కుడి వైపు వచ్చిన లోలకం కూడా ఒక్క క్షణం ఆగి ఎడమవైపు వెళుతుంది. నేను మాత్రం అనాలోచితంగా ఒక్క క్షణం కూడా ఆగకుండా అన్నమాటలు నా జీవితంలో చీకట్లు మిగిల్చాయి.”

*************** **************** ************* ************

కేన్సర్ నిర్ధారణలో ఆమె చేసిన జాప్యానికి కారణాలు తెలుస్తున్నాయి. అయితే పెళ్లి ఎలా తప్పిపోయిందో తెలుసుకోవాలని పించింది. అదే అడిగాను.

మరి మీ పెళ్లి ఎలా తప్పిపోయింది

ఆమె వెంటనే జవాబు చెప్పలేదు. కాసేపు ఆగిపోయింది. తరువాత నెమ్మదిగా చెప్పింది.

అది అంతతేలిగ్గా చెప్పగలిగే జవాబు కాదు. మేం ఇద్దరం చాలా నరక యాతన పడ్డాం. ఆ వివరాలు చెప్పాలి. మేం ముందుగా అనుకున్నట్లు రెండు వారాల గడువులో దాదాపు 11 రోజులు గడిచాయి. కానీ, ఏ నిర్ణయం తీసుకోలేక పోయాం. ఇది అమెరికా వెళ్లే అందరికీ ఎదురయ్యే సమస్యే. ముఖ్యంగా హెచ్ 1బి మీద వెళ్లే వాళ్లకు ఎదురయ్యే సమస్య. ఈ సమస్య రెండు రకాలుగా వస్తుంది. ఒకటి ఇండియా పౌరసత్వంలో ఉన్న మేము ఇండియాలో బీమా చేయించుకుని అమెరికా వెళ్లడం. లేదా మమ్మల్ని పిలిపించి ప్రాజెక్టు అప్పగించిన అమెరికా కంపెనీలు బీమా చేయించడం రెండవది. నాకు హెచ్ 1బి వీసా వస్తే నాకు కూడా బీమా వస్తుంది. దీని వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి. నా భర్తకు హెచ్ 1బి ఉంటే నేను భార్యగా వెళ్లాలి అంటే అతని వీసాకు అనుబంధంగా వెళ్లాలి. దీని వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి. ఈ రెండింటికీ ఉన్న తేడాల వల్ల నాకు బీమా రావచ్చు రాకపోవచ్చు.

101

అమెరికాలో బీమా విషయాలు అధ్యయనం చేయడం అంత తేలికైన విషయం కాదు. దీనికి ముఖ్యమైన సమాచారం మేం ఏ రాష్ర్టానికి వెళతాము అనేది. ఇది ముందుగా చూచాయిగా తెలుస్తుంది. దాన్ని బట్టీ బీమా విషయాలు తెలుస్తాయి. అక్కడ రాష్ట్రాన్నిబట్టీ, బీమా కంపెనీని బట్టీ విధివిధానాలు మారతాయి. అంతేకాదు వీసా రకాన్ని బట్టీ కూడా పాలసీలు మారతాయి. వీటికి తోడుగా ముందస్తు వ్యాధులకు కవరేజ్ ఉండడంలో కూడా తేడాలు ఉంటాయి. గతంలో ఇవి మరీ కఠినంగా ఉండేవి. ఇప్పుడు కొంత సరళీకృతం అయినా దీనిలో ఉన్న రిస్క్ లు దీనిలో ఉన్నాయి. ముఖ్యంగా నేను పనిచేస్తున్న కంపెనీ నా హెచ్ 1 బి ప్రాసెస్ నిలిపి వేస్తే నేను భార్య స్టేటస్ లోనే వెళ్లాల్సి ఉంటుంది. నేను భార్య స్టేటస్ లో అక్కడికి వెళితే ఇక్కడ నా ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది.

అంతేకాక, హెచ్ 1బి నుంచీ గ్రీన్ కార్డు హోదా పొందేవరకూ మేం చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఒక సారి అమెరికా పౌర సత్వం వస్తే ఒబామా బీమా వస్తుంది. ఇంక దిగుల్లేదు. కానీ, అది తేలికకాదు. తొందరగా అయ్యే అవకాశం కూడా లేదు.

ఈ విషయాలు కొంచెం పక్కన పెట్టి ముందుగా ఇంట్లో వాళ్ల రియాక్షన ఎలా ఉంటుందో చూడమని అడిగాను. అతను నన్ను తిట్టిపోశాడు. టార్గెటెడ్ గా ఉండడం మానేసి పిచ్చిపట్టినట్టు ఫైరింగ్ చేస్తే విషయం చెడిపోతుందని హెచ్చరించాడు. ముందుగా అది కేన్సర్ అవునో కాదో నిర్ణయించుకోకుండా ఎలా చెబుతావని అన్నాడు.

