నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాను. మాట ఇవ్వడం వేరు పెళ్లి చేసుకోవడం వేరు కాదు. నేను మాట ఇవ్వడంతోనే మన పెళ్లి జరిగిపోయింది. ఇక పెళ్లి జరగడం కేవలం ఒక తంతు మాత్రమే. ఇప్పటికే మనం భార్యాభర్తలం. కేన్సర్ మనల్ని విడదీయలేదు.

************ *************** *******************

మొదటిసారి రొమ్ము కేన్సర్ లక్షణాలు కనిపించినప్పుడు చేసిన పొరపాటు ఎవరికీ చెప్పకపోవడం. అని ఆమె తన అంతరంగా చెబుతోంది. కనీసం ఇంట్లో వాళ్లకు చెప్పి ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేది అంటూనే ఆమె గతంలోకి వెళ్లింది.

భారతదేశంలో స్త్రీలు అనేక కారణాల వల్ల ఆరోగ్య సమస్యలు వెంటనే బయట పెట్టరు. ఇందుకు పెళ్లైన వాళ్లైనా , పెళ్లి కాని వాళ్లైనా పెద్దతేడా లేదు. నేను కూడా ఇందుకు మినహాయింపు కాదు. సహజంగా అయితే మా అమ్మకు నా ఆరోగ్య సమస్య చెప్పుకోవాలి. కానీ, కేన్సర్ గురించి ఆమెకు అవగాహన లేదు. అందులోనూ ఆమె చాలా ఎమోషనల్ కనుక నేను ఆమెకు చెప్పలేదు. ఇంక ఎవరికి చెప్పాలా అని ఆలోచించాను. ఈ లోపల రొమ్ములోని గడ్డ కరిగిపోవడంతో నేను నిర్లక్ష్యం చేశాను. “

ఆమె క్షణ కాలం ఆగి మళ్లీ చెప్పింది.

94

ఇది జరిగిన మూడు నెలలకు సరిగ్గా గతంలో వచ్చిన చోటే మరో గడ్డ ఇంకొంచెం పెద్ద పరిమాణం లో రావడం గమనించాను. ఈసారి చాలా భయపడిపోయాను . దీనికి తోడు ఇతర లక్షణాలు కూడా వచ్చాయి. ఈదశలో నాకు ముందుగా గుర్తుకు వచ్చింది నన్ను కట్టుకోబోయే వాడు. అతనికి నాభయాలు చెప్పాలా వద్దా? అనిపించింది. అతనికి చెప్పకపోతే అమ్మకు చెప్పాలి. ఆమెకు చెప్పానా …. ఇంకేం లేదు …..ముందు ఆసుపత్రికి పదా అంటుంది. నానా గొడవా అయిపోతుంది. ఆమెకు నా సమస్యలు అర్ధంకావు. కానీ, నేను నా భయాలు నాలోనే ఉంచుకోలేక పోతున్నాను. కచ్చితంగా ఎవరో ఒకరికి చెప్పి వాళ్లసాయం తీసుకోవాలి. ఈ సందర్భంలో ఏదైతే అదవుతుందని కట్టుకోబోయేవాడికే చెప్పాలని నిశ్చయించుకున్నాను. ఇది అతడికి నేను పెట్టే లిట్సస్ టెస్టుగా ఉపయోగిస్తుందని నిశ్చయించుకున్నాను. కానీ, తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నాను. ఈ సమయంలోనే మా ఇద్దరినీ ముంబాయిలో ఒక ప్రాజెక్టు పనిమీద కంపెనీ పంపింది. దాదాపు వారం రోజుల డ్యూటీ. ఈ సమయంలో అతనికి చెప్పాలని నిశ్చయించుకున్నాను.

ఇద్దరం కంపెనీ గెస్టుహౌస్ లో దిగాం. మేం ముంబాయి వెళ్లిన రెండు రోజుల తరువాత సండే వచ్చింది. ఆ రోజు సద్వినియోగం చేయాలని నిశ్చయించుకున్నా.

