దురదృష్టం వల్లే కేన్సర్‌ వస్తుందా?

cancer1crop

(ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ కేన్సర్ రోజును  ఫిబ్రవరి 4న జరుపుకుంటున్న సందర్భంగా వార్త దినపత్రిక ఆదివారం ప్రత్యేక అనుబంధంలో  ప్రచురితమైనది.)

కేన్సర్‌ ఎందువల్ల వస్తుందో తెలియదు! ఎవరికి వస్తుందో తెలియదు! – ఇవి కొంత మంది వైద్యుల మాటలు. ఫలానా వైరస్‌ (హెచ్‌ ఐ వి, హెపటైటిస్‌) ఉందా అయితే కేన్సర్‌ వస్తుంది. మందుకొట్టే అలవాటు ఉందా?అయితే కేన్సర్‌ వస్తుంది. దమ్ము కొట్టే అలవాటు ఉందా? అయితే కేన్సర్‌ వస్తుంది. పొగాకు వినియోగం (నమలడం, చుట్ట, బీడీ) ఉందా? అయితే కేన్సర్‌ వస్తుంది. ఊబకాయం ఉందా? అయితే కేన్సర్‌ వస్తుంది. అంటూ కొంత మంది వైద్యులు చెప్పారు. వీరికి తోడుగా ఖర్మకాలితే వస్తుంది! –అని కొంత మంది వేదాంతుల కూడా తేల్చి చెప్పారు. ఇంత మంది ఇన్ని విధాలుగా చెబుతున్నా కేన్సర్‌ కేవలం కొద్ది మందికి మాత్రమే ఎందుకు వస్తోంది? ఇది ప్రధానమైన ప్రశ్న. పొగాకు తాగిన అందరికీ ఎందుకు కేన్సర్‌ రావడంలేదు? మందుకొట్టే వాళ్లు అందరికీ ఎందుకు కేన్సర్‌ చేరడంలేదు? ఫలానా కారణం చేత కేన్సర్‌ వస్తుంది అని సిద్ధాంతీకరిస్తే ఆ సిద్ధాంతం ప్రకారం ఆ తప్పిదం చేసిన వాళ్లందరికీ కేన్సర్‌ రావలసి ఉంది. మరి వారందరికీ ఎందుకు రావడంలేదు? ఏ నేరం చేశారని కొంత మందికి రొమ్ము కేన్సర్‌ వస్తోంది? ఏ నేరం చేశారని కొంత మందికి గర్భాశయ కేన్సర్‌లు వస్తున్నాయి. ఇవే నేడు సమాధానం దొరకని ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి. ఈ ప్రశ్నలకు అమెరికాలోని జాన్స్‌ హాప్‌కిన్స్‌విశ్వవిద్యాలయం వైద్య కళాశాల పరిశోధకులు ఒక ఆసక్తి కరమైన విషయం కనుక్కొన్నారు.

దురదృష్టవంతులకే కేన్సర్‌ వస్తుందా?

