221

అందుబాటులో ఉన్న వైద్యాలన్నీ ఆమెకు చేయండి డాక్టర్. మీరు ఏం చేయగలరో అన్నీచేయండి  మిగిలింది భగవంతుడే చూసుకుంటాడు.”

************* ************* *************

నేను వెళ్లే సరికి వాళ్ల అమ్మగారు బీమా డిపార్ట్ మెంట్ నుంచీ తిరిగి వస్తున్నారు.

రాత్రి అత్యవసరంగా కూతుర్ని ఆసుపత్రిలో జాయిన్ చేశామని చెప్పారు. విషయం నాకు తెలుసుకనుక నేను ఏ విధమైన ప్రశ్నలూ వేయలేదు. ఇద్దరం కలిసి ఎమర్జెన్సీ యూనిట్ దగ్గరకు వచ్చాము. నర్సు ఆవిడ కోసమే ఎదురు చూస్తోం దనుకుంటాను. ఆవిడను లోపలకు రమ్మన్నది. డ్యూటీ డాక్టర్ డెస్క దగ్గర ముగ్గురు వైద్యులు ఉన్నారు.

వాళ్లలో ఒక డాక్టర్ కు ఆవిడను పరిచయం చేసింది నర్సు. ఆవిడను చూస్తూనే ఆయన చాలా మృదువుగా విషయం చెప్పారు.

మనం చేయగలిగింది చాల తక్కువ ఉంది. ఆమె మెదడుకు కేన్సర్ సోకింది. ఆమెను సాధ్యమైనంత ఎక్కువ కాలం బ్రతికించడానికి మా ప్రయత్నాలు మమ్మల్ని చేయమంటే మేం చేస్తాము. కానీ అవి ఎంతవరకూ ఫలిస్తాయో చెప్పలేం. ఆమె కోమాలోకు వెళ్లనంత సేపు మన చేతుల్లోనే ఉంటుంది. కోమా లోకి వెళ్లితే విషయం కొంచెం గంభీరమే అవుతుంది. ముఖ్యంగా లివర్ బాగా ట్రబుల్ ఇస్తోంది. లంగ్స్ కొంత ఫర్వాలేదు. కానీ, ఎంతవరకూ ట్రీట్ మెంట్ కు తట్టుకోగలుగుతుందో అనుమానమే. మరి ఈ సమయంలో ఏంచేద్దాం?”

ఆవిడ రియాక్షన్ కోసం ఎదురుచూస్తూ వైద్యులు పర్ ఫెక్టు అటెన్షన్ లో ఉన్నారు.

ఆవిడ చాలా క్లుప్తంగా ఒకటే అన్నది. “అందుబాటులో ఉన్న వైద్యాలన్నీ ఆమెకు చేయండి డాక్టర్. మీరు ఏం చేయగలరో అన్నీచేయండి  మిగిలింది భగవంతుడే చూసుకుంటాడు.”అన్నది.

డాక్లర్లు ఒకసారి తమలో తాము మాట్లడుకుని ఆవిడను బయట వేచి ఉండమన్నారు.

డాక్టర్లు తనను మానసికంగా సిద్ధం చేస్తున్నారని ఆవిడ గుర్తించకపోయినా, ఆవిడ మనసు మాత్రం రాబోయే పరిణామాలు ముందే చెబుతోంది. తన కళ్ల ఎదుట కూతురు పడుతున్న బాధ ఆవిడను జీవచ్ఛవం చేసింది.

ఇద్దరం ఎమర్జెన్సీ యూనిట్ ఎదురుగా ఉన్న వెయిటింగ్ రూం లో కూర్చున్నాం.

ఆవిడ డాక్లర్లు చెప్పిన సంగతి నాకు చెప్పింది. ఆక్షణంలో ఏం మాట్లాడాలో నాకు  తోచలేదు. కొన్నిసార్లు మనం కొన్ని విషయాలు ముందుగా ఊహించినా, అవి మనకు ఎదురుపడినప్పుడు వెంటనే తట్టుకోవడం కష్టం.

కొంచెం ఊపిరి కూడదీసుకుని ఆవిడతో మెల్లగా అన్నాను. “డాక్టర్లు అంతే అంటారు. తాము చేసే ప్రయత్నంలో ఏదైనా జరగవచ్చు అని తెలిసినప్పుడు ముందు జాగ్రత్త కోసం అలా చెబుతారు. వాళ్లకు ఏదో ఆశ లేకపోతే వైద్యం చేయరుకదా? ఆ ఆశే నిజమై తిరిగి ఆమె మనమధ్యకు రావచ్చుఅన్నాను. ఆవిడకు ఏదో ఒక ఆశకల్పించాలన్న ఉద్దేశంతో.

