151

మనకున్న వ్యాధులు బయట పెట్టక పోయినా రకరకాలుగా ఊహించి, ప్రచారాలు చేసి, బతికేవారిని కూడా మానసికంగా ఖూనీ చేసి చంపి నోటితీట వదిలించుకునే వారంటే ఆవిడకు భయం. ఆవిడ భయాలు కూడా నిజాలే. మన సమాజంలో ఇటువంటి వారే అధికంగా ఉన్నారు.

 **********                     ******************                    **************

నేను వెళ్లే సరికి ఆమె నా కోసం ఎదురు చూస్తోంది. ఇద్దరం కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశాం. టిఫిన్ చేస్తున్నంత సేపు ఇతర విషయాలు మాట్లాడుకున్నాం. ఆమె తల్లి కూడా మేం టిఫిన్ చేస్తున్నంత సేపు అక్కడే ఉంది. ముక్తసరిగా మాట్లాడిందావిడ.. నేను పెద్దగా పట్టించుకోకపోయినా , ఆవిడను గమనించాను. నా అనుమానం నిజంచేస్తూ తన తల్లి అడిగిన విషయాలు ఆమె చెప్పింది.

ఇద్దరం కాఫీ తీసుకుని సోఫాదగ్గరకి వెళ్లాం. కాఫీ తాగుతూనే ఆమె తన తల్లితో రాత్రి జరిగిన సంభాషణ చెప్పింది.

రాత్రి మా అమ్మకు సందేహం వచ్చింది. ఇదంతా మీకు ఎందుకు చెబుతున్నాను అని. మీకు చెబితే ప్రపంచానికి చెప్పినట్లేనని అన్నానామెతో. మనకు వచ్చిన రోగాల గురించి ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం ఏముందని అడిగింది. అవసరం ఉంది కనుకనే చెప్పాలని అన్నాను. గుట్టుగా కప్పిపుచ్చుకోవడానికి ఇవి దాచేస్తే దాగేవి కాదు. అలాగని నేను బ్రస్ట్ కేన్సర్ రోగినని రిబ్బన్లు కట్టుకు తిరగమని నేను చెప్పడం లేదు. తిరగాల్సిన అవసరం కూడా లేదు. ఎవరైనా మన అనుమతి లేకుండా ఇటుంటి ఆరాలు తీసినా కూడా అది నేరమే అవుతుంది. అది జీవించే హక్కును హరించడంతో సమానం అవుతుంది. కేవలం ధైర్యం ఉన్న వాళ్లే తమకు వచ్చిన వ్యాధిని బయట పెట్టుకోగలుగుతారు. సినిమా నటులు, రాజకీయ నాయకులు తమ కెరీర్ పోతుందని భయంకర రోగాలు కప్పిపుచ్చుకుని హఠాత్తుగా ప్రపంచానికి చనిపోయాక తమ శవం సాక్షిగా తెలుపుతారు. అది వారి వ్యక్తిగత ఇష్టానిష్టాల కు వారున్న రంగాలలోని ఆంతరంగిక వ్యవహారాలకు సంబంధించిన అంశం. సినీనటుల ఇష్టానిష్టాలు తమ దర్శకులు, నిర్మాతల చేతుల్లో ఉంటే, రాజకీయ నేతల జీవితాలు పార్టీ అదుపులో ఉంటాయి. కనుక వారి వారి వ్యక్తిగత జీవితాలు వారి చేతుల్లో ఉండవు.

ప్రశాంతమైన నా జీవితంలోకి నా స్నేహితురాలు తుఫాన్ లా ప్రవేశించింది. ఆమే లేకుంటే నేను సగటు ఆడదానిలా సంసారం చేసుకుంటూ ఉండేదాన్ని ఏమో? ఇంజనీరింగ్ చేయాలని అమెరికా వెళ్లాలని ఆమె కన్నా ఒకమెట్టు పైన ఉండాలని, ఆమె కన్నా ఉన్నతుడైన భర్తను పొందాలనే ఆశలు ఉండేవి కావేమో? ఆ ఆశలే నా పాలిట వరాలు అయ్యాయి, శాపాలు అయ్యాయి.