93

ఇద్దరం జుహూ బీచ్ కి వెళ్లాం. అతను ఆరోజు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. మరో మూడు నెలల్లో అమెరికాకు వెళ్లబోతున్నాం కనుక ముందుగా అమెరికాలో ఎక్కడెక్కడికి ఎప్పుడెప్పుడు వెళ్లాలి అని అతను ఫ్యూచర్ ప్లాన్ అంతా చెప్పేస్తున్నాడు. ఆ దారిలోనే అతడు రొమాంటిక్ మూడ్ లోకి వచ్చి ఫస్ట్ నైట్ ఎక్కడ జరుపుకోవాలని చర్చను తీసుకువచ్చాడు. మా ఇద్దరిదీ ఒక ఒప్పందం ఉంది. మా ఫస్ట్ నైట్ అమెరికాలో చేసుకోవాలని. అందుకని అతడు అమెరికాలోని అన్ని ప్రాంతాలు, బీచ్ లు , రిసార్టులు ఇంటర్నెట్ లో గాలిస్తుండేవాడు. అవి నాకు చెబుతూ ఉండేవాడు. సరిగ్గా అదే మూడ్ లో ఉండగా నేను మెల్లగా నా భయం చెప్పాను. అతను ముందుగా చాలా కేజువల్ గా తీసుకుని దాన్ని కేన్సర్ కాని బిళ్ల లేదా సెగ్గడ్డగా కొట్టిపారేశాడు. అయితే నేను సీరియస్ గా ఉండడం చూసి అతను కూడా డల్లైపోయాడు.

కాసేపు అతనికి ఏంతోచలేదు. అతను మామూలు మనిషి కావడానికి దాదాపు గంటసేపు పట్టింది. నేను ఓపిగ్గా వేచిఉన్నాను.

అతను అన్నమొదటి మాట ఒకటే. —అప్పుడే ఎవరికీ చెప్పవద్దు—”

ఆమె మరోసారి ఆగింది.

తిరిగి కొనసాగించింది.

ఎప్పుడైతే అతను ఈ సలహా ఇచ్చాడో నేను సరైన మార్గంలోనే ఆలోచిస్తున్నాను అనిపించింది. నిజానికి అతను ఆసమయంలో ఇచ్చిన సలహా మంచిదే కానీ రెండు వారాల ఆతరువాత ఇచ్చిన మరో సలహా నేను పాటించకపోవడం నేను జీవితంలో చేసిన అతిపెద్ద తప్పుల్లో ఒకటి.”

ఆమె పశ్చాత్తాపంతో కళ్లు మూసుకుంది.

అతను చాలా ప్రాక్టికల్ గా ఆలోచించి కొంచెం టైం తీసుకుని సమస్యను అన్ని కోణాల నుంచీ ఆలోచించి నిర్ణయం తీసుకుందాం. రెండు వారాల సమయం ఇవ్వగలవా అని అడిగాడు. నేను ఫర్వాలేదు. అన్నాను. అది మొదలు అతను నిజంగా నాకు సరైన జోడు అనిపించుకునే పనులు ఎన్నో చేశాడు.

91

ముందుగా అతను మైండ్ మ్యాప్ వేశాడు.

మాకు ఉన్నభయాలు, ధైర్యాలు, అవకాశాలు, నష్టాలు అన్నీ లిస్ట్ అవుట్ చేశాడు.

మాకున్న భయాల్లో అతను వ్యక్తీకరించిన వాటిల్లో కొన్నిఇవి.

  1. అమెరికా ఛాన్సు పోతుంది.
  2. ఇంట్లో పెద్దలకు తెలిస్తే పెళ్లికి ప్రమాదం వస్తుంది.
  3. ఇవి రెండూ జరిగితే ఇండియాలోనే వైద్యం చేయించుకోవాల్సి వస్తుంది.
  4. పిల్లలు పుట్టడానికి లేట్ అవుతుంది.
  5. కొన్నాళ్లపాటు ఇండియాలోనే ఉండాల్సి రావచ్చు

మాకున్న ధైర్యాలను కూడా లిస్ట్ అవుట్ చేశాడు

  1. ఇద్దరిదీ చిన్నవయసే కావడం ఒక ప్లస్ పాయింట్
  2. పెద్దలకు కేన్సర్ భయాలు చెప్పకుండా పెళ్లి చేసుకోవచ్చు
  3. ఇండియాలో కూడా మంచి డాక్టర్లు ఉన్నారు.
  4. పిల్లలు పుట్టే సమయం వచ్చే వరకూ ఇండియాలోనే ఉందాం

ఈ విధంగా ఎంతో హోం వర్క్ చేసి ఒక పద్ధతి ప్రకారం సమస్యకు పరిష్కారం ఆలోచించాడు.

95

అయితే ఇద్దరం పదిరోజులు గడిచినా ఏ నిర్ణయానికీ రాలేకపోయాం. దానికి సరైన కారణాలు లేకపోలేదు. కేన్సర్ చికిత్స రాత్రికి రాత్రి జరిగిపోయేది కాదు. పైగా రహస్యం గా జరిగిపోయేది కాదు. వాళ్ల ఇంట్లోవాళ్లకు తెలిసితీరుతుంది. కచ్చితంగా, వాళ్లకు అది కోపం తెప్పిస్తుంది. అది మా లాంగ్ టర్మ్ రిలేషన్లు దెబ్బతీస్తుంది. కానీ, చెప్పామంటే పెళ్లి కి అడ్డం పడడం ఖాయం. దీన్ని ఎలా మేనేజ్ చేయాలి అనే ఆలోచన మాకు తెగలేదు.

