soap2
పర్యావరణ ప్రేమికులకు పిలుపు!!!

షాంపూ తయారీలో వ్యాపార సంస్థలు కేన్సర్ కారక విషాలు వాడుతున్నారు. ఈ విషయాన్నికేన్సర్ కారణంగా రొమ్ములు తీసివేసిన 40 మంది మహిళల రోగగ్రస్త భాగాలు పరీక్షించి  వైద్యులు నిర్ధారించారు. కేన్సర్ వచ్చిన వీరందరి రొమ్ము భాగాల్లోనూ పెరాబెన్స్ విషాలున్నాయని తేలింది. డైధెనోలమైన్, కోకామైడ్, లారామైడ్ వంటి వాటిని కొద్ది పరిమాణాల్లో వాడినా కంటికీ, చర్మానికీ హాని కలుగుతుంది. వీటిని పదేపదే వాడడం వలన కేన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే పరిశోధనలు రుజువు చేశాయి.

నదీ స్నానానికి వెళ్లినప్పుడు షాంపూ, సబ్బు ఉపయోగించడం నేడు సర్వసాధారణమైపోయింది. విచక్షణ మరచి చేస్తున్నరాక్షస చర్యల వల్ల జీవనదీ జలాలు విషతుల్యం అవుతున్నాయి. కేవలం షాంపూ ఉపయోగించడం వల్ల నదీ జలాలు ఏంతటి విషతుల్యం అవుతాయో దయచేసి తెలుసుకోండి.
కృత్రిమంగా తయారు చేస్తున్న షాంపూలో వ్యాపార సంస్థలు కాలకూట విషాలు వాడుతున్నారు. షాంపూలలో లాభాపేక్షతో చవకబారు విషపదార్థాలను వాడడాన్ని అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల వైద్యులు తీవ్రంగా నిరసిస్తున్నారు. వీటిలో కేన్సర్ కలిగించే కార్సినోజెన్స్ ఉంటున్నాయని వారి అధ్యయనాల్లో ఇప్పటికే బయటపడింది.
డైధెనోలమైన్ వంటి హానికర రసాయనాలు షాంపూ ఉత్పత్తిలో తయారీదార్లు వాడుతున్నారు. కోకామైడ్, లారామైడ్ వంటి వాటిని కొద్ది పరిమాణాల్లో వాడినా కంటికీ, చర్మానికీ హాని కలుగుతుంది. వీటిని పదేపదే వాడడం వలన కేన్సర్ వచ్చే అవకాశాలున్నాయని ఇప్పటికే పరిశోధనలు రుజువు చేశాయి. ఈ రసాయనాలు నైట్రైటులతో సంయోగం చెందడం వలన నైట్రోసమైన్స్ అనే కేన్సర్ కారకంగా మారతాయని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చి ఆన్ కేన్సర్ అనే సంస్థ అంటోంది. వీటితో పాటు ఫార్మల్డెహైడ్ అనే రసాయనం కూడా కేన్సర్ కారకంగా ఇప్పటికే గుర్తించారు. ఇది చర్మం, కళ్లు, ఊపిరితిత్తుల కేన్సర్ కలిగిస్తుంది.
