231

ప్రపంచంలో కొన్ని కోట్ల మందిని కేన్సర్ చంపుతోంది.  భారత దేశంలో కేన్సర్ రోగుల్ని కేవలం కేన్సర్ మాత్రమే చంపడంలేదు. మరి ఎవరు చంపుతున్నారుడబ్బుంటే ఆయుస్సు కూడా కొనుక్కోవచ్చా? వివరాలు అతి త్వరలో…!

**************                            ********************                         **************

నేను వెళ్లే సరికి నర్సు సెలైన్ సంచీ కొత్తది మారుస్తోంది. దానిమీద ఆమెకు ఇస్తున్న మందుల వివరాలు, మొదలు పెట్టిన సమయం, నిమిషానికి ఎన్ని చుక్కల చొప్పున ఎంత సేపు ఎక్కించబోతున్నారు అనే సమాచారాలు ఉన్నాయి.

నేను ఆమె మంచం దగ్గరగా వెళ్లాను. కానీ కొంచెం దూరంగానే ఉన్నాను.

ఆమె నన్ను చూసింది.

నాకు ఆమెను చూడగానే నిన్న నాతో అన్నమాటలు గుర్తుకు వచ్చాయి.

సాధారణంగా ఎవరైనా నాకు బతకాలని ఉంది అంటారు. నాకు మళ్లీ పుట్టకూడదు అనిపిస్తోంది.” అన్నది.

ఆ మాటలు నన్ను చాలా ఆలోచింప చేశాయి.

నాకు అనిపించింది ఒక్కటే. ఆమె తనకు తానుగా ఏదో చెప్పాలనుకుంది. అందుకు నా సాయం తీసుకుంది.

ఆమె తన తల్లికి సైగ చేసింది.

ఆవిడ నాకు ఒక మైక్రో ఎస్ డి మొమోరీ కార్డు ఇచ్చింది.

అందులో ఏం ఉంటుందో నేను ఊహించాను. ఆమె తాను రాసుకున్న డైరీ ఉంటుందనుకున్నాను. దాన్ని వెలుగులోకి తీసుకురావాలని కోరుకుంటోందని ఇట్టే ఊహించాను.

నేను మెమోరీ కార్డు చూస్తూ తలూపాను.

ఆమె కూడా కళ్లతోనే వీడ్కోలు చెప్పింది.

నేను ధైర్యంగా ఉండమని సైగ చేశాను.

ఆమె కంటి వెంట కన్నీరు వచ్చింది. వెంటనే దగ్గరలో ఉన్న దూదితో తుడవబోయి, దూది అక్కడే ఉంచి చేతితో ఆమె కన్నీరు తుడిచాను, సుతిమెత్తగా.

మళ్లీ ఆమె కళ్ల వెంట నీళ్లు కారాయి.  వాళ్ల అమ్మగారు ఆమె దగ్గరగా వచ్చి, కన్నీరు వచ్చిన్ని సార్లూ తుడుస్తూనే ఉన్నారు.

ఆమె ఊపిరి తీయడంలో తేడాలు వస్తున్నాయి. కొంచెం గురక కూడా వస్తోంది. ఎక్కువ కాలం శరీరం కదలక పోవడంతో ఊపిరి తిత్తులలో నీరు చేరుతుంది. అదే గురకగా శబ్దం చేస్తుంది. పేషంటు దగ్గర ఉన్నవారిని ఆ గురక చాలా బాధపెడుతుంది. కాళ్లు చేతులు చల్ల బడతాయి. చర్మంతో పాటుగా శరీరం చాలా సున్నితంగా మారిపోతుంది. అమ్మ ఒంటి లో నుంచీ అప్పుడే బయటికి వచ్చిన శిశువు ఎంత సున్నితంగా ఉంటుందో అంత మృదువుగా మారిపోతుంది.

కుడి చేతి మీద సెలైన్ ఎక్కుతున్న చోట మృదువుగా నర్సు రాసింది. ఆమె కన్నీళ్ల వేగం తగ్గింది.