ఇప్పటి వరకూ కేన్సర్‌ ఎందుకు వస్తుందీ అనే ప్రశ్నకు అనేక మంది అనేక సమాధానాలు ఇచ్చారు కానీ –జాన్స్‌ హాప్‌కిన్స్‌విశ్వవిద్యాలయం వైద్య కళాశాల పరిశోధకులు కుండబద్దలు కొట్టి ని•జం చెబుతున్నారు. కేవలం దురదృష్టం కొద్దీ కేన్సర్‌ వస్తుందని ఒక అధ్యయనం ద్వారా కనుగొన్నారు. ప్రతీ ముగ్గురు కేన్సర్‌ పేషంట్లలో ఇద్దరికి కేవలం దురదుదృష్టం వలన కేన్సర్‌ వస్తుందని వారు తేల్చి చెప్పారు. ఇప్పటి వరకూ అనేక మంది వైద్యులు విశ్వసిస్తున్నట్లు వ్యక్తిగత అలవాట్లు వల్లే కేన్సర్‌ వస్తుందనే వాదనను వారు తిప్పికొడుతున్నారు. కణం విభజ•న పొందేటప్పుడు కణంలోని ప్రధానమైన డిఎన్‌ఏలో వచ్చే పరివర్తనా లోపాలే కేన్సర్‌కు మూలకారణాలు. శరీరంలోని అనేక కణ–జాలాల మూలకణ పరివర్తనాలను (మ్యూటేషన్లు) అధ్యయనం చేశారు. పరిశోధకులు 31 రకాల కేన్సర్లు అధ్యయనం చేశారు. వారి అధ్యయనంలో 65 శాతం మందికి కేవలం కణ విభ•న లోపాల వల్లే కేన్సర్‌ వచ్చిందని తెలుసుకున్నారు. వంశపారం పర్యత, పర్యావరణం కారణంగా కేవలం 35 శాతం మందికి మాత్రమే కేన్సర్‌ వస్తుందని అంటున్నారు. వీరి అంచనాల ప్రకారం కేవలం దురదృష్టం వల్ల వచ్చే కేన్సర్‌లలో మెదడు, తలా మెడా, థైరాయిడ్‌, ఊపరితిత్తులు, ఎముకలు, కాలేయం, పాన్‌క్రియాస్‌, చర్మం, గర్భాశయం, వృషణాల కేన్సర్లు ఉన్నాయి. వ్యక్తిగత అలవాట్ల వచ్చే కేన్సర్లలో కొన్ని రకాల చర్మ, గొంతు, థైరాయిడ్‌, పొగతాగే వాళ్లకు ఊపిరితిత్తులు, తాగేవాళ్లకు కాలేయం, పీఠభాగాలకు వచ్చే కేన్సర్లు ఉన్నాయని నివేదికలో ప్రచురించారు.

ఈ అధ్యయనం ప్రచురించగానే ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది తీవ్రస్థాయిలో ప్రతిస్పందింగారు. కేన్సర్‌ రావడాన్ని అదృష్టం దురదృష్టంతో ముడిపెట్టడాన్ని అనేక మంది వైద్యులు దుయ్యబట్టారు. ఈ విధంగా చెప్పడం వలన అనేక మంది (ఆరోగ్యకరమైన అలవాట్లు కష్టపడి చేసుకుంటున్నవాళ్లు) తిరిగి పాత జీవితానికి వెళ్లి, కేన్సర్‌కు పలారమై పోతారని వాదిస్తున్నారు. అయితే, వీరెవ్వరూ సరైన సమాధానాన్ని సహేతుకంగా ఇవ్వలేకపోవడం గమనార్హం.

అతిగా తాగితే లివర్‌ పాడైపోతుందని, అతిగా పొగపీల్చడం, పొగాకు సేవించడం, గుట్కాలు తినడం వంటివాటి వల్ల కేన్సర్‌ వస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదని వారు అంటున్నారు. అయితే, మరి అందరికీ ఎందుకు కేన్సర్‌ రావడంలేదు అనే దానికి సమాధానం చెప్పలేకపోవడం గమనార్హం. నిప్పు ముట్టుకుంటే కాలుతుంది ఇది ఒక సత్యం. ఎవరు ముట్టుకున్నా కాలడం నిప్పునకు ఉన్న ధర్మం. అదే విధంగా చెడు అలవాట్ల వల్ల కేన్సర్‌ వస్తుంది అనేది సిద్ధాంతం అయితే నిప్పు అందరికీ కాలినట్లే అందరికీ కేన్సర్‌ రావాల్సి ఉంది. మరి ఎందుకు రావడంలేదని మరి కొందరి వాదన? అంటే వ్యక్తిగత అలవాట్లకు తోడుగా మరేదో కారణం తోడై కేన్సర్‌కి దారి తీస్తోందని, ఆ కారణం ఏమిటో కనుగొనండని ఇంకొందరు వాదిస్తున్నారు.

ఇంకొంత మంది వైద్యులు మధ్యే మార్గంగా ఆరోగ్యకరమైన అలవాట్లు ఉంటే కేన్సర్‌ తో పాటు అనేక రకాలైన వ్యాథులు రాకుండా ఉండే అవకాశం ఉంది కనుక, అనారోగ్య అలవాట్లు వదిలించుకోవడమే మంచిదని సూచిస్తున్నారు.