సోడియం లారిల్ సల్ఫేట్
షాంపూలలో వాడే చవకబారు రసాయనం సోడియం లారిల్ సల్ఫేట్ . ఇది శరీరంలో అతి తేలిగ్గా చొచ్చుకుపోయే అత్యంత హానికర విషం. ఇది చర్మం ద్వారా శరీరంలోకి ప్రవేశించి గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మెదడులలో ఐదురోజులపాటు తిష్ఠవేసుకుని ఉంటుంది. అంటే ఈ రోజు మనం షాంపూ ఉపయోగిస్తే చర్మం గుండా శరీరంలోకి ప్రవేశించిన సోడియం లారిల్ సల్ఫేట్ ఐదురోజులకు పైగా తన దుష్ర్పభావాన్ని శరీరంపై చూపే అవకాశం ఉందన్న మాట. దీనివల్ల చర్మంపై రాష్ రావడం, వెంట్రుకలు ఊడిపోవడం, చుండ్రు రావడం జరగవచ్చు. ఈ సంగతి చెప్పిన వారు సామాన్యులు కాదు. అమెరికాకు చెందిన అమెరికన్ కాలేజ్ ఆఫ్ టాక్సికాలజీ అధ్యయనవేత్తలు. వీరు చెప్పిన మరో సంచలన అంశం ఏమిటంటే ఈ చవకబారు రసాయనాన్ని షాంపూతో పాటుగా అనేక రకాల బాడీ వాష్ లలోనూ, షేవింగ్ క్రీములలోనూ, ఆఖరికి టూత్ పేస్టులలోనూ మనం నిత్యం వాడే ఇతర అలంకరణ సామగ్రీలోనూ విరివిగా వాడతారట. అంటే ఈ కేన్సర్ కలిగించే రసాయనం ప్రతి రోజూ ఎంతగా మన శరీరంలో జమ అవుతోందో మీరే గమనించుకోండి. ఈ అంశాన్ని అంతర్జాతీయ చర్మశాస్త్ర పత్రిక కూడా నిర్థారించింది. ఈ హానికర పదార్థం జన్యువుల స్థాయిలోకి వెళ్లి డిఎన్ ఏ ను నాశనం చేస్తుందని వారు అంటున్నారు.
దీని తరువాత చెప్పుకోవాల్సింది సోడియం లారెత్ సల్ఫేట్ గురించి. ఇది కఠినమైన పెట్రోలియం పదార్థాలు మెత్తబడడానికి ఉపయోగిస్తారు. ఇది డయాక్సైన్ తో సంయోగం చెంది హానికారకంగా మారుతుంది. దీనితో ఇది కూడా కేన్సర్ కారకంగా మారుతుంది. అమెరికాలో కూడా ఈ పదార్థం ఉందని చెప్పకుండా షాంపూలు అమ్మేస్తున్నారు. ఈ విషరసాయనం ఒకసారి శరీరంలోకి ప్రవేశిస్తే దీన్ని శరీరంలో నుంచీ తొలగించడం కాలేయం వల్లకాదు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితికి దారితీసి కేన్సర్ కలిగిస్తుంది.
దీని తరువాత చెప్పుకోవాల్సింది పెరాబెన్స్ గురించి.
ఇవి విషరసాయనాల సమూహాలు. షాంపూ ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి దీన్ని వాడతారు. ఈ రసాయనాలు ఏ కొద్ది మోతాదులో శరీరంలోకి వెళ్లినా సంతానోత్పత్తి సమస్యల నుంచీ ఆడవారికి రొమ్ము కేన్సర్ వరకూ వచ్చే అవకాశాలున్నాయి. కేన్సర్ కారణంగా రొమ్ములు తీసివేసిన 40 మంది మహిళల రోగగ్రస్త భాగాలు పరిశీలించి ఈ విషయాన్ని వైద్యులు నిర్ధారించారు. కేన్సర్ వచ్చిన వీరందరి రొమ్ము భాగాల్లోనూ పెరాబెన్స్ విషాలున్నాయని తేలింది. ఇటువంటి విషాలు ఐదురకాలు ఈ పెరాబెన్స్ సమూహంలో ఉన్నాయని కనుగొన్నారు. ఇవి షాంపూలలోనే కాక అనేక రకాల నిత్యం వాడుతున్న సౌందర్యసాధనాలలో కూడా ఉన్నాయని తేలింది. ముఖ్యంగా ఆడవారిలోని హార్మోను వ్యవస్థలను దెబ్బతీస్తాయట. దీనికారణంగా పలురకాలైన కేన్సర్లు ఆడవారికి వస్తాయట.
