నా జీవితంలోని మొదటి ప్రయాణంలోని మొదటి మజిలీ లక్ష్మణ యతీంద్రుల సందర్శనంతో ప్రారంభమైంది.
అభిషేకానికి లైన్ లో నిలుచున్న నాకు మరో విషయం అర్ధం కావడంలేదు. నేను పోసిన పాలు తాగి, ఈ పెద్దపాము ఎంత భయంకరమైన విషం కక్కినా నేను ఔషథం తయారు చేసుకుంటాను. హరాయించుకుంటాను. కానీ, ఈ ముసలీ ముతకా, పిల్లాజెల్లా, తల్లీచెల్లీ, అక్కాబావా, అన్నాతమ్ముడూ, కుర్రదీకుర్రాళ్లూ వీళ్లంతా ఎందుకు పాలు పోస్తున్నారో అర్ధం కావడంలేదు. నేల ఈనినట్టు వీళ్లంతా వేల సంఖ్యలో పుట్టుకొచ్చి, ప్రశాంతంగా ఉన్న ఆశ్రమంలో ఒక్కసారిగా వాసుదేవ, వాసుదేవ అంటూ మరీ పాలు పోస్తున్నారు. నడవలేని వాళ్లు కూడా లంఘించుకుంటూ వచ్చి పాలుపోస్తున్నారు. మొగుడు రాని వాళ్లు, పెళ్లాం పెనం లేని వాళ్లు, ఉద్యోగం సద్యోగం లేనివాళ్లు కూడా పాలుపోసేస్తున్నారు.
మా సోదరుడు అన్నీ ఇలాంటి పనులే చేస్తాడు. పాముకు పాలు పోయిస్తాడు. అవన్నీ జాగ్రత్తగా ఒడిసి పట్టుకుని మళ్లీ మా నెత్తిమీద వేస్తాడు. ఇది శ్రీకృష్ణాశ్రమానికి కొత్తేం కాదు. లక్ష్మణ యతీంద్రుల వారు కూడా ఇంతే. ఆయన ఏం చేసినా ఇలాగే వేలాది మంది వస్తారు. అప్పుడెప్పుడో ఒకసారి ధనుర్మాసానికి విశాఖలో హారతులు ఇవ్వండమ్మా అని ఆయన అంటే, ఒకరా ఇద్దరా? వేలాది తల్లులు చన్నీటి స్నానాలు తెల్లవారఝామునే చేసి చలిలో హారతులు పట్టుకుని ఎదురెదురుగా రెండు లైన్లలో నిలుచుంటే, ఆ వరుస కిలోమీటర్ల కొద్దీ పాకిందట. మా అమ్మగారే ఈ విషయం నాకు చెప్పేవారు. ఇప్పుడూ అదే కొనసాగుతోంది.
ఒక ఊషర క్షేత్రం కూడా మహా పుణ్య క్షేత్రం అయిందీ అంటే దాని వెనుక ఎందరో మహాను భావుల కృషీ, అనుగ్రహం ఉంటుంది. పెదముత్తీవి ఇందుకు అతీతం కాదు. సీతారామ యతీంద్రుల వారు, లక్ష్మణయతీంద్రులవారు తమ తపోబలంతో పెదముత్తీవిని పుణ్యక్షేత్రంగా మార్చారు. వారు శ్రీకృష్ణాశ్రమం స్థాపించకుండా ఉంటే అనేక లక్షల అనామక గ్రామాల మాదిరిగా పెదముత్తీవి కూడా ఉండిపోయేది. యతీంద్రుల కారణంగా ఎంతో మంది మహానుభావులు ఆ క్షేత్రం మీద పాదం మోపారు. మా నాన్నతో కలిసి నేను ఎన్నోసార్లు పెదముత్తీవి వెళ్లాను. మా నాన్న నడయాడిన ఈ నేల అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. అంతేకాదు, లక్షమందికి ఒకేసారి సమారాధన చేసిన రోజులో కూడా యతీంద్రులవారు మా నాన్న చేయి పట్టుకుని పందిళ్లన్నీంటినీ దగ్గరుండి చూపించారు.
ఎప్పటి లాగే ఇద్దరూ కలిసి కూర్చుని భిక్ష పంచుకుని చివరిసారి తిన్నారు. ఇది జరిగిన కొద్ది రోజులకే యతీంద్రులవారు సిద్ధిపొందారు.
మాస్టర్ సివివి, మాస్టర్ ఇకె  ఒకరేమిటి దశాబ్దాల తరబడి  శ్రీకృష్ణాశ్రమాన్ని ఎంతో మంది తమ పాదస్పర్శతో పెదముత్తీవిని పావనం చేశారు. కనుకనే పెదముత్తీవి దివ్యక్షేత్రం అయింది. పెదముత్తీవి దివ్య క్షేత్రం కావడం వెనుక ఇంత మంది అనుగ్రహం ఉంది. భూ మండలం మీద ఎవరో ఒక మహాత్ముడు పూనుకోపోతే ఒక దివ్యక్షేత్రం ఆవిర్భవించి ఉండేది కాదు.