భయంకరమవుతున్న బతుకు

ఇదిలా ఉండగా కేన్సర్‌ వచ్చిన వారి బతుకు భయంకరంగా తయారు అవుతోంది. చైనాలో ప్రతి పదిసెకండ్లకు ఒకరికి కేన్సర్‌ సోకుతోంది. ప్రతీ ఏడాదీ 30 లక్షల కొత్త వారికి కేన్సర్‌ సోకుతోంది. చైనాలో కూడా భారత దేశ కుటుంబ వ్యవస్థ ఉంది. అక్కడ తల్లి తండ్రులకు పిల్లలు వైద్యం చేయించే బాధ్యతలు తీసుకుంటారు. దీంతో కేన్సర్‌ వచ్చిన కుటుంబాలు ఒక్కసారిగా ఆర్థికంగా చితికిపోతున్నాయి. వారానికి రెండు సార్లు మాంసాహారం తీసుకునే వారు, కేన్సర్‌ చికిత్సలు చేయించుకోవడానికి డబ్బు ఖర్చుపెట్టి ఆర్థికంగా పతనం చెందుతున్నారు. నెలకు ఒకసారి కనీసం గుడ్డు తినడానికి కూడా మొహంవాచిపోతున్నారు. పేషంట్లను చూసుకోవడానికి సంపాదించే వారు ఇంటిపట్టునే ఉండాల్సి రావడంతో ఆర్థికంగా పెను భారం పడుతోంది. ఇవే బాధలు భారతదేశంలోని కేన్సర్‌ కుటుంబాలలో కూడా కలుగుతోంది.చైనాకూ భారత దేశానికీ •జనాభా ప్రాతిపదికన పోలికలు ఉన్నాయి. •జనాభా తక్కువ ఉన్న అగ్రరాజ్యాలతో పోలిస్తే భారత, చైనాలలో కేన్సర్‌ చికిత్సలు పెనుభారం అవుతున్నాయి. ఈ రెండు దేశాలలో ప్రభుత్వ వైద్యసాయం కానీ, బీమా సంస్థల సేవలు కానీ కేన్సర్‌ చికిత్సలకు అనుకూలంగా లేదనే చెప్పాల్సి వస్తోంది.

పన్ను రాయితీలు కావాలి

ఆదాయపన్నులో 80డిడిబి సెక్షన్‌ కింద కేవలం 50 వేల రూపాయల వరకూ ఆదాయంలో మినహాయింపు ప్రస్తుతానికి కేన్సర్‌ పేషంట్లకు వస్తోంది. ఇది ఏ మూలకూ కేన్సర్‌ పేషంట్లకు సరిపోదు. దీన్ని కనీసం మూడు లక్షలకు పెంచాల్సి ఉంది. కొడుకు లేదా కోడలు లేదా ఇద్దరి ఆదాయాలలో కేన్సర్‌ వైద్య ఖర్చులు మినహాయించుకునే సదుపాయం కల్పించాలి అని ప్రధానిని, ఆర్థిక మంత్రినీ కేన్సర్‌ పేషంట్లు కోరుకుంటున్నారు.

అనాయాస మరణం

భగవంతుని ఏం కోరుకోవాలి అనే విషయంలో మన పూర్వీకులు ఈ విధంగా చెప్పారు.

అనాయాసేన మరణం

వినా దైన్యేన జీవనం

దేహాంతే తవ సాయు•జ్యం….”