షాంపూలలో సుగంధం కోసం వాడే రసాయనాలు కూడా విషాలేనని వైద్యులు అంటున్నారు. ఈ విధమైన రసాయనాలు 3100 రకాలు వీరు గుర్తించారు. ఇవన్నీ కాలకూట విషాలని బల్లగుద్దిమరీ చెబుతున్నారు. వీటివల్ల కేంద్ర నాడీ వ్యవస్థ నాశనం కావడం దగ్గర నుంచీ అనేక రకాల కేన్సర్లు వస్తాయట. అనేక రకాల అలెర్జీలు వస్తాయట. మెదడులో లోపాలు వస్తాయట. ఊబకాయం వస్తుందట. ఆస్తమా వస్తుందట. ప్రాణావయవాలు విషతుల్యమైపోతాయట. ఇవి చిన్నపిల్లల్లో చదువుకునే సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయట.
పాలిథిలిన్ గ్లైకోల్ గురించి తెలుసుకుంటే షాంపూ అంటేనే వెగటు పుడుతుంది. దీని వాడకం ఇప్పటికే కాలిఫోర్నియా నిషేధించింది. అతి దురదృష్టకరమైన అంశం ఏమిటంటే ఈ రసాయనం చిన్నపిల్లల షాంపూలో కూడా ఉంటుందట.
ఇటువంటి కాలకూట విషమైన షాంపూలను దయచేసి పుష్కర స్నానాలలో వినియోగించకుండా యాత్రీకులకు నచ్చచెప్పండి. పుష్కర సమయంలో షాంపూ, సబ్బు వాడకం వలన మన పవిత్ర జలాలను మనమే నాశనం చేసుకుంటున్నామని తెలియచేయండి.
గోదావరి పుష్కరాలకు దాదాపు ఆరు నుంచీ ఎనిమిది కోట్ల మంది వస్తారని ఒక అంచనా. వీరిలో కొంత మంది రెండు మూడు సార్లు స్నానం చేస్తారు. ఉదాహరణకు పిండప్రదానం చేసేవారు. వీరు రెండు మూడు సార్లు చేసే అవకాశం ఉంది. అంటే సగటున కనీసం 16 నుంచీ 18 కోట్ల స్నానాలు యాత్రీకులు గోదారిలో చేసే అవకాశం ఉంది. వీరి స్నానాలలో కనీసం ఆరు నుంచీ ఎనిమిది కోట్ల స్నానాలలో షాంపూ, సబ్బు వాడకాన్ని సగటున అంచనా వేయడం జరిగింది. అంటే నదిలో కేవలం ఈ 12 రోజులలోనే ఎన్ని లక్షల లీటర్ల హానికరమైన షాంపూ నదిలో కలుపుతున్నామో మీరే గమనించండి.
ఇక్కడ గమనించ వలసిన మరో ముఖ్య అంశం పుష్కర ఏర్పాట్లు. భద్రతా కారణాల వల్ల తాళ్లు కట్టి కేవలం మూడు నాలుగు అడుగుల మేరకు మాత్రమే ఘాట్ లలో స్నానాలకు అనుమతిస్తారు. దీంతో ఇన్ని కోట్ల స్నానాలు కేవలం మూడు నాలుగు అడుగుల నీటిలో మాత్రమే జరుగుతాయి. అంటే షాంపూ, సబ్బూ వినియోగించిన నీరు వడివడిగా నదిలో కలిసే అవకాశం లేదు. అంటే ఘాట్ లకు దగ్గర నీరు కేన్సర్ కారక షాంపూ, సబ్బు వినియోగం వల్ల సైనేడ్ కన్నా విషంగా తయారు అవుతాయని వేరే చెప్పనవసరం లేదు.
గోదారి పుష్కర సందర్భంగా ఎంతో మంది పుణ్యం వస్తుందని మూడు సార్లు అయినా మూడు గుక్కల నీరు తాగుతారు. అంటే ఇది మరింత ప్రమాదకరం కాదా?