102

నేనూ మొండిగా వాదించాను. అలా అయితే కేన్సర్ అనే చెప్పేసెయ్ ఏమౌతుందో చూద్దాం అన్నాను. ఇదీ అతనికి నచ్చలేదు. కానీ నేనే పంతం పట్టాను.

నేను అంతగా పంతం పట్టడానికి ఒక కారణం ఉంది. వాళ్ల ఇంట్లో వాళ్లను మోసగించాను అనే పేరు తెచ్చుకోవడం కన్నా ఆ మనుషులు ఏ రకమో తెలుసుకుంటే అది మరింత మంచిదని భావించాను. చివరికి నా పంతమే నెగ్గించుకున్నాను. ముందుగా వాళ్ల ఇంటిలో నా అనుమానాలు గురించి చెప్పాడు.

వాళ్ల ఇంటిలో తక్షణం డివిజన్ వచ్చింది. వాళ్ల నాన్నగారు నాకు అనుకూలంగా మాట్లాడారు. వాళ్ల అమ్మగారు వ్యతిరేకంగా మాట్లాడారు. వాళ్ల చెల్లెలు తటస్థంగా ఉండిపోయింది.

నన్ను చేసుకుంటానని మాట ఇచ్చిన తరువాత తిరిగిపోవడం మంచిది కాదని, అందులోనూ ఇటువంటి దశలో అసలు మంచిది కాదని వాళ్ల నాన్నగారు అన్నారు. వచ్చింది కేన్సర్ అవునో కాదో నిర్ధారించుకుంటే మంచిది అని సలహా ఇచ్చారు. దానికి అతను కేన్సర్ అయితే ఎంచేద్దాం అన్నాడట. ఇటువంటి విషయాల్లో అయితే గియితే మాటలు ఉండకూదని ఆయన కోప్పడ్డారట. కేన్సర్ ఉన్నా లేకున్నా పెళ్లి చేసుకోవడం ఖాయం. ముందు వైద్యం సంగతి చూడమని అన్నారట.

వాళ్ల అమ్మగారు దీనికి సంపూర్తి వ్యతిరేకంగా ఉన్నారట. ఆమెకు సుతరామూఇష్టంలేదని కరాఖండీగా చేప్పేసింది. కేన్సర్ లేదని తనకు నమ్మకం ఉన్న డాక్టర్ చెబితేనే పెళ్లి జరుగుతుందని చెప్పిందట.

వాళ్ల చెల్లెలు మాత్రం అర్జంటుగా పరీక్షలు చేయించుకోమని సూచించిందట. పెళ్లి సంగతి తరువాత ఆలోచించవచ్చు . కేన్సర్ వ్యాధి వస్తే ప్రతీ రోజూ చేసే ఆలస్యం ప్రాణ ప్రమాదకరమని చెప్పిందట.

అతడు పెద్దగా ఎక్సైట్ మెంట్ కు గురికాలేదు. తాను ఊహించిందే జరిగిందని నాతో అన్నాడు. నేను సరే ఆలోచించి చెబుతాను అన్నాను.

దానికి అతను ఏం మాట్లాడలేదు.

103

నాకు మాత్రం ఈ పెళ్లి జరగదు అని మొదటి సారి అనిపించింది. ఇద్దరం అనుకున్న 14వ రోజు వచ్చింది. ఇద్దరం ఏ నిర్ణయానికి రాలేకపోయాం. ఆరోజు రాత్రి పొద్దుపోయే వరకూ చాలా ఆలోచించాం. సడన్ గా నాకు నెగెటివ్ ఆలోచన వచ్చింది. పెళ్లి చేసుకుందాం అని ఆలోచించకుండా ఇలా ఎందుకు ఆలోచిస్తున్నాం? అని ప్రశ్న వచ్చింది. అంటే మా మధ్య స్ప్లిట్ వచ్చిందనిపించింది. ఎందుకంటే పెళ్లి చేసుకోవాలి అనే నిర్ణయం బలంగా ఉండి ఉంటే ఇంత సేపు ఆలోచించేవాళ్లం కాదు కదా అని అనిపించింది.

మరుక్షణం నేను ఇంకేం ఆలోచించకుండా బ్రేకప్ అవుదాం అని అనేశాను.