భగవంతుడా నాకు యాతన లేని మరణాన్ని ఇవ్వు, ఇతరుల మీద ఆధారపడని దైన్యమైనది కాని జీవనాన్ని ఇవ్వు, మరణించిన తరువాత నీలో ఐక్యమయ్యే వరాన్ని ఇవ్వు అనికోరుకోవాలని అన్నారు. కానీ, దీన్ని కేన్సర్‌ రోగులు ఒప్పుకోవడం లేదు. గుండె జ•బ్బులు లాంటివి వచ్చి రాత్రికి రాత్రి చనిపోయే కన్నా మరణం ఎప్పుడు రానుందో ముందుగా వైద్యులు చెప్పడం వలన ఎన్నో మేళ్లు ఉన్నాయని వారు అంటున్నారు. పెళ్లిళ్లు వంటి చేయాల్సిన పనులు చేయగలుగుతామని, చెప్పాలనుకున్నవాళ్లకు వీడ్కోలు చెప్పవచ్చని, నచ్చిన పాటలు వినవచ్చని, చివరిసారిగా చూడాలనుకున్న ప్రదేశాలు చూడవచ్చని, కావలసిన వాళ్లకు అప్పగింతలు పెట్టగలుగుతామని, మృత్యువుకోసం ఎదురు చూడడంలో జీవితంలో కొత్త ధైర్యం కలుగుతుందని లూయీస్‌ బన్యూల్‌ అంటున్నారు. ఈయన సినీరంగ ప్రముఖుడు, అధివాస్తవికతను నమ్మినవాడు. ఈయన్ని సమర్ధించే వాళ్లు లేకపోలేదు. మనల్ని ని•జంగా ప్రేమించే వాళ్లకు కూడా కేన్సర్‌ మేలు చేస్తుందని అంటున్నారు. హఠాత్తుగా ఒక బస్సుకింద పడి చనిపోతే మన ఆత్మీయులు ఆ ఎడబాటు తట్టుకోలేరు. కానీ, కేన్సర్‌ వల్ల ఎక్స్‌పైరీ డేట్‌ ముందుగా తెలిస్తే, ఆత్మీయులు కొంత వైరాగ్యం పెంచుకునే వీలు కలుగుతుందని వీరు వాదిస్తున్నారు. ఎందుకంటే, ఇంగ్లండు లాంటి వీరోచిమైన దేశాలు ప్రపంచంలో లేవు. అక్కడి వైద్యులు 2050 నాటికి తమ దేశంలో 80 ఏళ్ల లోపువారు కేన్సర్‌ వల్ల మరణించకుండా పారదోలతామని ఛాలంజ్‌ చేస్తున్నారు. వారు ధీరోదాత్తులు. వారు అన్నమాట నిలబెట్టుకోగలిగిన సత్తా ఉన్నవారు. ఒక మాట అంటే దాని ప్రకారం ఒక ప్రణాళిక రచించుకుని మృత్యువును కూడా గుమ్మందగ్గర వేచిఉండేలా చేయగల సమర్థులు. వారివి కాకి లెక్కలు, రా•జకీయ ప్రచారాలు కావు. వారు ఒక మాట అంటే అది జ•రిగితీరుతుంది. భారతదేశ పంచవర్షప్రణాళికల మాదిరిగా కాగితం పులులు కారు. వేలం వెర్రిగా వి•జన్‌ డాక్యుమెంట్లు ప్రచురించరు.

దశావతారాలు

భగవంతుడికి పది అవతారాలు ఉన్నట్లే కేన్సర్‌ పేషంట్లకు కూడా దశలున్నాయి. ఒక పేషంటు ఏ దశలో ఉన్నారో సంరక్షకులు తెలుసుకోవడం చాలా ముఖ్యం. దాన్ని బట్టీ వారితో ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది. పేషంటు స్థితిని ఇట్టే గ్రహించి దానికి అనుగుణంగా ఉండానికి అవగాహన కలుగుతుంది. ముఖ్యంగా పేషంట్లకు నీరసం, నిస్త్రాణతలోకి జారుకోకుండా సంరక్షించడానికి ఉపయోగపడుతుంది.

కేన్సర్ వచ్చింది అని తెలిసినప్పుడు ప్రతి పేషంటు చేపలాంటివారు. వీరు ఏం పెట్టినా తినేస్తారు. చేప కూడా నీటిలో ఏది దొరికితే అది తింటుంది. ఈ పేషంట్లు కూడా తొలి దశలో సంరక్షకులు ఏం పెడితే అది ఎంతో ఇష్టంగా తింటారు. చికిత్స పురోగమించే కొద్దీ రెండో దశలోకి పేషంట్లు జారుకుంటారు. తరువాతది కూర్మ దశ. సంరక్షకులు చెప్పేదాన్ని కొంచెం వింటారు, కొంచెం వ్యతిరేకిస్తుంటారు. కేన్సర్‌ సైడ్‌ ఎఫెక్టులు అయిన వికారం వాంతులు అంతగా ముదరవు కనుక కొంచెం బలవర్ధకమైన పనికి వచ్చే ఆహారాలు తింటారు. అడపా దడపా నోరు బాగా లేదని తినకూడని పదార్ధాలు కూడా తింటూ ఉంటారు. దీని తరువాత మూడో దశ వస్తుంది.ఇది వరాహ దశ. ఈ దశ సాధారణంగా కేన్సర్‌ చికిత్స మొదలైన కొద్ది వారాలకు వస్తుంది. ఇప్పటికి నోటిలో, నాలుక మీది రుచి తెలిపే వ్యవస్థలో మార్పులు వస్తాయి. కొంత మందికి నోరు చేదుగా ఉంటుంది. మరికొంత మందికి వాంతులు, వికారం కలుగుతాయి. కనుక ఈ వరాహ దశలో ఏవైతే తినకూడదో వాటిమీదకే మనసు పోతూ ఉంటుంది. అంటే బీపీ ఉన్న వారు ఉప్పు కారాన్ని కోరుకుంటారు. సుగర్‌ ఉన్నవారు తీపి కోరుకుంటారు. అల్సర్లు ఉన్నవారు పులుపు కోరుకుంటారు.ఇక్కడ నుంచే సంరక్షకులకు యుద్ధం మొదలవుతుంది. ముసలివారు, పిల్లలూ పేషంట్లుగా ఉంటే సంరక్షకుల పని మరింత కష్టం. పిల్లలు మారాం చేయడం అధికం అవుతుంది. ముసలివారి మంకుతనం విపరీతంగా ఉంటుంది. కేన్సర్‌ చికిత్స కొనసాగే కొద్దీ నారసింహ అవతారంలోకి పేషంట్లు మారతారు.

