141

అదృష్టం కొద్దీ మంచి వైద్యుల దగ్గరకు వెళితే ఫర్వాలేదు. అదే కక్కుర్తి వైద్యుల దగ్గరకు వెళితే కేన్సర్ చికిత్సలో ఉన్న లోపాల ఆధారంగా పేషంట్ల ఇళ్లను గుల్ల చేసి వదులుతారు.కేన్సర్ వచ్చిన ఇంటికి దొంగలు వెళ్లాల్సిన అవసరం లేదు. వైద్యమే ఇంటిని కడిగిపెడుతుంది.

************                   **************                      *********************

కేన్సర్ చికిత్సలో మూడు విధానాలు చాలా కీలకమైనవి. ఆపరేషన్, రేడియేషన్, కీమోథెరపీలు. వీటిలో రేడియేషన్ కు ఒక ప్రత్యేకత ఉంది. ఇది ఒకసారే జరుగుతుంది. ఒక ప్రదేశంలో రేడియేషన్ ఎంత ఇవ్వవచ్చో అంత మొత్తం ఒకసారి ఇచ్చాక రెండో సారి అక్కడ ఇక రేడియేషన్ చేయరు. కానీ, ఆపరేషన్ ఎన్ని సార్లయినా చేయవచ్చు. మిగిలిన వాటితో పోలిస్తే కీమోథెరపీ పలుసార్లు ఇవ్వవచ్చు.

కేన్సర్ చికిత్సలో మరో కీలక అంశం ముందస్తుగా చెప్పలేకపోవడం. ఒకసారి చికిత్స మొదలు పెట్టాక అది ఆపరేషన్ తో ఆగుతుందా? రేడియేషన్ లేదా కీమో కావాలా లేక మూడూ కావాలా అనేది పేషంటు రికవరీ అవడాన్ని బట్టీ రోగతీవ్రతను అదుపు చేయడం బట్టీ ఉంటుంది. ఇది వైద్యుడి అనుభవం మీద కూడా ఆధారపడి ఉంటుంది. అందులోనూ వైద్య శాస్త్రంలో మిగిలిన చికిత్సల కన్నా కేన్సర్ చికిత్సలో వైద్యుల విచక్షాధికారానికే అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే ఏ ఇద్దరిలోనూ కేన్సర్ ఒకే విధంగా పనిచేయదు. అదృష్టం కొద్దీ మంచి వైద్యుల దగ్గరకు వెళితే ఫర్వాలేదు. అదే కక్కుర్తి వైద్యుల దగ్గరకు వెళితే కేన్సర్ చికిత్సలో ఉన్న లోపాల ఆధారంగా పేషంట్ల ఇళ్లను గుల్ల చేసి వదులుతారు.కేన్సర్ వచ్చిన ఇంటికి దొంగలు వెళ్లాల్సిన అవసరం లేదు. వైద్యమే ఇంటిని కడిగిపెడుతుంది.

ఎక్కువ మంది పేషంట్లు కేన్సర్ చికిత్సలలో కొద్దిగా భయానికి లోనవుతూ ఉండడానికి కారణం ఇదే. ఒక ఆపరేషనో లేక రేడియేషనో చేయించుకుంటే సరిపోతుందా అంటే చాలదనే చెప్పాలి. ఇది పేషంట్లకు, వారి ఇంట్లోవారికి సవాల్ గా మారుతుంది. ఒక కేన్సర్ పేషంటుకు వైద్యం చేయించడం అంటే కేవలం డబ్బు సమస్య మాత్రమేకాదు, మానసిక, శారీరక యాతనలు ఇంట్లో వారికి కూడా తప్పవు.

ఇప్పుడు ఆమె ఇదే యాతన ఎదుర్కో బోతోంది. ఆపరేషన్ అయ్యి ఆనందంగా కోలుకుంటున్న సమయంలో రేడియేషన్ అవసరమని వైద్యులు చెప్పడంతో ఆమె భయాందోళనలకు గురికావడానికి ప్రధాన కారణం ఇదే. దీని నుంచీ ఆమె ఎలా బయట పడందో చెబుతోంది.