అంతే కాదు అమెరికా ఆశలు అడుగంటడం ఇద్దరికీ ఇష్టం లేదు. ఒకవేళ కంపెనీ ఇద్దరినీ అమెరికాకు పంపకపోతే తాను వెళ్లి అక్కడ గ్రీన్ కార్డు కోసం ట్రైచేస్తానని ఈ లోపల ఆపరేషన్ అవసరమైతే చేయించుకుని ఆరోగ్యం బాగు చేసుకోమని సూచించాడు. నాకూ ఆ ఆలోచన నచ్చింది. అతను కూడా ఇంకో అడుగు ముందుకు వేసి ముందు నన్ను పెళ్లి చేసుకుని తాను అమెరికాకు వెళతానని ప్రామిస్ చేశాడు. నేనూ సంతోషించాను. మరో మంచి మాట కూడా అన్నాడు. అతను అన్న మాటలు అతని మాటల్లోనే చెబుతాను.”

అంటూ ఆమె ఎమోషనల్ అయింది.

నా చేతులు తన చేతుల్లోకి తీసుకుని, కళ్లలోకి సూటిగా చూస్తూ ఇలా అన్నాడునేను నిన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాను. మాట ఇవ్వడం వేరు పెళ్లి చేసుకోవడం వేరు కాదు. నేను మాట ఇవ్వడంతోనే మన పెళ్లి జరిగిపోయింది. ఇక పెళ్లి జరగడం కేవలం ఒక తంతు మాత్రమే. ఇప్పటికే మనం భార్యాభర్తలం. కేన్సర్ మనల్ని విడదీయలేదు. ఎవరు అడ్డుపడినా ఇది నిశ్చయంగా నేను చెబుతున్నాను. ముందు కేన్సర్ నుంచీ బయటపడడం గురించి ఆలోచిద్దాం.– అన్నాడు. నేను నిజంగా కొండంత అండ దొరికిందని సంతోషించాను.

అయితే, సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. పెళ్లి అయిన తరువాత అతను అమెరికా వెళితే నేను అమ్మా వాళ్ల ఇంట్లో ఉండాలా, లేక అత్తా వాళ్ల ఇంట్లో ఉండాలా లేక ట్రాన్స్ ఫర్ చేయించుకుని ముంబాయి వెళ్లాలా అని ఆలోచించాం. ఏది చేసినా ఇండియాలో ఉంటే అత్తగారి కళ్లబడక తప్పదు, నేను దోషిగా నిల్చోవాల్సి వస్తుందని తేలింది. దీంతో మళ్లీ బయల్దేరిన చోటికే వచ్చాం.

నిజానికి ఇద్దరికీ ఆపరేషన్ ఖర్చు సమస్య లేదు. ఎందుకంటే ఇన్సూరెన్స్ ఉంది.

ఇదిలా ఉండగా మరో సమస్య మాకున్న కలలతీరం అమెరికా. ఒక వేళ నాకు వచ్చింది కేన్సర్ అని నిర్ధారణ అయితే అమెరికా వీసా రావడంలో అప్పట్లో కొన్ని సమస్యలు ఉండేవి. అప్పట్లో అమెరికా బీమా కంపెనీలు ముందుగా ఉన్న రోగాలను పాలసీలో కవర్ చేసేవి కావు. నేడు అదేం లేదు. ఒక సారి అమెరికాలో అడుగుపెడితే చాలు బీమా సంస్థలే అన్నీ చూసుకుంటాయి. కానీ, ఇండియాలో హెచ్ వన్ బి వీసాల కొరత ఉంది. దీనికోసం చాలా పెద్ద ఎత్తున పోటీలు ఉన్నాయి. కంపెనీలు కేన్సర్ ఉన్న పేషంటుకు సింపతీ అయితే చూపించగలవు కానీ, పోటీలో ఉన్న వాళ్లతో పోల్చి చూసి నన్ను వెనక్కు నెట్టే ప్రమాదం ఉంది.