ఆవిడతో మాట్లాడుతున్నాను అన్నమాటే కానీ, మొదటి సారి మాస్టెక్టోమీ జరగబోయే ముందు ఆవిడ కూతురు వైద్యుడిని వేసిన ప్రశ్న నామనసులో మెదిలింది.

డాక్టర్ నేను డ్యూటీలో ఎప్పుడు చేరవచ్చు?”

మళ్లీ ఉద్యోగంలో ఎప్పుడు చేరవచ్చు అనే ప్రశ్న డాక్టర్ ని చాలా కలతపెట్టే ప్రశ్న.నిజం చెప్పకూడదు. అలాగని అబద్ధం చెప్పకూడదు. చాలా బేలన్స్గా చెప్పాలి.

అమెరికాలో కూడా జాబ్ సేఫ్టీ లేదు. కేన్సర్ వంటి వ్యాధులు వస్తే ఉద్యోగం వదులుకోవాల్సిందే. అక్కడ ఉన్న చట్టాలు కొంత వరకూ పేషంటుకు ఉద్యోగ హక్కులు ఇస్తున్నా, పెట్టుబడిదారీ విధానంలోని సమాజంలో అవి ఏమాత్రం ఉపయోగపడవు. భూలోకంలో భారతదేశ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నంత భద్రత మరెక్కడా లేదు. కనుక వ్యాధి కుదురుతుందా లేదా అనేది చెప్పకపోయిన ఫర్వాలేదు. కానీ, ప్రపంచవ్యాప్తంగా వైద్యులు జవాబు చెప్పి తీరాల్సిన భేతాళ ప్రశ్న తిరిగి ఉద్యోగంలో ఎప్పుడు చేరవచ్చు?

ఇది కేవలం ఉద్యోగంలో చేరడమే కాదు, వైద్యుడు చెప్పేదాని బట్టీ రోగి కూడా కొంత ఆశ కల్పించుకుంటాడు. కేవలం ఫలానా రోజులు ఓపిక పడితే తాను మామూలు మనిషిని అవుతానని ఆశపడతాడు. అది మరింత త్వరగా వ్యాధిని నయం చేయవచ్చు.

ఎక్కువ సేపు మౌనం మంచిది కాదని అన్నాను నాకు ఆపరేషన్ ఖరారైంది. వచ్చేవారం లో ఫిక్స్ అయింది.”

ఆవిడ ఒక సారి నా వంకచూసి, “వెంకటరమణకు నమస్కారం పెట్టుకో నాయనా త్వరగా కోలుకోవాలనిఅన్నది. నేను ఆసుపత్రి నుంచీ బయటకు వచ్చాను.

మర్నాడు ఆమెను ఎమర్జెన్సీ నుంచీ మెడికల్ ఐసియుకి మార్చారు.

ఆవిడ కూడా ఆమె పక్కనే ఉండే వీలుంది అక్కడ.

నేను విజిటింగ్ అవర్స్ లో వెళ్లి చూసివచ్చేవాడిని.

ఆమె నా ఆరోగ్యం ఎలా ఉందని ప్రశ్నించింది. నేను చెప్పాను. నా ఆపరేషన్ కూడా ఖరారైందని. ఆమె విషెస్ చెప్పింది.

ఎప్పుడూ లేనిది తనకు కొబ్బరి నీళ్లు కావాలని తల్లిని అడిగింది. నేను తీసుకు వస్తానని వెళ్లబోయాను. ఆవిడ తాను వెళతానంది. నన్ను వద్దంది. ఆమె తల్లి బయటకు వెళ్లాక నాతో అన్నది.

నా పరిస్థితి నాకు తెలుస్తోంది. నేను ఆర్గాన్స్ డొనేట్ చేయాలనుకుంటున్నాను. ఏవి పనికివస్తాయో ఏవి పనికిరావో నాకు తెలియదు. కానీ,  మీరు ఆ కేర్ తీసుకోండి. అందుకు సంబంధించిన పత్రాలు సిద్ధం చేయించండి. అలాగే ఒక వేళ జరగకూడనిది జరిగితే నా శరీరం మెడికల్ కాలేజీకి డొనేట్ చేయమనండి. ఆ పేపర్లు కూడా దయచేసి తీసుకురండి.” అనికోరింది.

