3-028f

కేన్సర్ మందుల పేరుతో శరీరాన్ని మొత్తం విషం చేసినా తట్టుకోగలను. వైద్యం పేరుతో సూదులతో కుళ్లబొడుస్తూ నరకాన్ని సృష్టించినా ఓర్చుకోగలను. కానీ, వీటన్నింటికీ మించి, సమాజానికి పట్టిన ల్యాండ్ మాఫియా భూతంతో పోరాటమే కొత్తగా నేను చేయాల్సివచ్చింది.

********** ************ ***********

రియల్ మాఫియాలు ఎంతటి ప్రమాదంగా మారాయో తెలిసే సంఘటన ఒకటి జరిగింది. ”

అతను చాలా తీవ్రంగా ఆలోచిస్తూ చెబుతున్నాడు.

నేను శ్రద్ధగా వింటున్నాను.

 నా భూములు అమ్మకానికి పెట్టాననే ప్రచారం నా ప్రమేయం లేకుండా జోరందుకుని విస్తృతంగా ప్రచారంలోకి వెళ్లిపోయింది. ఇది నాకు చాలా పజిలింగ్ గా అనిపించింది. దీని వెనుక ఎవరున్నారా? అని ఆలోచించాను. సహజంగానే నా మనసు నా మాజీ భార్య, పాముగాడి మీదకు పోయింది. ఇదిలా ఉండగా, ఒకరి మీద ఒకర పోటీలు పడి కొనడానికి సిద్ధపడి నా ఇంటి ముందు క్యూ కట్టడం బ్రోకర్లు ప్రారంభించా రు. ముఖ్యంగా నంబూరు దగ్గరి పొలాల విషయంలో పోటీలు ఎక్కువైపోయాయి. ఫోన్లు, వ్యక్తిగత ఎంక్వైరీలు భారీగా రావడం మొదలయ్యాయి. నేను తీవ్రంగా నే స్పందించి ఆ భూములు అమ్మే ఆలోచన నాకు లేదని ఖండిస్తూ వచ్చాను. ఒక దశలో బ్రోకర్లు రావద్దని పేపరు ప్రకటన కూడా ఇద్దామా అనిపించేంత తీవ్రంగా అమ్మకాల ఎంక్వైరీలు వచ్చాయి. నేను కచ్చితంగా చెప్పడంతో చాలా మంది నాకు తెలిసిన వారు కావడంతో వెనక్కివెళ్లిపోయారు.

ఈ దశలో ఒకరోజు ఉదయం నాకు ఒక వ్యక్తి నుంచీ ఫోన్ వచ్చింది. ఆ భూములు మీరు ఫలానా వారికి అమ్మేశారని తెలిసింది నిజమేనా అని. సమస్య తీవ్రం అవుతోందని గ్రహించాను. అతను అక్కడితో ఆగకుండా నన్ను కలవడానికి వస్తానని అన్నాడు. నేను రమ్మన్నాను. ఆ బ్రోకర్ వచ్చాడు. వస్తూనే సరాసరి విషయంలోకి వెళ్లిపోయాడు. దాంతో నేను నంబూరు భూములు ఎవరికీ అమ్మలేదని చెప్పాను. అతను సంతోషించినట్లు కనిపించి, నా శ్రేయోభిలాషిగా నటించడం మొదలుపెట్టి, రియల్ ఎస్టేట్ లో రాబోయే పరిణామాల గురించి అన్నీ నాకు తెలిసిన విషయాలే చెప్పడం ప్రారంభించాడు. నేను చాలా ఓపికగా అవన్నీ విన్నాను. అంతా చెప్పిన తరువాత నంబూరులో నా భూములు ఉన్న మ్యాప్ తీసి చూపించి ఇవి మీవేనా అని అడిగాడు. నేను ఏం మాట్లాడలేదు. అవును అని కానీ కాదు అని గానీ చెప్పలేదు. నా సమాధానం అవసరం లేదన్నట్టు అతను తాను చెప్పాలనుకుంటున్నది చెప్పడం ప్రారంభించాడు.

నంబూరులో నాకు మొత్తం 55 ఎకరాలు ఉన్నాయి. ఇవి అన్నీ ఒక దానికి ఒకటి కలిసి ఉన్న పొలాలే. కానీ వీటన్నింటికీ కీలకమైనవి రెండు ఎకరాలు. ఆ రెండు ఎకరాల మీద రియల్ మాఫియా కళ్లు పడ్డాయి అని అతను చెప్పడం ప్రారంభించాడు.