అభిషేకాలు అయిపోయాక, మెల్లగా సోదరుని దగ్గర చేరి అనుగ్రహ భాషణం కోసం చూస్తున్నాం. ఈ లోపల అక్కడే కూర్చున్న అమ్మ సందర్భ వశాత్తూ అన్నారు.
‘‘పుష్కరాల సమయంలో గోదావరి పుష్కరతీర్థం ప్రతిరోజూ ఆశ్రమానికి వస్తోంది.‘‘
ఆ మాటలంటున్నప్పుడు అమ్మముఖం నేను చూశాను. ఆమె నవ్వుతూ ఆమాటలు అంటున్నారు. అమావాస్య రోజున అన్ని వేల మందితో అభిషేకాలు చేయించినా ఆమె వదనంలో ఏ పాటి శ్రమా కనిపించడం లేదు.
అమ్మ ఈ మాటలు అనడమేమిటి? ఒక భక్తుడు ఉత్సాహంగా ఎవరెవరు గోదావరి తీర్థాలను ఆశ్రమానికి తీసుకు వచ్చిందీ, గోదావరి తీర్థాన్ని తీసుకు రావడానికి వెళ్లిందీ చెబుతున్నారు. గోదావరే స్వయంగా కృష్ణాజిల్లాలోని పెదముత్తీవి క్షేత్రానికి వస్తోందని అతను సాక్ష్యం చెబుతున్నట్టు నాకు అనిపించింది.
నాకు మరోసారి నవ్వు వచ్చింది.
కొవ్వూరు తీరంలోని గీర్వాణ పీఠంలో భాషావిద్యాప్రవీణులైన జంటకవుల  కోడలు ఆ మాత్రం గూఢంగా మాట్లాడడంలో వింతలేదు. నా పక్కన కూర్చున్న భాయిలకు ఏం అర్థమైందో కానీ నాకు మాత్రం చాలా ఆనందం వేసింది. ఉదయం నేను చూసినప్పుడు వదినమ్మ నివేదన కోసం చిమ్మిలి ఉండలు చేస్తూ కనిపించారు. ఇప్పుడు నారికేళ పాకం పంచిపెట్టారు. కాదంటే ఇనప గుగ్గిళ్లు. నారికేళపాకం కావాలంటే కొబ్బరకాయ కోసం చెట్టు ఎక్కాలి, కాయ కోయాలి, కాయ ఒలవాలి, పగలగొట్టి నీళ్లు తాగాలి. అది అంతకష్టం.
స్నానం చేసి పుణ్యాలను సంపాదించుకోవాలని యాత్రీకులు అందరూ వెళ్లి గోదావరిలో తమ పాపపంకిలాలను వదిలించుకుంటారు. వీరందరి పాపాలతో గోదావరి మలినం చెందుతుంది. మరి గోదావరికి అంటిన మన పాపాలను ఎవరు దూరం చేస్తారు అంటే మహాత్ములు అనే సమాధానం వస్తుంది. కంచి స్వామీజీ, కుర్తళం స్వామీజీ వంటి ఎందరో మహానుభావులు కూడా పుష్కరస్నానం ఎందుకు చేస్తారూ అంటే, గోదావరిని పావనం చేయడానికి అని తెలసిన వారు సమాధానం చెబుతారు.
పూర్వం ఒక మహర్షి ఆశ్రమానికి మురికి పట్టిన వస్త్రా లతో, మలిన వదనాలతో కొంత మంది స్ర్తీలు వచ్చి, ఆయనను దర్శించి దివ్యాంగనలుగా మారి వెళ్లేవారని పురాణాలు చెబుతున్నాయి. అది ఆక్షేత్రంలోని మహర్షి తపోబలం. కనుకనే సకల తీర్ధాలూ ఇటువంటి తపోధనుల దగ్గరకు ఏదో ఒక రూపంలో చేరుకుంటాయి. దివ్యతీర్థాల దగ్గరకు బిడ్డలు వెళ్లకపోతే దివ్యనదులే వారిని చేరుకుంటాయి. ఇదే క్షేత్రతీర్థమాహాత్మ్యం.

తీర్థ క్షేత్ర మాహాత్మ్యం సంగతులు మా నాన్న చెప్పారు. నా ఒక్కడికే కాదు. రేడియోలో తెలుగు వచ్చిన వారందరికీ సూక్తి ముక్తావళి రూపంలో చెప్పారు. వీలు వెంట అది  www.anantashiti.org ద్వారా వినండి.

ఇవి మా పెదముత్తీవి పర్యటనా విశేషాలు.

ప్రకటనలు