ఇన్ని లక్షల లీటర్ల విషరసాయనాలు ఒక్కసారిగా నదిలోకి విడుదలైతే పర్యావరణం మీద ఎంతటి దుష్ర్పభావం చూపుతుందో మీరే తెలుసుకోండి.
పైన చెప్పిన రసాయనాలు విదేశాల నుంచీ వస్తున్న అంతర్జాతీయ బ్రాండు షాంపూలలో కూడా ఉన్నాయని వాటి డబ్బాల మీద సదరు కంపెనీ వారే అచ్చోసి వదులుతున్నారు. ఇక లోకల్ బ్రాండుల విషయం ప్రత్యేకంగా చెప్పాలా? రూపాయికీ అర్ధణాకూ వచ్చే షాంపూలలో ఎంతటి హానికర రసాయినాలు ఉంటాయో? ఇవి ఎంతటి భయంకరరోగాలు కలిగిస్తాయో ఒక సారి ఆలోచించండి.
ఒక్కో షాంపూ పాకెట్టులో 7.5 మిల్లీ లీటర్ల చొప్పున షాంపూ ఉంటుంది. దీన్ని 8 కోట్ల స్నానాలు ( అంటే ఒక్కొక్కరూ రెండు మూడు సార్లు చేసే స్నానాలను సగటున తీసుకోవడం జరిగింది.) వలన 6 లక్షల లీటర్ల నుంచీ 4 లక్షల లీటర్ల షాంపూ నదిలో కలుపుతున్నాము. హానికారకమైన రసాయనాలు ఎన్నింటిని మన చేతులతో నదిలో కలుపుతున్నామో ఒక్కసారి ఆలోచించండి.
ఒక్కొక్కరూ 20 గ్రాముల సబ్బు చొప్పున వాడడం వలన 8 కోట్ల మంది సబ్బు వాడితే 16లక్షల కిలోల సబ్బు గోదావరిలో కలుస్తుంది. దీనివలన నీరు ఎంతటి కలుషితం అవుతుందో మీరే గమనించండి.
ప్రభుత్వం దీనిని నియంత్రించడం కష్టమైందేమీ కాదు.
ఘాట్ లోకి తీర్ధయాత్రీకులను వదిలేటప్పుడే వారినుంచీ సబ్బు, షాంపూ పేకెట్లు సెక్యూరిటీ పాయింట్ వద్ద సిగరెట్, అగ్గిపెట్టెల మాదిరిగా లాగేసుకోవచ్చు. దీనికి పర్యావరణ మిత్రులు కూడా సహకరించి యాత్రీకులకు నచ్చచెప్పే ప్రయత్నాన్ని స్వచ్ఛంద కార్యకర్తలుగా చేయవచ్చు.
షాంపూలలోని విషపదార్థాల నియంత్రణ రేపటి పోరాటం. ఇప్పటికే మేగీ నూడిల్స్ తో ఈ పోరాట ప్రారంభం సుప్రీం కోర్టు సాక్షిగా మొదలైంది. ప్రస్తుతం చేయాల్సింది తక్షణ పోరాటం. ఆస్ర్టేలియా జనాభా కన్నా ఎన్నో రెట్లు అథికంగా యాత్రీకులు పాల్గొంటున్న పుష్కరాల్లో పర్యావరణాన్ని కాపాడు కోవడం మనందరి బాధ్యత.
కనుక, మీరు పుష్కర స్నానం చేసేటప్పుడు షాంపూ వినియోగించకుండా ఉండడమే కాదు, మీ చుట్టుపక్కల వారు కూడా షాంపూలు ఉపయోగించకుండా నచ్చచెప్పడం మీ బాధ్యత.
దీన్ని ప్రేమతో నిర్వర్తించండి.
ప్రతీదీ ప్రభుత్వాలే చేయలేవు. మీ వంటి ‌‘‘స్వచ్ఛ‘‘ కార్యకర్తలు కూడా చేయగలరు.

పుష్కరాల్లో షాంపూ, సబ్బు వాడకండి..!!!-ఏలూరిపాటి

ప్రకటనలు