Published in Vaartha, Telugu National daily newspaper, Sunday supplement, on 14-Sep-2014.

వార్త తెలుగు జాతీయ దిన పత్రికలో ఆదివారం అనుబంధంలో 14-పెప్టెంబర్-2014 నాడు ప్రచురితం అయింది.

ప్రతీ కొత్తవైద్యుడికీ ఒక కొత్త శ్మశానం పుడుతుందని ఇటలీ సామెత ఉంది. ఇదే రకం సామెత తెలుగులో కూడా ఉంది. నలుగురు రోగులనైనా చంపకపోతే వైద్యుడు కాదని పల్లెల్లో కొత్త వైద్యులను గూర్చి చెప్పుకుంటారు. ఇంతకీ ఇటలీ సామెతను వాడింది ఎవరో కాదు మన భారతీయ యువ వైద్యుడు. పేరు డాక్టర్‌ సందీప్‌ జౌహర్‌. అమెరికాలోని నార్త్‌ షోర్‌ లాంగ్ ఐలాండ్‌ జూవిష్‌ ఆసుపత్రిలో గుండె విభాగంలో సీనియర్‌ వైద్యుడు. ర్లఫ్రెండుకు నివారణ, నియంత్రణ, నయం చేయలేని వ్యాధి రావడంతో భౌతిక శాస్త్రంలో డాక్టరేటు చేస్తున్న సందీప్‌ ప్రపంచానికి ఏదో సేవచేయాలని వైద్యవృత్తిలోకి ప్రవేశించాడు. పట్టుదలతో గుండె విభాగంలో నిపుణుడయ్యాడు. అయ్యాక కానీ తెలిసి రాలేదు. తాను ఎంతటి మురికికూపంలోకి ప్రవేశించాడో. అమెరికాలో ప్రతీ ఏడాది 3 ట్రిలియన్ల డాలర్లు వైద్యరంగంలో ఖర్చు అవుతున్నాయి. కానీ, ఇందులో ఎంత వృథా ఖర్చు ఉందో తెలుసుకుని ఆయనకు వైద్య రంగం మీద ఏవగింపు కలిగింది. ట్రిలియన్‌ అంటే వెయ్యిబిలియన్లు. అంటే లక్షకోట్లు. లక్షకోట్ల డాలర్లు అంటే దాదాపు అరవై లక్షల కోట్ల రూపాయలు అన్నమాట. ఇది భారత దేశ వార్షిక బడ్జెట్ కన్నా కనీసం ఐదు రెట్లు పెద్దది. అమెరికాలో ఇంత డబ్బు వైద్యరంగంలో ఏవిధంగా దుర్వ్యయం అవుతోందో తెలిసి ఆయనకు తన వైద్యరంగం మీద అసహ్యం వేసింది. కత్తి, కత్తెర పట్టాల్సిన వైద్యుడు పెన్ను వదిలి జూడాల మీద ఒక పుస్తకం రాశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. దీని తరువాత ఆ పుస్తకానికి కొనసాగింపుగా డాక్టర్డ్‌ అనే మరో పుస్తకాన్ని ఆయన వెలువరించారు. ఇది తాజాగా ప్రపంపంచంలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశవిదేశాల్లో ఎంతోమంది విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారుకేవలం మందుల షాపు వారికే అర్థమయ్యే మందుల చీటీలోని పైశాచిక భాషలో కాదు, తన దైన శైలిలో డాక్టర్‌ సందీప్‌ సామాన్యుడికి కూడా అర్థమయ్యే భాషలో అనారోగ్యవైద్యామెరికాని ఆవిష్కరిస్తున్నారు. ఆయన రాసిన కొన్ని ఆణిముత్యాలివే.

 

తాజాగా నాకు ఒక ఫిజీషిన్‌ నుంచీ ఫోన్‌ వచ్చింది. ఒక పేషంటుకు కుడి ఊపిరితిత్తికి నిమ్ము చేసిందని అనుమానిస్తున్నామని, ఇది కన్సాలిడేషన్‌ చేయాలని, ఊపిరి తిత్తుల నిపుణుడు బయాప్సీ చేయబోతున్నారని దీనికి గుండె నిపుణులుగా మీ అనుమతి కావాలని ఆ ఫోన్‌ తాత్పర్యం. ఫోన్‌ చేసిన వైద్యుడు నికరాగువా నుంచీ వచ్చారు. తప్పకుండా ఇస్తాను, ఇంతకీ పేషంటు వయస్సు ఎంత అని అడిగానును. 92 ఏళ్లని అమెరికాలో పనిచేస్తున్న నికరాగువా వైద్యుడు బదులిచ్చాడు. చేస్తున్న పని కొనసాగిస్తూనే ఫోన్‌లో యథాలాపంగా మాట్టాడుతున్న నేను, చేస్తున్న పని ఆపి, 92 ఏళ్ల వాడికి గుండె నిమ్ము చేసిందని, బయాప్సీ చేస్తున్నారా? అని అడిగాను. దానికా వైద్యుడు పకపకా నవ్వి మా నికరాగువాలో అయితే ఇటువంటి పేషంట్లను వదిలివేస్తాము. కానీ ఇది అమెరికా అమెరికా మిత్రమా అని జవాబిచ్చాడట.