92

అంతేకాదు, ఒక వేళ కంపెనీ ఒప్పుకున్నా నేను కేన్సర్ ఉంది అని నిర్ధారించుకుంటే, వీసా రావడం కూడా ప్రాబ్లం అవుతుంది. నేను చికిత్స కోసం వెళ్లడం లేదని కాన్సిలేట్ లో నిరూపించుకోవాల్సి వస్తుంది. ఒక వేళ అబద్ధం ఆడితే అందుకు దారిసే పరిణామాలకు బాధ్యత వహించాల్సి వస్తుంది. దానికి తోడు అప్పట్లో బీమా కంపెనీలు ఈ కారణం చూపి నాకు పాలసీ అమలు చేయకపోతే, అక్కడ కేన్సర్ వైద్యం చేయించుకోవడం మా తరం కాదు.

అమెరికా వీసా రావాలంటే ఇద్దరం చాలా రిస్క్ బేర్ చేయాల్సి వస్తుంది. ఇందులో ఏ కొంచెం అటూ ఇటైనా మొత్తం ప్లాన్ బెడిసి కొడుతుంది. జీవితంలో మరకపడుతుంది.

ఇవన్నీ ఆలోచించే కొద్దీ మాకు సమస్యకు పరిష్కారం దొరక్కపోగా మరింత జటిలం కావడం గమనించాం. నిజానికి ఇద్దరం ఎమోషనల్ గా మారిపోయి ఏ నిర్ణయం తీసుకోలేని దశకు చేరుకున్నాం. “

అని ఆమె ఆగింది. ఆ సమయంలో నేను మంచినీళ్లు తాగడం చూసి ఆమె నవ్వింది.

నేను కూడా నవ్వి, “మీరు ఎంత జటిలమైన సమస్యలు సృష్టించుకున్నారన్నది స్పష్టంగా చెప్పగలుగుతున్నారు. మీలో ఉన్న ఒక గొప్పదనం ఏమిటంటే మీరు ఎక్కడికక్కడ ఊబిలో కూరుకు పోతున్నామని తెలుసు కానీ, బయటకి వచ్చి ఇలా చేయండి అని చెప్పేవాళ్లు లేకపోడం ఒక కారణం అనిపిస్తోందిఅన్నాను.

ఆమె నా రిమార్క్స్ పాజిటివ్ గానే రిసీవ్ చేసుకుంది.

అయితే మా సమస్యలు ఇవి మాత్రమే కాదు. ఇంకా కొన్ని చిల్లర సమస్యలు కూడా ఉన్నాయి. ఒక వేళ ఇది నిజంగా కేన్సరే అయితే చికిత్స కోసం నాకు ఎంతకాలం కంపెనీ శలవులు ఇస్తుంది? ఉద్యోగంలో ఉంచుతుందా తీసేస్తుందా? ఉద్యోగం లోనుంచీ తీసేస్తే ఇన్సూరెన్స్ మాటేంటి? ఇవన్నీ కూడా ప్రశ్నలే. అయితే వాటికి పెద్దగా ప్రాధాన్యతలేదు. “

చదువుకుని, తెలివి తేటలు ఉండి అనవసరంగా కేన్సర్ కు ఆమె ఏవిధంగా బలైందో అర్ధం అవుతోంది.

కేన్సర్ నిర్ధారణలో ఆమె చేసిన జాప్యానికి కారణాలు తెలుస్తున్నాయి. అయితే పెళ్లి ఎలా తప్పిపోయిందో తెలుసుకోవాలని పించింది. అదే అడిగాను.

మరి మీ పెళ్లి ఎలా తప్పిపోయింది?”

తరువాయి భాగం రేపు ఇదే చోట

https://yeluripati.wordpress.com/

దయచేసి ఈ కింది చిరునామాలోని Facebook group: Cancer -prevention, control and cure లో చేరి మీ మద్దతు తెలుపండి.

https://www.facebook.com/groups/cancerpcc/

ఒక విన్నపం : ఇందులోని పాత్రలు కేవలం కల్పితాలు మాత్రమే. ఇవి ఎవరైనా మరణించినా లేక జీవించిన వ్యక్తులను లేదా సంస్థలను పోలినట్లైతే అది కేవలం యాదృచ్ఛికం మాత్రమే. నా జీవితంలోని కొన్ని యదార్థ ఘటనలకు, సత్యాలకు, అంశాలకు, సమాచారాలకు, నివేదికలకూ నాటకీయత జోడించి, సున్నితమైన కేన్సర్ సమస్యల పట్ల, నిర్లక్ష్యంగా ఉంటున్న సమాజలోపాలను చూపడానికి,  పరిష్కారమార్గాలు కనుగొనడానికి చేస్తున్న అతిపెద్ద ప్రయత్నం. రెండు దశాబ్దాల పాత్రికేయ రంగ అనుభవంతో మూడేళ్లు చేసిన పరిశోధనాత్మక నివేదికకు ధారావాహిక రూపమే ఇది.