దానికి అతను కొట్టినంత పని చేశాడు. కానీ కొట్టలేదు. అయితే, చాలా తీవ్రంగా నన్ను చూస్తూ ఒకటే మాట అన్నాడు. నువ్వు చాలా మొండితనం గా ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఆలస్యం చేసి అందర్నీ విసిగిస్తున్నావ్ అని కసురుకున్నాడు. నేను కూడా ఎమోషనల్ అయ్యాను. చాలా కోపం వచ్చింది. పరీక్షలు చేయించుకోవాలని నాకు తెలియదా? నీకు చెప్పి 14 రోజులు అయింది. నువ్వెందుకు ఆలస్యం చేశావ్. ముంబాయిలోనే మరుక్షణం నన్ను కేన్సర్ ఆసుపత్రికి ఎందుకు తీసుకువెళ్లలేదు. నీకన్నా నీ చెల్లెలు చాలా నయం అని కడిగిపారేశాను.

దాంతో అతను చాలా హర్టు అయ్యాడు. అలా అనాలని నేను కూడా ముందుగా అనుకోలేదు. నేనన్న మాటలకు నేనే ఆశ్చర్యపోయాను. అయితే, ఆ పరిస్థితిలో నాకు ఒకటి స్పష్టం అయింది. ఇది బెడిసికొట్టిన సంబంధం అని. అతను మాత్రం బతిమలాడే దశకు వచ్చేశాడు. ఎన్ని కష్టాలైనా కలిసే పడదాం అని బామాలాడు. చివరికి పౌరుషానికి పోయి అన్నమాట నా మీద చాలా పనిచేసింది. తనను పెళ్లి చేసుకోపోతే నాకు కష్టాలు ఇంకా పెరుగుతాయని హెచ్చరించాడు. ఇది నా మీద ఉన్న ప్రేమతో చెబుతున్నానని , ఇంకా మొండితనం చేయవద్దని అన్నాడు . కేన్సర్ వస్తే నాకు ఇతరులతో పెళ్లి కావడం కష్టం అనీ, తాను అన్నింటినీ భరించడానికి సిద్ధంగా ఉన్నాననీ అన్నాడు. అతను చివరిగా అన్నమాట నన్ను చాలా బాధించింది.

ఆ క్షణంలో నాలోని అపరిపక్వత నన్ను జయించింది. అతడు ఎందుకు చెబుతున్నాడో, ఏం చెబుతున్నాడో నేను వినిపించుకోలేదు.. అతను తప్పితే నన్ను ఇంకెవరూ పెళ్లిచేరుకోరని అంటున్నాడను కుని అపార్ధం చేసుకున్నాను. కానీ, భారత దేశంలో వివాహవ్యవస్థ ఎంత బలహీనమైందో నాకు ఆ క్షణంలో అర్ధం కాలేదు. అతను అన్నమాటలు నాకు ప్రత్యక్ష అనుభవంలోకి వచ్చాక నిజంగా చేతిలోని స్వర్గాన్ని ఎలా జారవిడుచుకున్నానో అర్ధమైంది.”

ఆమె ఎమోషనల్ అయింది.

104

నేను మంచినీళ్లు అందించాను.

తాను తీసుకుంది. కొద్దిసేపు బలంగా ఊపిరి తీసుకుని కుడి వైపు వచ్చిన లోలకం కూడా ఒక్క క్షణం ఆగి ఎడమవైపు వెళుతుంది. నేను మాత్రం అనాలోచితంగా ఒక్క క్షణం కూడా ఆగకుండా అన్నమాటలు నా జీవితంలో చీకట్లు మిగిల్చాయి.” అంది.

తరువాత దాదాపు ఒక ఐదునిమిషాలు ఆగి నెమ్మది గా చెప్పింది.

అతనితో తెగతెంపులు చేసుకుని ఇంటికి వచ్చి జీవితంలో మొదటి సారి నా ప్రొఫైల్ మేరేజ్ బ్యూరో లో రిజిస్టర్ చేశాను. అదే నేను చేసిన పొరపాటు. నా ప్రొఫైల్ ముందుగా ఆఫీసులో వాళ్లు చూసి అతనికి చెప్పారు. దాంతో అతను కోపం తెచ్చుకుని తనకు కూడా వేరే సంబంధాలు చూడమని అన్నాడు. వాళ్ల అమ్మ క్షణం ఆలస్యం చేయకుండా అతని ప్రొఫైల్ రిజిస్టర్ చేసింది. రెండు వారాలు గడిచేసరికి అతడి వెడ్డింగ్ కార్డు నా చేతిలో ఉంది. పెళ్లి కూతురికి ఒక చేతిలో గ్రీన్ కార్డు, రెండో చేతిలో పూలదండ ఉన్నాయి. అతడు గ్రీన్ కార్డు తీసుకుని జేబులో పెట్టుకుని, ఆమె చేత మెడలో దండవేయించుకున్నాడు. నేను మాత్రం ఇలా మిగిలాను.” అంది.