నేను బయటకు వచ్చేశాను. కాసేపటికి డాక్టర్లు వచ్చారు. చివరి ప్రయత్నాలు చేయడానికి అనుకుంటాను.

ఆమె గురకలో తేడాలు వస్తున్నాయి. అంటే ఊపిరితీసుకోవడంలో వ్యవధి పెరుగుతోందన్న మాట.

ఆ విరామం మరింత పెరిగి చివరి సారి తీసుకునేది తుది శ్వాస అవుతుంది.

ఇదంతా కొద్ది నిమిషాల తేడాలో జరుగుతుంది.

శరీరాన్ని ప్రాణం విడిచి పోవడం కచ్చితంగా ఫలానా నిమిషం అని చెప్పడం కష్టమే.

ఆ క్షణాలు చాలా ప్రశాంతంగా ఉంటాయి. అప్పటి వరకూ నానా కష్టాలూ పడ్డ జీవుడు చాలా ప్రశాంతంగా ఉంటాడు.

వైద్యులు కూడా ఇక్కడ వేదాంతంలోకి జారుకుంటారు. శరీరంలో ప్రాణం ఎక్కడ ఉంటుంది అనేది ఇంకా వైద్యులు నిర్ధారణకు రాలేదు. కొంత మంది మెదడులో ఉంటుంది అంటారు. మరికొందరు గుండెలో ఉంటుంది అంటారు. గుండె కొట్టుకోవడం ఆగిపోతే ప్రాణం పోయినట్టే అని కొందరు అంటే, మెదడు చనిపోతే ప్రాణం పోయినట్టే అని కొందరు వైద్యులు అంటారు. శరీరంలో ఏ దీపం ఎక్కడ వెలిగితే ప్రాణం పోసుకుంటుందో, ఏ దీపం వెలిగితే ప్రాణం పోతుందో వైద్యులకు ఇంకాతెలియదు. అసలు శరీరం అంటే ఎనాటమీ చెప్పే నిర్వచనమే వారికి ప్రధానం. యాతనా శరీరం, కారణ శరీరం అంటూ ఎన్నో శరీరాలు ఉంటాయని వేదాంతులు అంటారు. వైద్యులు ప్రాణం పోయింది అని ఒక టైం వేసినా అది కచ్చితంగా అదే సమయం అని వారు కూడా చెప్పలేరు. వారు వేసిన సమయం తరువాత కూడా జీవుడు ఇంకా శరీరంలో నే ఉంటాడా ఉండడా అంటే వారు జవాబు చెప్పలేరు. దానికి మతమే జవాబు చెప్పాలి.

ఎవరి నమ్మకాలు వారివి.

అందుకే వైద్యులు తాము చేయవలసింది ఏమీ లేదనే నిర్ణయానికి వచ్చాక, పేషంటు ఏ మతానికి చెందిన వాడయితే ఆ మతం వారిని లోపలకు పిలిపించి శాంతి వచనాలు చెప్పే అవకాశాలు ఇస్తారు.

ఇటువంటి సంఘటనలు సాధారణంగా గుండెకు సంబంధించిన ఐసియూలలో తరచూ జరుగుతుంటాయి.

మిగిలిన వైద్య విభాగాల్లో కూడా జరుగుతాయి.

వైద్యులు పేషంటు చనిపోయింది అని చెప్పిన తరువాత ఆ వ్యక్తి దేహం చాలా ప్రశాంతంగా ఉంటుంది.

ఒక ప్రాణి పుట్టటం చూసినా, మరణం చూసినా మనసులో ప్రతి ఒక్కరికి నిర్వేదం కలుగుతుంది. ఇందుకు వైద్యులు, నర్సులు, బంధువులు అతీతులు కారు.

ప్రాణిని పుట్టించిన భగవంతుడే మృత్యువును కూడా సృష్టించాడు. భయంకర రోగాలు ఆ మృత్యు దేవత సైన్యం. వాటిలో ప్రముఖ దళపతి కేన్సర్. అది మరో వ్యక్తిని కబళించింది.