తిండి విషయంలో యుద్ధాలు చేయాల్సి వస్తుంది. సంరక్షకుల మీద వీళ్లు మాటలతో దాడులు చేస్తారు. ఏవీ తినమని హఠం చేస్తారు. కొన్ని సందర్భాలలో వైద్యులు కూడా పేషంట్లకు ఆహారం తినిపించడం కష్టం అవుతుంది. దీంతో ముక్కులో నుంచీ కడుపులోకి గొట్టం పెట్టి బలవంతంగా ఆహారం తోయవలసివస్తుంది. ముఖ్యంగా రేడియేషన్‌ చికిత్సలు •జరిగేటప్పుడు ఈ దశ వస్తుంది. దీని తరువాత వామన అవతారం వస్తుంది. పేషంట్లు విపరీతంగా చిక్కిపోతారు. శారీరకంగా ఎముకల గూడుగా మారిపోయే అవకాశం కూడా ఉంది. కొన్ని సందర్భాలలో వీరి ప్రవర్తన పక్కన ఉన్న సంరక్షకులను పాతాళంలోకి నొక్కేస్తుంది. పేషంట్లతో పాటు సంరక్షకులు కూడా గణనీయంగా చిక్కిపోతారు. ఈ దశలో సంరక్షకులు తమ ఆరోగ్యం పై కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. దీని తరువాత వచ్చేది పరశురామ అవతారం. ఈ దశలో అటు సంరక్షకులు, ఇటు పేషంట్లు కూడా విచక్షణ కోల్పోయే ప్రమాదం ఉంది. పేషంట్లు చికిత్సలో వచ్చే సైడ్‌ ఎఫెక్టుల వల్ల విపరీతమైన అలసట, నీరసం, నిస్త్రాణతల్లోకి జారిపోయే అవకాశం ఉంది. ఈ దశలో వీరు తినడానికి ఏం పెట్టినా విసిరి కొట్టే ప్రమాదాలు కూడా ఉంటాయి. ఇక సంరక్షకులు కూడా శారీరకంగా మానసికంగా ఎంతో అలసిపోయి ఉంటారు. వారాలు, నెలల తరబడి పేషంట్లకు సేవచేయాల్సి రావడంతో వారిలో కూడా విసుగు విపరీతంగా ఉంటుంది. సాధారణ ఆరోగ్యం వీరికి కొంచెం మందగించి విపరీతమైన మనస్తత్వాలలోకి జారుకునే ప్రమాదం ఉంది. ఇక్కడే సంయమనం పాటించాలి. ఈ తరుణంలో నైసర్గిక శత్రువులు సంరక్షకులుగా ఉంటే యుద్ధాలు •జరగడం సర్వసాధారణం. అంటే కోడలికి అత్తగారు, లేదా అత్తగారికి కోడలు వంటి వారు సంరక్షకులుగా ఉండడం అన్నమాట. ఇది అత్యంత ప్రమాదకరమైన స్థితి. దీని తరువాత వచ్చేది రామాతారం. పరశురామావతారం తరువాత కొంత సంధి ప్రయత్నాలు •జరిగి ఇరువర్గాలలోనూ ఒక విధమైన ప్రశాంత వాతారణం వస్తుంది. రాముడు మంచి బాలుడు మాదిరిగా అటు పేషంటూ, ఇటు సంరక్షకులూ ఉంటారు. ఇప్పటికి చికిత్సలోని సైడ్‌ ఎఫెక్టులకు ఇద్దరూ అలవాటుపడతారు. దీని తరువాత కృష్ణావతారం వస్తుంది. ఇక్కడ పేషంట్లు కొన్ని కపట నాటకాలు నేర్చుకుంటారు. సంరక్షకులు పెట్టింది తింటునట్టు నటిస్తూ వారు చూడకుండా పారేయడం, రాని డోకులు తెచ్చుకోవడం వంటివి చేస్తుంటారు. దీని తరువాత తొమ్మిదో దశలో పేషంట్లు వడ్డీ మీద వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. వైద్యులు ఖరీదైన సెలైన్‌ సీసాలు ఎక్కించడం, విటమిన్లు వంటివి ఇచ్చి పేషంట్లకు బలం చేకూర్చడానికి ప్రయత్నిస్తారు. రక్తం ఎక్కించడం, రక్తం కోసం గ్రాఫీల్‌ వంటి మందులు ఇవ్వడం •జరుగుతుంది. ఈ దశలో కూడా పేషంట్లు సహకరించకపోతే మిగిలేది కల్కీ అవతారమే. సంరక్షకులు, పేషంట్లు, వైద్యులు ఒకే తాటిమీద ఉంటే కేన్సర్‌ అంతం అవుతుంది లేదా పేషంటుకు ప్రమాదం వస్తుంది.