ఈ రెండు ఎకరాలు రియల్ మాఫియాలు కబ్జా చేయబోతున్నాయని సమాచారం వదిలాడు. నేను మౌనం గా విన్నాను. ఆ కబ్జా కూడా చాలా వింతగా జరుగుతుందని చెప్పుకొచ్చాడు. నా పొలాలకు ఉన్న కీలకమైన ఈ రెండు ఎకరాలను రాత్రికి రాత్రి ఏడు తాళ్ల లోతుకు తవ్వేస్తారని, కేవలం ఒక గంటలో రెండు ఎకరాలు తవ్వి లారీలతో మట్టి ఎత్తుకు పోతారని చెప్పాడు. అదే జరిగితే నా  55 ఎకరాల పొలాలు మొత్తం 6 ముక్కలై పోతాయి. ఒక దానికి ఒకటి సంబంధం లేకుండాపోతాయి . దీంతో 55 ఎకరాల ఏకచెక్కగా ఉన్నపొలాలు 6 చిన్నచిన్న ముక్కలు గా అమ్ముకోవాల్సి వస్తుంది. ఇది బెదిరింపో, నిజమో నిర్ధారణ చేసుకోవడం కంటే నాకు బ్రాడ్ డే లైట్ లో వచ్చిన వార్నింగ్ గా భావించాను.

అయినా నేను తొణకలేదు.

ఆ బ్రోకర్ ఎవరో చెప్పమన్న మాటలు నాకు చెప్పి వెళ్లిపోయాడు.

నేను బ్రోకర్ చెప్పిన దానిలోని సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించాను. రెండు ఎకరాల్లో ఏడు తాళ్లలోతు తవ్వి లారీలతో ఎత్తుకు పోవడం అసాధ్యమైన విషయం కాదు. ఇది రాత్రికి రాత్రి కాదు, కేవలం కొన్ని గంటల్లో చేయగలిగిన ఆధునిక యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. కనుక అతను చెప్పేదానిలో అబద్ధం లేదు. అయితే అతను చెప్పిన దానికి మాఫియాలు తెగిస్తారా? అనేదే ప్రధాన సమస్య.

ఆ భూముల మీద కన్ను పడింది అంటే అవి చాలా విలువైన భూములు స్వర్ణ త్రికోణ భూములు అంటారు. అవి గుంటూరు, విజయవాడ, తెనాలి త్రికోణంలోకి వస్తాయి. దాదాపు మూడు ఏళ్ల క్రితం వాటి విలువ ఎకరం 10 లక్షలు అనుకుంటే, రాజధాని ప్రకటించిన తరువాత ఎకరం విలువ 10 కోట్లకు పై మాటగా ఉంటుంది. కనుకనే అంతకు తెగించడానికి వాళ్లు సిద్ధమయ్యారని నేను అర్ధం చేసుకున్నాను.

ఆ వచ్చిన బ్రోకర్ ఎవరు? ఎక్కడి నుంచీ వచ్చాడు? ఎవరు పంపగా వచ్చాడు? అతని వెనుక ఎవరున్నారు అనేది అప్రస్తుతం. ఎందుకంటే వాళ్ల వెనుక ఎవరో చాలా బలమైన వాళ్లు లేకపోతే నాకు ఆప్తులైన వాళ్లు కూడా నాకు హెచ్చరికలు చేయరు. ఈ దశలో నాకు ఉన్న దారులు రెండే రెండు. ఒకటి వాళ్లు ఇచ్చే చచ్చు రేట్లకు భూములు అమ్మి వేసి ప్రశాంతత కొనుక్కోవడం. లేదా ఏది ఏమైనా వాటిని రక్షించుకోవడానికి సిద్ధపడడం.”

అతను చెప్పడం ఆపి కాసిని మంచినీళ్లు తాగాడు. అతను ఎంతటి పద్మవ్యూహంలో చిక్కుకున్నాడో అప్పుడు నాకు ప్రత్యక్షంగా అర్ధం అయింది. ఇప్పటి వరకూ ఏదో ఆషామాషీగా సాగిన కుట్రలు ప్రాణాపాయస్థితికి చేరుకున్నాయని నాకు అర్ధం అయింది.