 

ఇది ఆయన రాసిన డాక్టర్డ్‌ పుస్తకంలోని ఒక పుట.

 

మరో పుటలో ఆయనే ఇలా రాశారు.

ఉబ్బరంగా ఉన్న పొట్టతో ఒక పేషంటు మా ఆసుపత్రిలో  చేరింది. ఆమె దగ్గర వెళ్లాను. డాక్టర్‌ ఈ ఉబ్బరం ఎందుకు వస్తోంది? ఇది కేన్సరా అని ఆమె అడిగింది. ఆమె అప్పటికే ఒక ఆసుపత్రిలో అనేక రకాల పరీక్షలు చేయించుకుని, ఆపరేషన్‌ ముందు కావాల్సిన అనుమతుల కోసం మా దగ్గరకు వచ్చింది. డాక్టర్‌ ఇప్పటికి చాలా పరీక్షలు చేశారు కానీ నాకు వచ్చిన రోగం ఏమిటో ఎవరూ ఏమీ చెప్పడంలేదు. నాకు ఏమైందని ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ అడిగింది.

ఈ సంఘటన రాసిన సందీప్‌ మరో చోట ఈ విధంగా రాస్తారు.

పేషంట్లతో మేము ఎంతసేపు మాట్లాడాము, ఏ పరీక్షలు చేశాము అనేది, బీమా సంస్థలకు అవసరం లేదు. ఎన్ని స్కానింగులు రాశాము, ఎన్ని బయోప్సీలు చేశామో వాళ్లకు కావాలి. మా బుర్రలతో బీమా సంస్థలకు పనిలేదు. కేవలం మేము రాసే మందులు, పరీక్షల మీదే బీమా సంస్థలకు ఆసక్తి ఉంది.ఒక పేషంటుతో అరగంట సేపు మాట్లాడితే మాకు కేవలం 20 డాలర్లు వస్తాయి. అదే, ఒక ఎంఆర్‌ఐ స్కానింగు రాస్తే 900 డాలర్లు వస్తాయి. కనుక, మేం పేషంట్లు చెప్పేది వినాల్సిన అవసరం లేదు. పరీక్షలు రాయడమే మేం చేయాల్సింది.

 

ఆయన రాసిన మరో పుట ఇది.

 

ఒక పేషంటు ఊపిరి సరిగ్గా అందడం లేదు అని ఒక ఆసుపత్రిలో చేరాడు. అతడ్ని తొలిసారి చూసిన వైద్యుడు 15 మంది నిపుణులచేత పరీక్ష చేయించాడు. 12 రోగ నిర్ధారణ పద్ధతుల్లో పరీక్షలు చేశారు. తరువాత డిశార్జి చేశారు. ఇంకా ఏడుగురు నిపుణులు చూడాల్సి ఉందని ఫలానా రోజుల్లో రావాలని చెప్పారు. అయితే, అతను వచ్చిన సమస్య మాత్రం ఇంకా అలాగే మిగిలి ఉంది. అప్పటికి అతనికి 60లక్షల రూపాయలకు పైనే ఖర్చైంది. ఈ తరహా ఇన్వెస్టిగేషన్లు అమెరికాలో చాలా సర్వసాధారణంఆసుపత్రి తమకు ఇచ్చే జీతం తమ సంసారం రెండుపూటలూ తినడానికి కూడా సరిపోదని కుండబద్దలు కొట్టి చెప్పాడు.

 

సందీప్‌ తన రెండు పుస్తకాలలో రాసిన అనారోగ్య వైద్య రంగ లక్షణాలకు ఇవి మచ్చుతునకలు మాత్రమే.

ఎట్టకేలకు ఒక వైద్యుడు, వైద్యరంగ దేహానికి కనీసం మొలతాడు కూడా లేకుండా ఆపరేషన్‌ టేబుల్‌ మీద పడుకోబెట్టాడు, ఏదో శస్త్రచికిత్స చేయాలని. కనీసం ఒకడైనా ఇటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయనకు చేయూతనిస్తే వైద్యవ్యవస్థ బాగుపడుతుందేమో? అని ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా ఆయనకు మద్దతు ఇస్తున్నారు. భారత దేశంలో కేవలం రెండు సార్లే ఒంటిమీద నూలుపోగు కూడా లేకుండా పడుకోబెడతారు. ఇందులో మొదటిది ఆసుపత్రిలోని శస్త్రచికిత్స బల్ల అయితే, రెండోది కాష్ఠాలశయ్య. వైద్యులు ఇప్పటికైనా తమ రంగానికి తమంతట తాముగా శస్త్రచికిత్స చేసుకుని అవినీతి రోగనికి చికిత్సచేసుకోకుంటే, వైద్యరంగం ఎక్కడకు చేరుకుంటుందో వారే నిర్ణయించుకోవాలి! అని ఒక డాట్‌– (డెత్ ఆన్ టేబుల్) పెడదాము

story1