ఈ విధంగా పది దశలూ అందరీకీ అర్థం కావడానికి కొంచెం నాటకీయంగా చెప్పినా కేన్సర్‌ పేషంట్ల దగ్గరుండే సంరక్షకులు ఈ దశలను జాగ్రత్తగా గమనించుకోవాలి. పేషంటు ఏ దశలో ఉన్నారో గమనించుకుని వారికి ఆహారపానీయాలు ఇస్తూఉండాలి. లేదంటే కేన్సర్‌ చికిత్సల్లోని సైడ్‌ ఎఫెక్టులు ప్రాణాంతకమయ్యే ప్రమాదాలు ఉన్నాయి.

కొన్ని జాగ్రత్తలు

చివరిగా చెప్పుకోవాల్సింది పేషంట్ల సంరక్షకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి. అన్నిటికీ మించి గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే. కేన్సర్‌ అంటువ్యాథికాదు. ఇది ఒకరి నుంచీ ఒకరికి సోకదు. కానీ, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఉదాహరణకు కీమోథెరపీ తీసుకునే పేషంటు శరీరం నుంచీ వచ్చే ద్రావకాలు అంటే ఉమ్మి, వాంతులు, మూత్రము, మలము వంటివి వాటికి 48 గంటల పాటు దూరంగా ఉండడమే మంచిది. కీమో మందుల ప్రభావం కేవలం 48 గంటల పాటే ఉంటుంది. వీటిని శుభ్రం చేసే టప్పుడు చేతికి గ్లౌజులు వేసుకోవడం మంచిది. దీని తరువాత అంటే రెండు రోజుల తరువాత సంభోగం •జరిపినా తప్పులేదు. కాకపోతే గర్భధారణ •జరగకుండా జాగ్రత్తపడితే చాలు. కేన్సర్‌ చికిత్సలో వాడే మందులు కేన్సర్‌ కన్నా భయంకరమైనవి. ఈ మందుల ప్రభావంతో ఆరోగ్యవంతులకు కేన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంది. ఈ మందులు ఒంటి మీద పడితే నర్సులకు కూడా గర్భస్రావాలు అవుతాయి అని, దీర్ఘకాలంలో కేన్సర్‌లు వస్తాయని వైద్య పత్రికలు నివేదికలు ప్రచురిస్తున్నాయి. రేడియేషన్‌ •జరిగేటప్పుడు పేషంటు నుంచీ రేడియేషన్‌ ఎటువంటి పరిస్థితుల్లోనూ సంరక్షకులకు సోకదు.కానీ అంతర్గత రేడియేషన్‌ అంటే బ్రాకీథెరపీ వంటివి జరిగినప్పుడు మాత్రమే వైద్యులు సంరక్షకులను కూడా పేషంట్ల దగ్గరకు వెళ్లనివ్వరు. కనుక, మిగిలిన సమయాల్లో ప్రత్యేక జాగ్రత్తలు అవసరం లేదు.