జీవుడు శరీరాన్ని వెంటనే విడిచి వెళ్లడని కొందరి విశ్వాసం. మరి కొందరి విశ్వాసం ప్రకారం జీవుడు ఆ శరీరాన్ని విడిచి మరో శరీరంలో వెంటనే ప్రవేశిస్తాడని అంటారు. అయితే శరీరం కూడా వెంటనే చల్లబడదు. క్రమేణా చల్లబడుతుంది. చల్లబడిన శరీరం కూడా కొంత సేపు మన మాట వింటుంది. ఆ తరువాత అది కట్టెగా మారుతుంది.

నేను నా బెడ్ మీద పడుకుని ఉన్నాను. నా కుడి చేతి చూపుడు వేలు మీద ఆమె ఇచ్చిన మెమొరీ కార్డు ఉంది. దాన్ని సెల్ ఫోన్ లో అమర్చి ఓపెన్ చేశాను. నా అనుమానం నిజమే అయింది. అందులో ఒకే ఒక పీడిఎఫ్ ఫైలు ఉంది.

నేను చదవడం ప్రారంభించాను.

********** *************** *************

రెండు రోజుల తరువాత ఒక సాయంత్రం దాదాపు 7 గంటలు అవుతుండగా నర్సు వచ్చి రొటీన్ పరీక్షలు చేసి, కొన్ని మందులు వేసి వెళ్లిపోయింది. రేపు ఉదయం నన్ను డిశ్చార్జి చేస్తారని చెప్పింది.

నేను ఆసుపత్రి నుంచీ డిశార్జి అయ్యాక సరాసరి వాళ్ల ఇంటికి వెళ్లాను .

ఆమె చనిపోయి వారం రోజులు దాటినా ఇందాకే శవం తీసుకెళ్లిన ఇంటి మాదిరి కళ తప్పి ఉంది.

తలుపు తట్టిన నాకు ఆమె తల్లి తలుపుతీసింది. దాదాపు ఐదు నిమిషాల తరువాత.

నన్ను చూసి లోపలకు రండి అన్నట్టు పక్కకు జరిగింది.

నేను వెళ్లి సోఫాలో కూర్చున్నాను. ఆమెను కూడా కూర్చోమన్నాను. ఆమె యాంత్రికంగా కూర్చుంది. చుట్టూ చూశాను. బంధువులు ఎవరూ లేరు.

నా అనుమానం నిజమే అయింది.

ఎవరికి వాళ్లు జారుకున్నారు. రెండు పీనుగులు మూడు నెలల వ్యవధిలో వెళ్లిన ఇంటి మీద కాకికూడా వాలడంలేదు. పిండం పెట్టే దిక్కు కూడా లేదని దానికి కూడా తెలిసిందేమో?

ఆవిడ దగ్గర ఆస్తి ఉంది అని తెలిస్తే మళ్లీ ఇల్లు కళకళలాడుతుందని తేలిగ్గానే ఊహించాను.

కొన్ని ఆచార వ్యవహారాలు చాలా కఠినంగా ఉంటాయి. పలకరింపుకోసం వెళ్లిన ఇంటి నుంచీ వచ్చేటప్పుడు ఏం చెప్పకుండా వెళ్లాలి.

నేను లిఫ్ట్ దగ్గరకు నడిచాను. నాకు ఉన్న డ్రైన్లు అన్నీతీసేశారు. వాటికి ఉన్న సంచీలు కూడా లేవు. కేవలం ముక్కులో నుంచీ కడుపులోకి పెట్టిన ఆహారకృత్రిమనాళం మాత్రమే ఉంది.

ఒక గంట సేపటి క్రితం వరకూ ఉన్న అవేవీ లేకపోవడంతో నాకు నడక కొత్తగా అనిపించింది.

కేన్సర్ పై చేస్తున్న యుద్ధంలో ఒక సైనికురాలిని కోల్పోయిన బాధ మనసులో భారంగా ఉంది.కానీ, ఆమె చేసిన పోరాటం అలనాటి బాలచంద్రుడిని గుర్తుకు తెచ్చింది.

