Godavari River1పుష్కర స్నాన విధుల్లో కొంత మంది పర్యావరణ వ్యతిరేక విధానాలు ప్రబోధిస్తున్నారు. ఇది  సంప్రదాయ వ్యతిరేకం కూడా. స్నానం చేయబోయే ముందు గోదావరిలో కొంత మట్టిని కానీ, రాళ్లను కానీ వేయాలని శాస్ర్తాలు చెప్పడం లేదు. దీనికి ఎటువంటి శాస్త్రీయత లేదు.

పుష్కర స్నాన విధుల్లో కొంత మంది పర్యావరణ వ్యతిరేక విధానాలు ప్రబోధిస్తున్నారు. ఎనిమిది కోట్ల మంది గుప్పెడు మట్టి తీసి గోదావరిలో వేస్తే గోదారికి పారడానికి కొత్త దారులు వెతుక్కోవాల్సి రావడం ఖాయం. (పుష్కరాల్లో 8 కోట్ల మంది స్నానం చేస్తారని ఒక అంచనా.) ఇది కేవలం పర్యావరణ వ్యతిరేకమే కాక, సంప్రదాయ వ్యతిరేకం కూడా. ఇటువంటి వారు చెబుతున్న వాటిలో మహాఘోరం, నేరమైన అంశం స్నానం చేయబోయే ముందు గోదావరిలో కొంత మట్టిని కానీ, రాళ్లను కానీ వేయాలని చెప్పడం. దీనికి ఎటువంటి శాస్త్రీయత అటు ధర్మపరంగా లేదు. ఇటు ఆధునికంగా కూడా లేదని చెప్పడానికి విచారిస్తున్నాము. దీనికి సంబంధించిన శాస్త్రీయ వాదన ఈ విధంగా ఉంది.

ముందుగా హిందూ ధర్మశాస్ర్తాలు ఏమంటున్నాయో తెలుసుకుందాం.

భారతీయ సంస్కృతిలో తీర్థస్నాన విధులు స్పష్టంగా తెలియచేయడం జరిగింది. తీర్థయాత్రీకులు వివిధ తీర్థాలలో స్నానం చేసే విధానాన్ని

శ్రీ బ్రహ్మవైవర్తపురాణంలోని బ్రహ్మఖండంలో సందేహరహితంగా చెప్పడం జరిగింది. ఈ పురాణంలోని 26వ అధ్యాయంలో 55 నుంచీ 71వ శ్లోకం వరకూ ఈ విధంగా చెప్పారు.