అన్నింటికీ మించి కేన్సర్‌ పేషంట్లకు ప్రేమ పంచాల్సిన సమయం వైద్యం •జరుగుతున్నప్పుడే అని గుర్తుంచుకోండి. మీ ప్రేమా అభిమానాలే వారికి కొండంత అండ.

అమ్మదనం

కేన్సర్‌ శరీరంలోకి ప్రవేశించింది అని తెలుసుకోవడం లేటు కావడం ఎంత ప్రమాదకరమో, చికిత్స తీసుకోవడం ఆలస్యం చేయడం కూడా అంతే ప్రమాదకరం. అయితే ఇటు వంటి ఆలస్యం సహేతుకమైనప్పుడు కొంత వరకూ సమర్థనీయమే. ఏ కారణంతో చికిత్స ఆలస్యం చేయవచ్చే అనే దానికి అద్భుతమైన ఉదాహరణ ఆష్‌లే బ్రిడ్జెస్‌ విషయంతో వెలుగులోకి వచ్చింది. ఈమెకు తొలి నాళ్లలో మోకాలి దగ్గర దురద వచ్చేది. ఆమె ఏ మాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యుడిని సంప్రదించింది. వైద్యుడు ఆ అక్షణాలను ప్రమాదకరం కానివిగా నిర్ధారించాడు. మరికొద్దిరోజుల్లో అదే ప్రదేశంలో నొప్పి రావడం మొదలైంది. దాన్ని కీళ్లనొప్పులుగా వైద్యుడు పరిగణించాడు. మరికొద్ది నెలల్లోఅది తీవ్రరూపం దాల్చింది. దీంతో వైద్యుడు ఆమెను ఒక నిపుణుడికి సిఫార్సు చేశాడు. ఆయన దాన్ని ఎముకలకు చెందిన కేన్సర్‌గా నిర్ధారించి ఆమె ఏ ప్రాంతంలో అయితే దురదగా ఉందని ఏడాది క్రితం అన్నదో ఆ ప్రాంతాంలోని ఎముకలు తొలగించాడు. అంతటితో ఆగక ఆమెకు కేన్సర్‌ మిగిలిన ప్రాంతాలకు పాకకుండా కీమో థెరపీ చేయాలని సూచించాడు. అయితే ఆమె దానికి తన సంసిద్ధత వ్యక్తం చేయలేదు. ఎందుకుంటే, అప్పుడు ఆమె 10వారాల గర్భవతి. కీమో వల్ల తన కడుపులోని ఆడపిల్లకు హాని కలుగుతుందని ఆమె కీమో నిరాకరించింది. ప్రసవానంతరమే కీమో తీసుకుంటానని అన్నది. ప్రసవానంతరం ఆమె కేన్సర్‌ పరీక్షలకు వెళితే ఆమెకు కేన్సర్‌ బాగా ముదిరి పోయిందని దాదాపు మెదడులోకి సోకిందని తెలిసింది. దీంతో ఆమె ఎక్కువ కాలం బతకదని వైద్యులు తేల్చేశారు. అయితే, ఆమె వీటికి వెరవడం లేదు. రాబోయే మృత్యువుకన్నా తాను •జన్మనిచ్చిన చిన్నారిని చూసి మిగిలిన కొద్ది మాసాల జీవితం ఆనందంగా గడుపుతోంది. బహుశా ప్రతి తల్లి తాను మరణించి బిడ్డకు •జన్మనిస్తుంది, పునర్జన్మపొందుతుంది అనడానికి ఇదే ఉదాహరణ కాబోలు.

ప్రియు రాలు కన్నీరు తుడిచే

ఆమె అతని ప్రియురాలు. పేరు టెర్రీ టోరిస్‌ (23). ఆమె ప్రియుడు క్రిస్టొఫర్‌ రాబిన్సన్‌ కేన్సర్‌ రోగుల చివరిదశ వైద్య శరణాలయంలో ఉన్నాడు. మరికొద్దిరోజుల్లో మరణించనున్నాడని వైద్యులు నిర్ధారించారు. అతనికి అరుదైన రెనల్‌ కేన్సర్‌ సోకింది. సాధారణంగా అటువంటి వైద్య శరణాలయాలు గంభీరమైన నిశ్శబ్దంతో ఉంటాయి. కానీ, అక్కడ కూడా ఒక్కసారిగా పండగ వాతావరణం చోటు చేసుకుంది. మరణాన్ని ఆహ్వానిస్తూ గాజుకళ్లతో ఉన్న అక్కడి పేషంట్లందరిలో ఆనందం తొణికిసలాడింది. దీనికి కారణం టెర్రీ, క్రిస్టొఫర్‌ల పెళ్లి.