కేన్సర్ పై పోరాటం ఆగేది కాదు. అతిత్వరలో మరో పోరాటం మొదలవుతుంది. ఇదే చోట

***************** **************** ***************

ప్రపంచంలో ప్రతి ఏడాది కొన్ని కోట్ల మందిని కేన్సర్ చంపుతోంది. ఇది సత్యం

భారత దేశంలో కేన్సర్ రోగుల్ని కేవలం కేన్సర్ మాత్రమే చంపడంలేదు. మరి ఎవరు చంపుతున్నారు?

పొగ తాగితే కేన్సర్ వస్తుంది. “భారీ మూల్యం చెల్లించకతప్పదు అని ప్రభుత్వమే ప్రకటనలు గుప్పిస్తోంది.

డబ్బుంటే బతకండి లేకుంటే చావండి అని అగ్రరాజ్యాల మందుల కంపెనీలు కేన్సర్ రోగులతో అంటున్నాయి.

డబ్బుంటే ఆయుస్సు కూడా కొనుక్కోవచ్చా?

ఆ వివరాలు అతి త్వరలో ……….మీముందుకురాబోతున్నాయి, మరో కేన్సర్ పోరాటంతో. ఇదే చోట.

232

*********                       ****************                       **********************

ఒక ముఖ్య ప్రకటన : ఇందులోని పాత్రలు కేవలం కల్పితాలు మాత్రమే. ఇవి ఎవరైనా మరణించినా లేక జీవించిన వ్యక్తులను లేదా సంస్థలను పోలినట్లైతే అది కేవలం యాదృచ్ఛికం మాత్రమే. నా జీవితంలోని కొన్ని యదార్థ ఘటనలకు, సత్యాలకు,అంశాలకు, సమాచారాలకు, నివేదికలకూ నాటకీయత జోడించి, సున్నితమైన కేన్సర్ సమస్యల పట్ల, నిర్లక్ష్యంగా ఉంటున్న సమాజలోపాలను చూపడానికి,  పరిష్కారమార్గాలు కనుగొనడానికి చేస్తున్న అతిపెద్ద ప్రయత్నం. రెండు దశాబ్దాల పాత్రికేయ రంగ అనుభవంతో మూడేళ్లు చేసిన పరిశోధనాత్మక నివేదికకు ధారావాహిక రూపమే ఇది. ఇక్కడ ఇస్తున్న సమాచారాలు వైద్యనిపుణుల సలహాలు,సంప్రదింపులకు ప్రత్యామ్నాయాలు కాదు. చదువరులు తమకు లేక తమవారికి ఉన్న కేన్సర్ వ్యాధులను వైద్య నిపుణుల చేత పరీక్షింపచేయించుకుని నిర్ధారించుకుని తీరవలెను. వారికి వచ్చే సందేహాలకు వైద్యులు ఇచ్చే సలహాలు, చేసే సూచనలు నిర్ద్వందంగా పాటించవలెను. ఇక్కడ ప్రచురిస్తున్న అభిప్రాయాలు, ఆలోచనలు,అవలోకనాలు మొదలైనవి జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు పరిశీలించి పాత్రికేయ రంగ జాగ్రత్తలతో ఇస్తున్నాను. ఆయా రంగాల నిపుణుల సలహాల మేరకు, ప్రకటనల మేరకు,సమాచారాల మేరకు దీని రూపరచన జరిగింది. అయినా, ఇందులో ఉన్న లోటుపాట్లను, లోపాలను, తప్పొప్పులను ఇతరాలను నా దృష్టికి తీసుకువస్తే సహేతుకమైనవాటిని సవరించడానికి సిద్ధం. ఇక్కడ ఉన్న ఏ విధమైన సమాచారమైన మీ వైద్యులు చెప్పేదానికి విరుద్ధంగా ఉంటే వైద్యబృందం చెప్పేదే తుదకు అంగీకార యోగ్యమైనదిగా గ్రహించగలరు.

https://yeluripati.wordpress.com/

దయచేసి ఈ కింది చిరునామాలోని Facebook group: Cancer -prevention, control and cure లో చేరి మీ మద్దతు తెలుపండి.

https://www.facebook.com/groups/cancerpcc/

ప్రకటనలు