డాక్టర్ గారు నేను వెళ్లేసరికి నా రిపోర్టులు పరిశీలిస్తున్నారు. సాధారణంగా ప్రతీ కేన్సర్ ఆపరేషన్ తరువాత తొలగించిన భాగాలు పారేయరు. వాటిని ముంబాయికి పంపి మరింత లోతుగా అధ్యయనం చేయిస్తారు. స్థానికంగా ఆసుపత్రిలో ఉండే పరీక్షా కేంద్రాలు ప్రాథమికంగా ప్రతీ పేషంటుకీ హిస్టోపాథాలజీ రిపోర్టు ఇస్తారు. ఇందులో ప్రధానంగా ఆపరేషన్ జరిగిన తీరు, తీసివేసిన భాగాలు మార్జిన్లకు అనుకూలంగా ఉన్నాయా అనేది పరిశీలిస్తారు. అంటే, ప్రతీ కేన్సర్ వచ్చిన భాగంతో పాటుగా కొంచెం ఆరోగ్యవంతమైన భాగాన్ని కూడా మార్జిన్ కోసం తీసేస్తారు. ఇంట్లో పుచ్చోంకాయలు అమ్మ తరిగినట్టు అన్నమాట. ఆమె కేవలం పుచ్చు ఉన్నది మాత్రమే కోయదు. కొంచెం మంచి భాగం కూడా తీసేస్తుంది. కాదా, ఇది కూడా అంతే.

పాథాలజీ రిపోర్టులో ముందుగా ఇదే పరిశీలిస్తారు. కేన్సర్ ఉన్న భాగాలతో పాటుగా మంచి భాగాన్ని కొంత మార్జిన్ గా తీసేశారా లేదా అనేది పరిశీలిస్తారు. దీని తరువాత కేన్సర్ వచ్చిన భాగాల భౌతిక వివరాలు రంగు పరిమాణం వంటివి నోట్ చేస్తారు. స్థూలంగా అది ఏరకం కేన్సరో నిర్ణయిస్తారు. వీటన్నింటితో ఒక ప్రాథమిక నివేదిక ఇస్తారు. దీని తరువాత ఈ నమూనాలలో కొన్నింటిని ముంబాయికి పరీక్షల నిమిత్తం పంపి ఆధునిక పద్ధతుల్లో నిశితంగా పరిశీలిస్తారు. ఈ రెండు రిపోర్టులు ఆధారంగా భవిష్యత్ చికిత్సలు నిర్ణయిస్తారు.

నా విషయంలో కూడా ఈ నివేదికలు వచ్చాయి. కానీ, నివేదిల్లో నాకు రేడియేషన్ సూచించారు. నేను కొంచెం ఆందోళన పడ్డాను. ఎందుకంటే, మళ్లీ రేడియేషన్ అంటే అమ్మా నాన్నా ఏవిధంగా స్పందిస్తారో అని కొంచెం ఆందోళన పడ్డాను. అయితే నాకు మరో మార్గం లేదు. కనుక రేడియేషన్ కు సిద్ధపడ్డాను.” అన్నదామె.

ఆమె ఇచ్చిన గాప్ లో నేను కొంచెం వేగంగానే రేడియేషన్ అవసర పడే పరిస్థితులు గుర్తుకు తెచ్చుకున్నాను.