బ్రూక్లిన్‌ లో ఈ అరుదైన పెళ్లి •జరిగింది. చర్చి సంప్రదాయాల ప్రకారం వధూవరులు సాటి కేన్సర్‌ రోగులు సాక్షిగా ఒకటయ్యారు. ఇద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకుంటూ ఉండగా అతనికి 2013లో తుపాకీ తూటాలు తగిలాయి. వీటికి చికిత్స చేస్తుండగా అతనికి కేన్సర్‌ ఉందని వైద్యులు గుర్తించారు. అయినా ఆమె అతనికి దూరం కాలేదు. కేన్సర్‌ను ఎదిరించి పోరాడటానికి ఇద్దరూ ప్రయత్నించారు. కానీ, అది వారికి సాధ్యం కాలేదు. కేన్సర్‌ తమ నిర్ణయాన్ని మార్చలేదని ఇద్దరూ నిరూపించాలనుకున్నారు. కనుకనే, తుదిదాకా నేను నీతోడు ఉంటానని ప్రియురాలిగా ఆమె తాను చేసిన బాసను నెరవేర్చుకుంది. వారి పెళ్లికి వెళ్లిన అతిథులలో కళ్లు చెమరించని వారు లేరు. ”ఆమె నా జీవిత ప్రేమ. ఆమే నా స్నేహితురాలు. నా వెన్నెల. నా తారలు. నా ఆకాశం. ఆమే నా సర్వస్వంఅని అతను విలేఖరులతో అన్నాడు.వారిద్దరూ ఎంతకాలం కలసి ఉంటారో వైద్యులు చెప్పలేరు. కానీ, చరిత్రలో మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతున్నారు.

అందాల సీతాకోకచిలుక ఎగిరిపోయింది

ఆమె పేరు ఉల్‌రికా దండేకర్‌. కేన్సర్‌ పై పోరాడి అలసిపోయి ప్రశాంతంగా నిద్రించిన అందాల సీతాకోకచిలుక. ఆమె వయసు 21 ఏళ్లు. గత ఏడాది డిసెంబరు 31న ఏ స్వర్గతీరాలలోని సుమవనాలకో ఎగిరిపోయింది. ఆమెను బతికించుకోవాలని ఆమె తల్లితండ్రులు ఉర్సులా బహల్‌కర్‌, ఉదయ్ దండేకర్‌, ప్రదీప్‌ బహల్‌కర్‌లు శతవిధాలుగా ప్రయత్నించారు. ఇంగ్లండ్‌ లాంటి దేశంలో ఎముక మూలుగు దాతల నిధిని ఏర్పాటు చేయాలని ఆమె చివరికోరిక. ఆరోగ్యంగా ఉన్న ప్రతీ ఒక్కరూ ఎముక మూలుగు దానం చేయడానికి ముందుకు రావాలని ఆమె తన చివరి పిలుపునిచ్చింది. బ్లడ్‌ కేన్సర్‌ ఉన్న వారి అంతిమ చికిత్స మూలుగు మార్పిడి ఒక్కటే. కనుక మూలుగు బ్యాంకులు ఏర్పాటు చేయాలని, రక్తదానం మాదిరిగా మూలుగు దానం చేయడానికి ప్ర•జలు విరివిగా ముందుకు రావాలని, తమ పేర్లను నమోదు చేసుకోవాలని తన అంతిమ సందేశం ఇచ్చింది. ఇది ఇంగ్లండు లో •జరిగింది. ఇంగ్లండు పరిస్థితే ఇలా ఉంటే భారత దేశంలో ఈ తరహా మూలుగు నిధులు ఎప్పటికి వచ్చేనో?

cancer1

cancer2

cancer3

cancer4

cancer5

-ఏలూరిపాటి

ప్రకటనలు