నాకు వచ్చిన సమస్యల గురించి నేను బహిరంగంగా చర్చించకపోతే ఇవి ఎవరు చర్చిస్తారు? ఎవరూ చర్చించకపోతే సమస్యలకు పరిష్కారాలు ఎన్ని తరాలైనా దొరకవు. కనుకనే పదేపదే జ్ఞాపకం చేసుకుని నాకు వచ్చిన సమస్యలు అన్నీ మీ ముందు ఉంచుతున్నాను. మీకున్న అనుభవంతో ఏది సమాజానికి చెబితే మంచిదవుతుందో వాటిని చెబుతారని ఆశిస్తున్నాను. ఇవన్నీ మా అమ్మకు తెలియవు. ఆమె నోటితోటి ఆమే రోగానికి రొస్టు ఉండాలి, సంసారానికి గుట్టు ఉండాలి అంటుంది. కానీ, సొంతకూతురు దగ్గరకు వచ్చేసరికి రోగానికీ గుట్టే కావాలంటుంది. ఆమెకు అమెరికా సమాజం అర్థంకాదు. మన సమాజం మీద నమ్మకంలేదు. ఇది మనిషిని బతికుండగానే పీక్కుతినే సమాజం అని ఆమె ఉద్దేశం. మనకున్న వ్యాధులు బయట పెట్టక పోయినా రకరకాలుగా ఊహించి, ప్రచారాలు చేసి, బతికేవారిని కూడా మానసికంగా ఖూనీ చేసి చంపి నోటితీట వదిలించుకునే వారంటే ఆమెకు భయం. ఆమె భయాలు కూడా నిజాలే. మన సమాజంలో ఇటువంటి వారే అధికంగా ఉన్నారు.”

ఇంకో రెండు గంటల్లో తన ప్రియుడు కేన్సర్ వల్ల చనిపోతాడని వైద్యులు చెబితే, అతడిని పెళ్లి చేసుకున్న మానవతా మూర్తిని కూడా, అతడిఆస్తి మీద హక్కు కోసం పెళ్లి చేసుకుందనే నిందలు వేసే రాక్షస పిపీలకాలున్న సమాజం మనది. ఇటువంటి వారిగురించి ఎంతకాలమని భయపడుతూ కూర్చుంటాం? కనుకనే నేను ఉన్నది ఉన్నట్లు మీకు చెబుతున్నాను. ముఖ్యంగా నాన్న చనిపోయిన ఈ నెల రోజుల్లో మేము పడిన నరక యాతన మీకు చెప్పితీరవలసిందే.”

అని ఆమె ఆగింది.

తండ్రి మరణం గుర్తురాగానే అదుపు తప్పుతున్న తనను తాను కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించింది. ఆమె ప్రయత్నాలు చూసి నేను ఆశ్చర్యపోయాను. ఎంతో గుండె నిబ్బరం ఉన్నవారికి తప్ప సాధ్యం కాని పని ఆమె చేస్తోంది. దు:ఖం కూడా యోగమే. మనస్ఫూర్తిగా దు:ఖించాలంటే, మనస్ఫూర్తిగా ప్రేమించాలి. లేదా మనస్ఫూర్తిగా ద్వేషించిన వాళ్లే తమ శత్రువుకు ఆపద కలిగినప్పుడు మహదానందం అనుభవిస్తారు. ఈ రెండింటిలో ఏ ఒక్కటి అనుభవించినా రెండోది ఎలా ఉంటుందో తెలియడం చాలా తేలిక. చాలా మందికి ప్రేమించడం తెలియదు. ద్వేషించడం తెలియదు. సంసారి అంటే పెళ్లాం, పిల్లలు ఉన్న సన్యాసి. సన్యాసి అంటే ప్రపంచమే పిల్లలైన సంసారి.

ఇప్పుడు ఆమె కూడా దాదాపు ఇదే స్థితికి వెళ్లిపోయింది. కేన్సర్ వైద్యంలో మెటాస్టాసిస్ అనే మాటకు అర్ధం తెలుసుకోలేని అమాయకురాలు కాదు.

ఆమె క్విక్ గానే తన తండ్రి స్మృతులలో నుంచీ బయటకు వచ్చింది.

ఆ రాత్రి నిజంగా నాకు కాళరాత్రే. నాన్న చివరి సారి నాకు చెప్పింది ఒక్కటే, సాధ్యమైనంత త్వరగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని. అంతే తిరిగి ఆయన మాట్లాడలేదు. రాత్రి అమ్మతో గుండెలో మంటగా ఉంది అన్నారట. అమ్మ నాకు చెప్పడం మేం మళ్లీ ఆసుపత్రికి తీసుకువెళ్లడం. అప్పటికే ఆయన ఈ లోకంలో లేరని డాక్టర్లు చెప్పడం క్షణాల్లో జరిగిపోయాయి. నాన్న నన్ను విడిచిపోకూడదని నేను అనుకున్నా, ఆయన నన్ను విడిచి వెళ్లిపోయారు. నాకు ఈ బాధకన్న ఎక్కువగా బంధువుల బాధలు ఎక్కువ అయ్యాయి.