తీర్థ స్నానం చేయాలనుకున్న వారు ముందుగా ప్రాతః కాలసంధ్యావందనం ఆచరించాలి. అనంతరం గురువునూ, ఇష్టదైవాన్నీ, సూర్యునీ, బ్రహ్మనూ, ఈశునీ, విష్ణునీ, మాయనూ, లక్ష్మినీ, సరస్వతినీ ఉద్దేశించి, నమస్కరించి, గురువునూ, నేతినీ, అద్దాన్నీ, తేనెనూ, బంగారాన్నీ, స్పృశించి, తగుసమయంలో సాధక సత్తముడు స్నానాదికం చెయ్యాలి.
చెరువులోకానీ, దిగుడు బావిలో కాని, నదిలో కానీ, నదంలో కానీ, కందకంలో కానీ, తీర్థంలో కానీ, స్నానం చేసినప్పుడు, ధర్మబుద్ధిగల విచక్షణుడు మొదట ఐదు (మట్టి) ముద్దలు తీసి బడ్డుమీద వేసి స్నానం చెయ్యాలి.
స్నానం చేసి, సంకల్పం చేసి శ్రీకృష్ణునికీ, మహాత్ములైన వైష్ణవులకూ ప్రీతికోరి , మళ్లీ స్నానం చెయ్యాలి. ఇలా చేసుకున్నసంకల్పం గృహస్థులు చేసుకొన్న పాపాలను పోగొడుతుంది.
అనంతరం విప్రుడు శరీరానికి మన్ను పూసుకోవాలి. శరీర శుద్ధి కోసం ఈ క్రింది వేదోక్త మంత్రం చెప్పుకోవాలి. ‘‘ వసుంధరా, నీ పైని అశ్వాలు నడుస్తుంయి. రథాలు నడుస్తుంటాయి. విష్ణువు నడుస్తాడు. మృత్తికా, నా పాపాన్నీ నేను చేసిన దుష్కృతాన్నీ పోగొట్టు. శతబాహుడై వరాహరూపుడైన కృష్ణుడు నిన్నుద్ధరించాడు.
నా అవయవాలనధిరోహించి సర్వపాపమూ విడిపించు. మహాభాగురాలా, పుణ్యమియ్యి. నన్ను స్నానానికనుమతించు.‘‘ అని పలికి బొడ్డులోతు నీళ్లలో నాలుగు మూరల మేర శుభప్రదమైన మండలం ఏర్పరచి, అక్కడ చేయి ఉంచి ఇప్పుడు చెప్పబోయే తీర్థాలను ఆవాహనం చేయాలి.
‘‘గంగా, యమునా, గోదావరి, సరస్వతీ, నర్మదా, సింధువూ, కావేరీ ఈ నీటిలో సన్నిహితులు కావాలి. నళినీ, నందినీ, సీతా, మాలినీ, మహానదీ, విష్ణుపాదపద్మసంజాత త్రిమార్గగామిని గంగా, పద్మావతీ, భోగవతి, స్వర్ణరేఖా, కౌశికీ, దక్షా, పృథ్వీ, సుభగా విశ్వకాయా, శివా, అమృతా, విద్యాధరీ, సుప్రసన్నా, లోకప్రసాదినీ, క్షేమా, వైష్ణవా, శాంతా, శాంతిదా, గోమతీ (మొదలైనవాటినీ), సతి, సావిత్రి, తులసి, దుర్గ, మహాలక్ష్మి, సరస్వతి, కృష్ణునికి ప్రాణాధికురాలైన రాధ, లోపాముద్ర, దితి, రతి. అహల్య, అదితి, సంజ్ఙ, స్వధ, స్వాహ, అరుంధతి, శతరూప, దేవహూతి‘‘ మొదలైనవారినీ పండితుడు సంస్మరించాలి.
అనంతరం గట్టుమీదకు వచ్చి తిలకధారణ చేయాలి.తిలకధారణ చేయకపోతే సమస్త పుణ్యం నాశనం అవుతుందని బ్రహ్మవైవర్తపురాణం కంఠోక్తిగా చెబుతోంది.
ఈ విధంగా నదిలో నుంచీ మట్టిని తీసి గట్టు మీద వేయాలని స్పష్టంగా మన సంప్రదాయం చెబుతోంంది.

దేవ రుషులు ఈ విధానాన్ని ఎందుకు ప్రవేశపెట్టారో అధునాతన పద్ధతిలో విశ్లేషిద్దాం.

చెరువులూ, వాగులూ , వంకలూ, నదులూ వాటి పాయలూ కాలానుగుణంగా పూడిపోయే ప్రమాదం ఉంది. దీనికి అనేక ప్రకృతి సహజ కారణాలున్నాయి. అందుకే నేడు నదుల్లో సైతం పూడిక తీసే ప్రభుత్వ విభాగాలు ఉన్నాయి. పూర్వం ఇటువంటి విభాగాలు లేవు. ప్రజలకే తీర్థవిధుల్లో భాగంగా స్నానం చేయబోయే ముందు ఐదు మట్టిముద్దలు తీసి ఒడ్డు మీద వేయమని చెప్పడం జరిగింది. ఆధునిక అవసరాలను బట్టీ చూసినా నదిలో నుంచీ మట్టిని తీసి ఒడ్డు మీద వేయాలి కానీ, నదీ దారులు మూసుకు పోయే విధంగా వెళ్లిన ప్రతీవారూ మట్టి లేదా రాళ్లు వేసి నదీ గర్భాన్ని మూసి వేయాలని మన రుషులు చెప్పారను కోవడం మూర్ఖత్వం అవుతుంది.

అంతేకాక, నేడు పుష్కర స్నానాలకు కాంక్రీటు మెట్లను ఘాట్లను నిర్మించి ప్రమాద రహితంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కనుక, చేతికి నదిలోని మట్టి కానీ, రాళ్లు కానీ దొరికే అవకాశం లేదు. కనుక, దీన్ని పాటించక పోయినా దోషం లేదని గ్రహించండి. మట్టిని, రాళ్లను నదిలో వేయడం వల్ల కొత్త సమస్యలు వస్తాయని తెలుసుకోండి.
లౌకిక జ్ఞానం ప్రకారం చూసినా, పురాణ జ్ఞానం ప్రకారం చూసినా నదిలోనుంచీ మట్టి తీసి ఒడ్డున వేయాలి కానీ నదిలో వేయరాదని మనశ్రేయస్సుకోసం గ్రహించండి.

slok

గోదారిలో షాంపూ విషం కలపకండి!!! -ఏలూరిపాటి

ప్రకటనలు