అతను చెప్పడం ప్రారంభించాడు. “లాండ్ మాఫియాలు ఇదే తీరుగా పనిచేస్తాయి. అవి మంచిగా కొంటాము అమ్ముతారా అని అడుగుతాయి. వారు పెద్దమనసు చేసుకుని కొంటాము అని అన్నప్పుడు అమ్మేస్తే కనీసం గంజి మెతుకులైనా మనకు పడేస్తారు. లేదంటే అవి కూడా ఇవ్వరు. ఎందుకంటే, వాళ్లు చేసే రిస్కులు అలాంటివి. తెలంగాణా వస్తుందా? రాదా? అనేది అంచనా వేయడం. వస్తే రాజధాని ఎక్కడ వస్తుంది? ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తే ఎక్కడ రాజధాని ఉండే అవకాశం ఉంది? ఈ సమాచారాలు సేకరించి దీనికి అనుగుణంగా ముందస్తుగా భూములు పావలాకు పదిపైసలుకు సేకరించడం జరుగుతుంది. అది కేవలం ఒక్క గుంటూరు విజయవాడ కేంద్రంగానే కాదు. రాష్ట్రంలో కొత్త రాజధాని ఏర్పాటు చేయడానికి ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో అక్కడల్లా వారు పాగా వేయడానికి ప్రయత్నిస్తారు. ఫలానా ప్రాంతంలో రాజధాని, ఫలానా ప్రాంతంలో పారిశ్రామికీకరణ, ఫలానా ప్రాంతంలో వ్యవసాయాభివృద్ధి అంటూకేవలం కాగితాల మీద సంతకంతో రాత్రికి రాత్రి అపర కుబేరులైపోతారు. కానీ, ఇది ఒక రాత్రిలో జరిగేది కాదు. దీనికి ఏళ్ల తరబడి అనేక రకాల కృషి ఉంటుంది. ఇందులో రాక్షస కృషి కూడా ఉంటుంది అనడం కన్నాఅదే ఎక్కువగా ఉంటుంది అని చెప్పడం మంచిది.

వీరిని ఎదిరించడం సామాన్యులకు సాధ్యం కాదు. సామాన్యులకే కాదు అసామాన్యులకు కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ఇవి సాధారణ ప్రయత్నాలు కావు. ఎన్నో పథకాలు వేసుకుని వాటిని అమలు చేసుకోవడంలో అన్ని బలగాలు కేంద్రీకరించిన అథోజగత్తు లీలా వినోదాలివి. నాలుగు కుంటల భూమికి కూడా మర్డర్ చేయడానికి వెనుకాడని రంగంలో వంద ఎకరాలు పైబడి ఉన్న నాకు భద్రతలేదని రాత్రిరాత్రికి గ్రహించాను. పరిస్థితి మూడు ఏళ్ల క్రితం ఇంత తీవ్రంగా ఉంది అంటే రాజధాని ప్రకటించి, భూములు సేకరించే నాటికి ఇది ఏ రూపం దాలుస్తుందో నేను సరిగ్గానే ఊహించగలిగాను.

ఒక వ్యక్తి స్వయంగా నా ఎదుటికి వచ్చి భూములు అమ్ముకుంటే మంచిదని నా భూముల వివరాల మ్యాపుతో వచ్చి నాకు సలహా ఇచ్చాడంటే, అది సామాన్యవిషయం కాదు. ఇస్తావా? లాక్కోమంటావా? అనే సందేశం అందులో ఉంది.”

అతను కాసేపు మౌనంగా ఉండిపోయాడు. తరువాత తానే అన్నాడు.

కేన్సర్ నాకు మూడోసారి వచ్చింది. ఇంకో 30 సార్లు కేన్సర్ తిరగబెట్టినా దానితో పోరాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కేన్సర్ మందుల పేరుతో శరీరాన్ని మొత్తం విషం చేసినా తట్టుకోగలను. వైద్యం పేరుతో సూదులతో కుళ్లబొడుస్తూ నరకాన్ని సృష్టించినా ఓర్చుకోగలను. కానీ, వీటన్నింటికీ మించిన సమాజానికి పట్టిన ల్యాండ్ మాఫియా భూతంతో పోరాటమే కొత్తగా నేను చేయాల్సివచ్చిందని గుర్తించాను.” కొంచెం సేపు విరామం ఇచ్చాడు.

చాలా కచ్చితంగా అన్నాడు, “నేను పోరాడడానికే నిశ్చయించుకున్నాను.”