నాన్న పోయిన విషయం బంధువులకు ఫోన్ చేసి నేనే సమాచారం ఇచ్చాను. మేం అసుపత్రి నుంచీ ఇంటికి వచ్చే లోపలే బంధువులందరికీ తెలిసిపోయింది. తెల్లవారే లోపల బంధువుల్లో నాలుగింట మూడొంతులు మంది వచ్చేశారు. ముందుగా మా మేనమామ అత్తయ్య, మేనత్త మామయ్యలు వచ్చారు. వీరిద్దరూ ప్రధాన పోటీదార్లు. నేను ఎవరికి ఔనంటానా అని ఇద్దరూ ఒకరి మీద ఒకరు శత్రుత్వం పెంచుకున్నారు. కాకపోతే ఇద్దరూ చాలా త్వరగా కాంప్రమైజ్ అయి నేను ఎవరికి ఓకే చెప్పినా రెండో వారు గొడవచేయరాదని వాళ్లల్లో వాళ్లు నిర్ణయించుకున్నారు. ఈ పరిస్థితుల్లో నేను ఎవరో ఒకరికి ఓకే చెప్పక పోతే ఇద్దరూ మాకు శత్రువులు అయ్యే ప్రమాదం ఉంది. ఇది నేను త్వరగానే తెలుసుకున్నాను.

అమ్మ మాట్లాడలేని స్థితిలో ఉంది. నేను కదల్లేని పరిస్థితిలో ఉన్నాను. ఇంటిలో మరో మగదిక్కు లేదు. ఈ సమయంలో వాళ్లే వంతులు వేసుకుని శవాన్ని ఎత్తుకు పోయారు. జరగాల్సిన తంతు కానిచ్చారు. తిరిగి వచ్చాక అందరూ నా చుట్టూ చేరారు. నా ఉద్దేశం ఏమిటని అడిగారు. నేను నాన్న చితింకా మండుతూనే ఉంది ఇవేం ప్రశ్నలు అని అడిగాను. దానికి వాళ్లు ఇప్పుడు మాట్లాడాల్సిన మాటలే. ఆడదాని పెళ్లి విషయంలో ఇటువంటి పట్టింపులు లేవు. ఏడాదిలోపల పెళ్లి చేయాలని ఏదేదేదో చెప్పుకొచ్చారు. నాకు కొంచెం సమయం కావాలన్నాను. వాళ్లు సరేనని వెళ్లిపోయారు. పెద్దదినం రోజున నాకు పెద్దగండం ఉందని నాకు తెలియదు. అందరూ వెళ్లారు. కానీ మేనత్తా, మేనమామా మాత్రం వెళ్లలేదు. పెద్దదినం లోపల నాచేత అవును అనిపించుకోవాలని చూశారు.

రోజు రోజుకీ నా మౌనం వాళ్లలో రోషాన్ని పెంచుతోంది. నా కేన్సర్ గురించి పట్టించుకునే పరిస్థితుల్లో వాళ్లులేరు. నేను బతుకుతానో లేదో వాళ్లకు అక్కర్లేదు. అసలు వాళ్లంకేం కావాలో నాకు అర్ధం కావడంలేదు. నా ఇష్టానిష్టాలతో నిమిత్తం లేకుండా వాళ్లల్లో వాళ్లే నిర్ణయాలు చేసుకుంటున్నారు. నా మెడలో తాళికట్టాలనుకుంటున్నారా? మెడమీద కత్తిపెట్టారా? తెలియని పరిస్థితి.

కేన్సర్ ఉన్నా నన్ను చేసుకుంటామంటు న్న వారి మీద ఒకవైపు గౌరవం పెరుగుతోంది. కానీ కేన్సర్ ఉన్న అమ్మాయిలందరినీ ఇలాగే పోటీలు పడి పెళ్లాడతారా అని ఆలోచిస్తే, వీళ్ల మీద అసహ్యం కూడా వేస్తోంది.

పెద్దదినం రోజున ఏదో పెద్ద యుద్ధం జరుగుతుందని నేను అనుకుంటే ఎవరికి వారు నిశ్శబ్బంగా వెళ్లిపోయారు. వారి నిశ్శబ్దం వెనుక మూడో ప్రపంచ యుద్దం దాగి ఉందని నేను త్వరగానే గుర్తించాను. కానీ, ప్రస్తుతానికి తప్పిన ముప్పుకి సంతోషించాను. తాత్కాలికంగా దొరికిన విరామం నాకు కొంచెం ఊపిరి తీసుకొచ్చింది. మళ్లీ నా ఆరోగ్యం మీద శ్రద్ధపెట్టే అవకాశం ఇచ్చింది. నేను ఆసుపత్రికి రావడం. మిమ్మల్ని కలవడం జరిగింది.