నేను వెంటనే అన్నాను,” అంత అవసరం లేదు. మీరు మామూలు అయ్యే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.”

నా మాటలు విని ఆమె నవ్వింది. “అయినా ఫర్వాలేదు. కాగితాల మీద సంతకం పెట్టినంత మాత్రాన నేను చనిపోను కదా. మీరు కాగితాలు సిద్ధం చేయండి. వాటిదారిన అవి ఉంటాయి.” అన్నది.

ఆమె తన మరణంలో కూడా తల్లికి కష్టం కలిగించకూడదని అనుకుంటోందనిపించింది.

తండ్రి మరణం నాడు బంధువులు పెట్టిన హింస ఆమెను ఎంతగా బాధించిందో నాకు అర్ధం అయింది.

మగతోడు లేని సంసారాన్ని మరణం ఎంతగా నరకయాతన పెడుతుందో నేను ఊహించాను. అప్పుడైతే సమర్ధురాలైన తాను ఉంది కనుక తండ్రికి ఏ లోటూ రాకుండా డబ్బుతో మనుషుల్ని కొన్నది. కానీ, ఆమెకు సమాజం ఎంత నీచంగా కనిపించిందో ఆమె చేయబోయే సంతకాల వల్ల ఊహించాను.

ఆమె మళ్లీ నాతో మాట్లాడుతుండడంతో నేను నా ఆలోచనల్లో నుంచీ బయటకు వచ్చి ఆమె చెప్పేదాని మీద శ్రద్ధ పెట్టాను.

నా జాగ్రత్తలన్నీ అమ్మ బ్రతికుండగా ఏం చేయాలి అని మాత్రమే. ఆవిడ చనిపోయాక ఏం చేయాలన్నది ఆవిడ ఇష్టం. ఏవి ఎప్పుడు ఎలా జరగాలో అవి అలా జరుగుతాయి. నాకు ఏమైనా అయితే మీరు కేవలం ఎస్ఎంఎస్ చేస్తే చాలు. మా లాయర్ గారు, ఆఫీసు ఫ్రెండ్స్, ఎడ్వైజర్లు ఎలర్ట్ అవుతారు. మిగిలిన విషయాలు వాళ్లే చూస్తారు. అప్పుడప్పుడు అమ్మను పలకరిస్తుండండి. ఆవిడ కోరుకుంటే ఏదైనా వృద్ధాశ్రమంలో చేర్పించండి. లేదూ ఆ ఇంట్లోనే ఉంటాను అంటే అక్కడే ఉండమనండి. నన్ను అడిగితే ఆమె వృద్ధాశ్రమంలో ఉండడమే మంచిది. నాకు తెలిసిన ఒక ఆశ్రమం చాలా బాగుంది. ఆమెను అడగండి. తొందరేంలేదు. మిగిలిన విషయాలంటారా? నేను విల్లులో స్పష్టంగా ఏం చేయాలో రాశాను. వాటిని మిగిలిన వాళ్లు ఎగ్జెక్యూట్ చేస్తారు. అమ్మ చనిపోయిన తరువాత ఆస్తి ఏమైనా మిగిలితే దాన్ని లిక్విడ్ ఎసెట్ గా మార్చి వ డ్డీని ఒక ట్రస్టు ద్వారా కేన్సర్ పేషంట్ల కోసం ఉపయోగించమని రాశాను. వీటన్నింటికీ మీరు సాక్షులు.” అంది నవ్వుతూ.

నేను ఇప్పుడవన్నీ ఎందుకూ? మీకు ఏం కాదు. మీరు మళ్లీ మామూలు వారు అవుతారు. మళ్లీ ఉద్యోగంలో చేరతారు. అమెరికా వెళతారు. పెళ్లి చేసుకుని, పిల్లాపాపలతో ఉంటారు.” అన్నాను.

ఇంతలో వాళ్ల అమ్మగారు వచ్చారు.

ఆవిడ కొబ్బరి నీళ్ల పట్టించింది. ఆమె వాటిని గుక్కెడు తాగి చారెడు వాంతి చేసుకుంది.

ఆవిడ కూతురు వీపుమీద చేతితో మృదువుగా రాసింది.