ఆమె మౌనంగా కాసేపు కూర్చుంది.

105

నేను ఏం మాట్లాడలేదు. ఆమె తెప్పరిల్లిన తరువాత అడిగాను మరి మీ ఇంట్లో ఎప్పుడు చెప్పారు?”

అది చాలా ముఖ్యమైన ప్రశ్నే. అతనితో బ్రేకప్ అయ్యానన్న సంగతి నేను వెంటనే చెప్పలేదు. దాదాపు పది రోజుల తరువాత మా ఇంట్లో చెప్పాను. బహుశా నా మనసులో ఎక్కడో అతను తిరిగి వస్తాడనే ఆశ నాచేత ఆలస్యం చేయించి ఉంటుంది. నేను చెప్పగానే మా అమ్మానాన్నా షాక్ తిన్నారు. నాన్న ముందుగా తేరుకుని తాను వెళ్లి మాట్లాడనా అని అడిగారు. నేను వద్దన్నాను. బహుశా మా నాన్నగారిని ఆరోజు వెళ్లనిచ్చి ఉంటే ఏం జరిగేదో, కానీ, నా మూర్ఖత్వం వల్ల వ్వవహారాన్ని చెడగొట్టుకున్నాను. శుభలేఖ చేతికి అందాక నేను చేసేది లేక నెట్ లో సంబంధాలు వెతకసాగాను. అక్కడ కూడా నేను తప్పు చేశాను.

నేను గ్రీన్ కార్డు ఉన్న వ్యక్తి కోసం చూశాను. గ్రీన్ కార్డు ఉన్న వ్యక్తితో పెళ్లి జరిగితే, అమెరికా పౌరసత్వం వెంటనే వస్తుంది కనుక చికిత్స చేయించుకోవచ్చని ఆశించాను.

అయితే, ఈ లోపల నేను ఊహించినట్లు మా అమ్మ పోరు పెరిగింది. ఆసుపత్రికి వెళ్లక తప్పలేదు. డాక్టర్ నాకు ముక్కచివాట్లు పెట్టలేదు కానీ, మెట్రో లేడీస్ చేసే లేట్ చేశానని నవ్వుతూ అంది. ఆమె నవ్వులోని అర్ధం నాకు వెంటనే అర్ధం కాలేదు. పరీక్షల రిజల్ట్స్ వచ్చి కేన్సర్ లింఫ్ నోడ్స్ కు వెళ్లిందని, అయితే అది ఇంకా లోకల్ గానే ఉందనిఎంత వేగిరంగా ఆపరేషన్ జరిగితే అంత మంచిదని చెప్పింది.”

నేను కాసేపు ఆగి అడిగాను, “ ఆపరేషన్ ఎప్పుడు చేశారు?” అని.

ఆమె వెంటనే జవాబివ్వలేదు. కాసేపాగి చెప్పింది. “ దానికన్నా ముందు భారతీయ వివాహవ్యవస్థ మీద నాకు వేసిన అసహ్యం గురించి చెప్పాలిఅని అన్నది.

తరువాయి భాగం రేపు ఇదే చోట

https://yeluripati.wordpress.com/

దయచేసి ఈ కింది చిరునామాలోని Facebook group: Cancer -prevention, control and cure లో చేరి మీ మద్దతు తెలుపండి.

https://www.facebook.com/groups/cancerpcc/

ఒక విన్నపం : ఇందులోని పాత్రలు కేవలం కల్పితాలు మాత్రమే. ఇవి ఎవరైనా మరణించినా లేక జీవించిన వ్యక్తులను లేదా సంస్థలను పోలినట్లైతే అది కేవలం యాదృచ్ఛికం మాత్రమే. నా జీవితంలోని కొన్ని యదార్థ ఘటనలకు, సత్యాలకు, అంశాలకు, సమాచారాలకు, నివేదికలకూ నాటకీయత జోడించి, సున్నితమైన కేన్సర్ సమస్యల పట్ల, నిర్లక్ష్యంగా ఉంటున్న సమాజలోపాలను చూపడానికి,  పరిష్కారమార్గాలు కనుగొనడానికి చేస్తున్న అతిపెద్ద ప్రయత్నం. రెండు దశాబ్దాల పాత్రికేయ రంగ అనుభవంతో మూడేళ్లు చేసిన పరిశోధనాత్మక నివేదికకు ధారావాహిక రూపమే ఇది.

ప్రకటనలు