క్లుప్తంగా ఇది నేనున్న పరిస్థితి.”

ఆమె చెప్పడం ఆపింది.

నాకు ఆమె గురించి ఒక అవగాహన వచ్చింది. వెంటనే ఆమెను అడిగాను.

మరి మీ నిర్ణయం ఏమిటి?”

ఆమె కొంచెం సాలోచనగానే అన్నది,”ముందుగా డాక్టర్ గారి సలహా తీసుకోవాలను కుంటున్నాను. వారి మాటల్లో ఎందుకో నాకు భరోసా కనిపించడంలేదు. ఇప్పటికే మెటాస్టాసిస్ అయింది కనుక నేను పిల్లల్ని కనే శక్తి ఎప్పటికి పొందుతానో తెలుసుకోవాలి. ఆ తరువాతే పెళ్లికి అంగీకరించగలను..”

వెంటనే నా అలోచన ల్లో నేను ఉండే అడిగాను, “మరి వైద్యం ఎప్పుడు మొదలు పెడతామన్నారు?”

నాదే ఆలస్యం అన్నారు. నేను ఎప్పుడు రెడీ అంటే అప్పుడే మొదలుపెడతారు. బహుశా మరోసారి మాస్టెక్టొమీ చేయాల్సి రావచ్చు. లివర్ కీ, లంగ్స్ కూ కీమో చేయాలంటున్నారు. అయితే డాక్టర్ల మాటల్లో వెనకటి ఉత్సాహం కనిపించడంలేదని నాకు అనిపిస్తోంది.” ఆమె అన్నది.

నేను కాసేపు ఆగి అన్నాను అదేం లేదు. డాక్టర్లు ఏదీ దాచరు వాళ్లకు ఏదో ఒక హోప్ కనిపించకపోతే మీకు వైద్యం చేస్తామని ఎందుకంటారు? బహుశా మీకు రికవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కనుకనే వైద్యం చేయబోతున్నారు.”అన్నాను.

ఆమె కూడా దానికి సానుకూలంగానే స్పందించింది. “నేనూ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ముందు వైద్యం చేయించుకోవాలి. ఆ తరువాతే మిగిలిన విషయాల గురించి ఆలోచించగలను.”.

ఆమె చాలా పాలిష్డ్ గా చెప్పిన మాటల్లోని అర్ధాలు తెలుసుకోవడం సామాన్యులకు సాధ్యంకాదు. కేవలం వైద్యులకు, కేన్సర్ వైద్యవిధానాలు తెలిసిన వారికే ఆమె మాటలు అర్ధం అవుతాయి. ఆమె తన గమ్యం చేరుకోవడానికి ముందు ఎంతపెద్ద ప్రయాణం చేయాల్సి ఉందో నాకుతెలుసు. ఆమెకు కూడా తెలుసు.

ఆమె ఏ తీరం చేరుతుందో అప్పుడే చెప్పడం కష్టం.

తరువాయి భాగం రేపు ఇదే చోట

https://yeluripati.wordpress.com/

దయచేసి ఈ కింది చిరునామాలోని Facebook group: Cancer -prevention, control and cure లో చేరి మీ మద్దతు తెలుపండి.

https://www.facebook.com/groups/cancerpcc/

ఒక విన్నపం : ఇందులోని పాత్రలు కేవలం కల్పితాలు మాత్రమే. ఇవి ఎవరైనా మరణించినా లేక జీవించిన వ్యక్తులను లేదా సంస్థలను పోలినట్లైతే అది కేవలం యాదృచ్ఛికం మాత్రమే. నా జీవితంలోని కొన్ని యదార్థ ఘటనలకు, సత్యాలకు, అంశాలకు, సమాచారాలకు, నివేదికలకూ నాటకీయత జోడించి, సున్నితమైన కేన్సర్ సమస్యల పట్ల, నిర్లక్ష్యంగా ఉంటున్న సమాజలోపాలను చూపడానికి,  పరిష్కారమార్గాలు కనుగొనడానికి చేస్తున్న అతిపెద్ద ప్రయత్నం. రెండు దశాబ్దాల పాత్రికేయ రంగ అనుభవంతో మూడేళ్లు చేసిన పరిశోధనాత్మక నివేదికకు ధారావాహిక రూపమే ఇది.

ప్రకటనలు