ఆమెకు అన్నహితవు పోయిందని నేను గ్రహించాను. కేన్సర్ మందుల్లో ఏర్పడే ప్రమాదం అదే. ఏదీ తినబుద్ధికాదు. నోరు చేదుగా ఉంటుంది. వాంతులు అవుతాయి. దీన్ని అధిగమించడమే ప్రధాన సమస్య.

నాకు కూడా అమె విషయంలో దుశ్శకునాలే కనిపిస్తున్నాయి.

************ ************************ ************************

రాత్రి 11 గంటలు కావస్తోంది. మెడికల్ ఐసియులో ప్రశాంతత బాగా పెరిగింది. నేను ఆపరేషన్ తరువాత ఎం ఐసియులో చేరిన మూడోరోజది. నర్సులు కేసు షీట్లు అప్డేట్ చేస్తున్నారు. మలయాళ నర్సు నా బెడ్ దగ్గరకు వచ్చింది. బెడ్ నెంబరు 13 పేషంటు నన్ను చూడాలనుకుంటోందని చెప్పింది.

నేను వెళ్లడానికి సిద్ధమయ్యాను. నర్సు నాకున్న సెలైన్ డిస్ కనెక్టు చేసింది. నాకున్న డ్రెయిన్లు అన్నీ సద్దుకుని బయల్దేరుతుండగా  ఆమె తల్లి నా దగ్గరకు వచ్చింది.

నన్ను జాగ్రత్తగా నడిపించుకుంటూ కూతురు బెడ్ దగ్గరకు తీసుకువెళ్లింది.

తరువాయి భాగం రేపు ఇదే చోట

ఒక ముఖ్య ప్రకటన : ఇందులోని పాత్రలు కేవలం కల్పితాలు మాత్రమే. ఇవి ఎవరైనా మరణించినా లేక జీవించిన వ్యక్తులను లేదా సంస్థలను పోలినట్లైతే అది కేవలం యాదృచ్ఛికం మాత్రమే. నా జీవితంలోని కొన్ని యదార్థ ఘటనలకు, సత్యాలకు,అంశాలకు, సమాచారాలకు, నివేదికలకూ నాటకీయత జోడించి, సున్నితమైన కేన్సర్ సమస్యల పట్ల, నిర్లక్ష్యంగా ఉంటున్న సమాజలోపాలను చూపడానికి,  పరిష్కారమార్గాలు కనుగొనడానికి చేస్తున్న అతిపెద్ద ప్రయత్నం. రెండు దశాబ్దాల పాత్రికేయ రంగ అనుభవంతో మూడేళ్లు చేసిన పరిశోధనాత్మక నివేదికకు ధారావాహిక రూపమే ఇది. ఇక్కడ ఇస్తున్న సమాచారాలు వైద్యనిపుణుల సలహాలు,సంప్రదింపులకు ప్రత్యామ్నాయాలు కాదు. చదువరులు తమకు లేక తమవారికి ఉన్న కేన్సర్ వ్యాధులను వైద్య నిపుణుల చేత పరీక్షింపచేయించుకుని నిర్ధారించుకుని తీరవలెను. వారికి వచ్చే సందేహాలకు వైద్యులు ఇచ్చే సలహాలు, చేసే సూచనలు నిర్ద్వందంగా పాటించవలెను. ఇక్కడ ప్రచురిస్తున్న అభిప్రాయాలు, ఆలోచనలు,అవలోకనాలు మొదలైనవి జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు పరిశీలించి పాత్రికేయ రంగ జాగ్రత్తలతో ఇస్తున్నాను. ఆయా రంగాల నిపుణుల సలహాల మేరకు, ప్రకటనల మేరకు,సమాచారాల మేరకు దీని రూపరచన జరిగింది. అయినా, ఇందులో ఉన్న లోటుపాట్లను, లోపాలను, తప్పొప్పులను ఇతరాలను నా దృష్టికి తీసుకువస్తే సహేతుకమైనవాటిని సవరించడానికి సిద్ధం. ఇక్కడ ఉన్న ఏ విధమైన సమాచారమైన మీ వైద్యులు చెప్పేదానికి విరుద్ధంగా ఉంటే వైద్యబృందం చెప్పేదే తుదకు అంగీకార యోగ్యమైనదిగా గ్రహించగలరు.

https://yeluripati.wordpress.com/

దయచేసి ఈ కింది చిరునామాలోని Facebook group: Cancer -prevention, control and cure లో చేరి మీ మద్దతు తెలుపండి.

https://www.facebook.com/groups/cancerpcc/

ప్రకటనలు