మాస్టెటొక్టమీ అయిన తరువాత రేడియేషన్ సూచించడానికి కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. కేన్సర్ కంతి లేదా పుండు 5 సెంటీమీటర్ల కంటే పెద్దది అయినా, కేన్సర్ సోకిన భాగం తొగించినప్పుడు మంచి భాగానికి సరైన మార్జిన్లు లేకపోయినా, శోషరస గ్రంథులలో కేన్సర్ కణాలు కనుగొన్నా, రక్త నాళాలకు కేన్సర్ సోకినా, కేన్సర్ ఒకే భాగంలో పలు చోట్ల వచ్చినా రేడియేషన్ ను సూచిస్తారు. రేడియేషన్ ను సాధారణంగా కేన్సర్ మళ్లీ రాకుండా నిరోధించే చర్యల్లో భాగంగా సూచిస్తారు. మాస్టెక్టొమీ కేసుల్లో దాదాపు 20 నుంచీ 30 శాతం కేన్సర్ తిరగబెట్టే అవకాశం ఉంది. రేడియేషన్ చేయడం వల్ల కేన్సర్ మళ్లీ రావడానికి ఈ అవకాశం 10 శాతానికి తగ్గిపోతుందన్నమాట. అంటే శరీరానికి కేన్సర్ వచ్చే అవకాశం 90 శాతం ఉండదన్న మాట. కనుక రొమ్ముకూ, దాని చుట్టుపక్కల ఉన్న శోషరస గ్రంథులకు రేడియేషన్ ఇస్తారుఆమె ఇచ్చిన వివరాల ప్రకారం పూర్తి స్థాయిలో రేడియేషన్ జరుగుతోంది. అంటే ఇక పై అక్కడ రేడియేషన్ జరిగే అవకాశంలేదు.

ఆమె మళ్లీ చెప్పడం ప్రారంభించడంతో నేను నా ఆలోచనల నుంచీ బయట పడ్డాను.

గతంలో అయితే రేడియేషన్ అంటే నెలల తరబడి ప్రహసనంగా ఉండేది. నేడు అందుబాటులో వచ్చిన ఆధునిక టెక్నాలజీతో కేవలం ఐదు రోజుల్లో రేడియేషన్ కూడా అయిపోయింది. కానీ కోలుకోవడానికి కొంచెం ఎక్కువ సమయమే పట్టింది. ఈ లోపల ఇంటిలో, ఆఫీసులో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా మా చుట్టాల్లో మామీద అనుమానాలు పెరిగాయి. ఇవన్నీ తెలిసే అవకాశంలేని శుద్ధమొద్దు అవతారాలవి. వాళ్లు మేమేదో కావాలని నానుస్తున్నామనుకున్నారు, కానీ నా ఆరోగ్యం ఇంకా కుదుట పడలేదని తెలుసుకోలేదు. మేమూ వారికి విడమరచి చెప్పగలిగిన పరిస్థితి లేక మౌనంగా ఉండిపోవాల్సి వచ్చింది. మా మౌనం వారికి మరింత అనుమానం పెంచుతూ వచ్చింది. దాంతో వాళ్లు దాదాపు మేం పెళ్లికి వ్యతిరేకం అనే నిర్ణయానికి వచ్చేశాం అనుకున్నారు.

ఇదే విషయం నాన్న అమ్మా చర్చించారు. అయితే వారిద్దరూ కూడా ఒకే మాట మీదకు వచ్చారు. కేన్సర్ మీద అవగాహన లేని వారికి పిల్లను ఇవ్వకూడదు అని నిశ్చయానికి వచ్చారు. ఎందుకంటే అమ్మానాన్నలకు నేను పడే కష్టాలు ఏమిటో తెలుస్తోంది. వీటిని బయటివారికి తాము ఎలా చెప్పుకోలేక పోతోందీ కూడా అమ్మానాన్నలకు అర్ధమవుతోంది ఈ సమయంలో తమకు కావలసింది, తాము చెప్పకుండా విషయాలు అర్ధం చేసుకోగలిగే వారిని అమ్మానాన్నా నిర్ణయానికి వచ్చారు. అనుమానం చూపులు చూస్తున్నవారికి పిల్లను ఇవ్వము అని చెప్పాలనుకుని అదే మాట చెప్పేశారు. ఇది మా చుట్టాల్లోముఖ్యంగా నన్ను ఆశించే వారికందరికీ చాలా కోపం తెప్పించింది. దాదాపు మమ్మల్ని వెలివేశారు అంతా.

గతంలో నేను చదువుకుంటానని చెప్పినప్పుడు ఇటువంటి పరిస్థితి వచ్చింది . అప్పుడు అమ్మానాన్నా కొంచెం అసహనానికి గురయ్యారు. ఈసారి మాత్రం వాళ్లు చుట్టాల మీద ఏహ్యభావంతో ఉండిపోయారు. పోయి గంగలో దిగమను అని మిన్నకుండిపోయారు . నాకు కూడా మా అమ్మానాన్నల నిర్ణయం మీద సంతోషం వేసింది. నన్ను నన్నుగా స్వీకరించే వాడు కావాలని నేను కోరుకుంటున్నాను . అయితే నేను కోరుకునేది ఒకటి దైవం ఇచ్చేది ఒకటి అయింది.”