తరువాయి భాగం రేపు ఇదేచోట

గడచిన భాగాలు

కేన్సర్ “జాలం” –1- మూడులోకాలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –2- నాన్న ప్రేమ – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –3- పునర్జన్మ – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –4- నాన్నలేనిలోటు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –5- తెరచాటు యుద్ధాలు– ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –6- దొంగదెబ్బలు– ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –7- తోడేళ్ల దాడి– ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –8- పరాన్నజీవులు– ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –9- పంచాగ్నిమధ్యం – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –10- ఉత్తర దక్షిణాలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –11- పడగనీడలో పెళ్లిళ్లు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –12- చాటింగ్ చీటింగ్ – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –13- సైబర్ ఫ్రాడ్– ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –14-సైబర్ జాలం– ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –15-ఇ.ప్రేమ జాలం– ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –16- సైబర్ ముఠాలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –17- సైబర్ కాప్స్ – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –18- విశృంఖలత్వం – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –19- మారుమనువు పుట్టలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –20- ఆన్ లైన్ పెళ్లిళ్లు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –21- పెళ్లికూపాలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –22- ఇష్టానిష్టాలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –23- లింఫోమా కేన్సర్ – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –24- జీవించేకళ – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –25- నమ్మకం – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –26- రథసారథి – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –27- రియల్ మాఫియా – ఏలూరిపాటి

ఒక ముఖ్య ప్రకటన : ఇందులోని పాత్రలు కేవలం కల్పితాలు మాత్రమే. ఇవి ఎవరైనా మరణించినా లేక జీవించిన వ్యక్తులను లేదా సంస్థలను పోలినట్లైతే అది కేవలం యాదృచ్ఛికం మాత్రమే. నా జీవితంలోని కొన్ని యదార్థ ఘటనలకు, సత్యాలకు,అంశాలకు, సమాచారాలకు, నివేదికలకూ నాటకీయత జోడించి, సున్నితమైన కేన్సర్ సమస్యల పట్ల, నిర్లక్ష్యంగా ఉంటున్న సమాజలోపాలను చూపడానికి,  పరిష్కారమార్గాలు కనుగొనడానికి చేస్తున్న అతిపెద్ద ప్రయత్నం. రెండు దశాబ్దాల పాత్రికేయ రంగ అనుభవంతో మూడేళ్లు చేసిన పరిశోధనాత్మక నివేదికకు ధారావాహిక రూపమే ఇది. ఇక్కడ ఇస్తున్న సమాచారాలు వైద్యనిపుణుల సలహాలు,సంప్రదింపులకు ప్రత్యామ్నాయాలు కాదు. చదువరులు తమకు లేక తమవారికి ఉన్న కేన్సర్ వ్యాధులను వైద్య నిపుణుల చేత పరీక్షింపచేయించుకుని నిర్ధారించుకుని తీరవలెను. వారికి వచ్చే సందేహాలకు వైద్యులు ఇచ్చే సలహాలు, చేసే సూచనలు నిర్ద్వందంగా పాటించవలెను. ఇక్కడ ప్రచురిస్తున్న అభిప్రాయాలు, ఆలోచనలు,అవలోకనాలు మొదలైనవి జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు పరిశీలించి పాత్రికేయ రంగ జాగ్రత్తలతో ఇస్తున్నాను. ఆయా రంగాల నిపుణుల సలహాల మేరకు, ప్రకటనల మేరకు,సమాచారాల మేరకు దీని రూపరచన జరిగింది. అయినా, ఇందులో ఉన్న లోటుపాట్లను, లోపాలను, తప్పొప్పులను ఇతరాలను నా దృష్టికి తీసుకువస్తే సహేతుకమైనవాటిని సవరించడానికి సిద్ధం. ఇక్కడ ఉన్న ఏ విధమైన సమాచారమైన మీ వైద్యులు చెప్పేదానికి విరుద్ధంగా ఉంటే వైద్యబృందం చెప్పేదే తుదకు అంగీకార యోగ్యమైనదిగా గ్రహించగలరు.

https://yeluripati.wordpress.com/

దయచేసి ఈ కింది చిరునామాలోని Facebook group: Cancer -prevention, control and cure లో చేరి మీ మద్దతు తెలుపండి.

https://www.facebook.com/groups/cancerpcc/

ప్రకటనలు