అంటూ ఆమె విరామం ఇచ్చింది.

ఆమె చెప్పేది జాగ్రత్తగా మనసులో నోట్ చేసుకుంటున్న నేను వాటిని ఒక ఆర్డర్ లో అమర్చుకోవడంలో మునిగిపోయాను.

ఇంతలో వంట మనిషి రావడం చూసి ఆమె టైం చూసింది. వాళ్ల అమ్మగారిని పిలిచి నేను కూడా ఆ రాత్రికి డిన్నర్ అక్కడే చేస్తానని చెప్పింది.

తిరిగి మేం మాటల్లో పడ్డాం. ఆమె తన దృష్టిని మానవసంబంధాల పై పెట్టింది.

గతం లో ఎప్పుడూ ఆలోచించనంతగా అపరిపక్వనాగరికత గురించి ఆలోచించాను. ఆపరేషన్, రేడియేషన్ ల వల్ల నాలో శక్తి బాగా సన్నగిల్లింది. దాంతో బాగా సెన్సిటివ్ అయ్యాను. వీటికి తోడు సైడ్ ఎఫెక్టులు కూడా నాపై బలంగా ప్రభావం చూపించడం ప్రారంభించాయి. దాంతో నిర్ణయాలు తీసుకునే శక్తి కూడా సన్నగిల్లుతూ వచ్చింది. కొంత కాలం నిర్ణయాలు తీసుకోవడం వాయిదా వేయాలని తీర్మానించుకున్నాను.

మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించాను. ఎందుకంటే మానసిక వత్తిడితో అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. రేడియేషన్ జరిగిన రెండు నెలల తరువాత నాకు మళ్లీ చెడు స్వప్నాలు రావడం ప్రారంభించాయి. దీని తరువాత నేను పెట్ స్కానింగ్ చేయించుకోవడం మెటాస్టాసిస్ అని వైద్యులు అనుమానించడం తో దాదాపు నేను ఎక్కడ బయల్లేరానో అక్కడికే చేరుకున్నాను. కేన్సర్ మళ్లీ నన్ను ఆక్రమించింది. ఈ సారి లివర్కు, లంగ్స్ కూ సోకింది.”

అని ఆమె కొంచెం ఎమోషన్ అయింది.

కాసేపు ఆగి తనే చెప్పింది.

ఇది తెలిసిన రాత్రే నాన్న గుండె పోటుతో పోయారు.”

తరువాయి భాగం రేపు ఇదే చోట

https://yeluripati.wordpress.com/

దయచేసి ఈ కింది చిరునామాలోని Facebook group: Cancer -prevention, control and cure లో చేరి మీ మద్దతు తెలుపండి.

https://www.facebook.com/groups/cancerpcc/

ఒక విన్నపం : ఇందులోని పాత్రలు కేవలం కల్పితాలు మాత్రమే. ఇవి ఎవరైనా మరణించినా లేక జీవించిన వ్యక్తులను లేదా సంస్థలను పోలినట్లైతే అది కేవలం యాదృచ్ఛికం మాత్రమే. నా జీవితంలోని కొన్ని యదార్థ ఘటనలకు, సత్యాలకు, అంశాలకు, సమాచారాలకు, నివేదికలకూ నాటకీయత జోడించి, సున్నితమైన కేన్సర్ సమస్యల పట్ల, నిర్లక్ష్యంగా ఉంటున్న సమాజలోపాలను చూపడానికి,  పరిష్కారమార్గాలు కనుగొనడానికి చేస్తున్న అతిపెద్ద ప్రయత్నం. రెండు దశాబ్దాల పాత్రికేయ రంగ అనుభవంతో మూడేళ్లు చేసిన పరిశోధనాత్మక నివేదికకు ధారావాహిక రూపమే ఇది.

ప్రకటనలు