బిడ్డను ప్రపంచంలోకి తొలిసారి ఆహ్వానించేది తల్లి కన్నా ముందు వీరే. వీరి చేతులనుంచే తల్లి దగ్గరికి బిడ్డవెళతాడువీరి చేతుల్లోనే ఒక వ్యక్తి మరణించేది కూడా. అయిన వాళ్లంతా గోడ అవతల ఉంటారు. కానీ, మృత్యువుతో చివరి వరకూ పేషంటుతో పాటుగా పోరాడేది వీరే.

 ముందస్తు హెచ్చరికలు లేకుండా ఐసియూలోని అందరి కర్టెన్లు నర్సులు మూసివేస్తున్నారు. ఐసియు సంప్రదాయాల ప్రకారం అలా నర్సులు కర్టెన్లు మూసివేస్తే తిరిగి వారే వచ్చి తెరిచే వరకూ ఎవరూ కర్టెన్లు తెరవకూడదు. తెరిస్తే బ్రహ్మప్రళయం రాదు, కాకపోతే చూడగూడని దృశ్యం ఏదో చూడాల్సి వస్తుంది.

నా కర్టెన్ కూడా మూసివేయడానికి నర్సు వచ్చింది. కానీ, దాన్ని పూర్తిగా మూసివేయలేదు. ఐసియులో నర్సులు తప్పులు చేయరు. ఆమె కావాలనే అరకొరగా తెరిచి ఉంచింది. ఎందుకంటే ఆమెకు అంతా తెలుసు.

13వ నెంబర్ పేషంట్ ని స్ట్రచర్ మీద తీసుకువెళుతున్నాడు , వార్డుబాయ్.

కొంచెం తెరిచి ఉంచిన కర్టెన్లలో ఆమెను చివరిసారి చూశాను.

ఆమె నాకు ఇచ్చిన మైక్రో ఎస్ డి మొమోరీ కార్డు నా చూపుడు వేలు అంచున ఒక వ్యక్తి జీవితాన్ని భద్రపరిచి పదిలంగా ఉంది.

నిన్న రాత్రి ఆమె నాతో అన్న మాటలు గుర్తుకువస్తున్నాయి.

వార్డు దాటి స్ట్రచర్ వెళ్లిపోగానే, నర్సులు అందరి కర్టెన్లు తెరిచారు.

నా బెడ్ దగ్గర డ్యూటీ చేస్తున్న నర్సు కొంచెం ఆలస్యంగా వచ్చి కర్టెన్ తీసింది.

సెలైన్ బాటిల్ మారుస్తున్న ఆమెను చూశాక నాకు ఒక నిజం తెలిసింది.

డ్యూటీలో ఉండగా నర్సులు కూడా రోదిస్తారు.

కాకపోతే, అది చాలా రహస్యంగా జరుగుతుంది. దాన్ని సామాన్యులు గుర్తుపట్టలేరు. ఫోటోగ్రాఫర్లు లేదా ఫోటోగ్రఫీతో దగ్గరి సంబంధం ఉన్నవారు గుర్తించగలుగుతారు. ఆర్టిస్టులు కూడా గుర్తించగలరు.

నెమ్మదిగా అడిగాను, “ ఏంటి సంగతి?”

ఏం లేదు

చెప్పుకుంటే మనసు భారం తీరుతుంది.”

నర్సులున్నది ఇతరుల బాధలు తీర్చడానికి. ఇతరులను ఓదార్చడానికే మాకు భగవంతుడు భుజాలిచ్చాడు

 

ఆమె చెప్పేది అక్షరాలా నిజం ముఖ్యంగా ఆత్మహత్యా ప్రయత్నం నుంచీ తప్పించుకున్నవాళ్లు , మరణానికి దగ్గరవుతున్నామని భావించేవాళ్లు నర్సుల భూజాల మీదవాలి తమను ఓదార్చే దేవతలుగానే భావిస్తారు. ఎంతో మందికి భుజం కాసిన ఆమెకు మాత్రం కళ్లవెంట నీళ్లు వచ్చినప్పుడు భుజం ఆసరా దొరకదు.

తెల్లటి దుస్తుల మీద కన్నీరు మరకలుగా కనిసిస్తుంది.

కొద్ది సెకండ్ల కాలం నేనేం మాట్లాడలేదు.

ఆ మౌనం చూసి ఆమే చొరవతీసుకుని ఎదురు ప్రశ్నించింది.

ఏం జరిగిందో మీకు తెలియదా?”

నాకేం తెలుసు నేను ఉన్నచోటి నుంచీ కదల్లేదు.”

మీకు తెలిసినా నా చేత ఎందుకు చెప్పించాలనుకుంటున్నారు ? మీ జర్నలిస్టులంతా ఇంతేనా?”

మా కేంతెలుసన్నది కాదు ప్రశ్న, మీరేం చెబుతారన్నది ముఖ్యం.”

చెప్పేందుకు ఏమీలేదు. మాకూ కన్నీళ్లు ఉన్నాయి. అవి కూడా అప్పుడప్పుడు బయటికి వస్తాయి.”

నర్సింగ్ వృత్తిలో ప్రధానమైంది ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడం. ఒక వ్యక్తిని సూదితో గుచ్చడం దగ్గర మొదలు పెడితే శరీరభాగాలు కోసివేయడం వరకూ అనేక వైద్య చికిత్సల్లో వారు పాల్గొంటారు. ఆ సమయంలో అంగవైకల్యం పొందిన పేషంట్లు చాలా ఎమోషనల్ గా ఉంటారు. వారి వారి సంస్కారం బట్టీ ప్రవర్తిస్తూ ఉంటారు. వాటన్నింటి మీదకు ఆమె దృష్టి వెళ్లకూడదు. తన బాధ్యత మీదే ఫోకస్ చేయగలగాలి. ఇది చాలా కష్టమైన పని. కొందరు బాధ తట్టుకోలేక చాలా తీవ్రస్థాయిలో ప్రవర్తిస్తూ ఉంటారు. వాటిని మౌనంగా భరించాలి.

కొన్ని సందర్భాలలో పై సాటి నర్సులు కూడా దారుణంగా తిడుతూ ఉంటారు. అటువంటి సంఘటన నా కళ్ల ఎదురుగానే జరిగింది.

నేను ప్రీ ఆపరేషన్ యూనిట్ లో ఉండగా ఇది జరిగింది.

ఆపరేషన్ ముందు ప్రతీ పేషంటునీ చాలా జాగ్రత్తగా సిద్ధం చేస్తారు. అది సాధారణంగా ముందు రోజు నుంచే ప్రారంభం అవుతుంది. ఉదయాన్నే పొట్ట ఖాళీ అవడం దగ్గర నుంచీ మొదలు పెడితే అనవసరమైన వెంట్రుకలు తొలగించడం వరకూ అనేక అంశాలు ఉంటాయి. వీటిలో చాలా అంశాలు దిగువ స్థాయి ఉద్యోగులు చేస్తారు.

ఒక పేషంటును అంతా తయారు చేసి థియేటర్ కి పంపింది. ఒక నర్సు. ఆ పేషంటు క్షణాల్లో తిరిగి వచ్చింది.

కారణం చాలా సింపుల్, పేషంటు గోళ్లు కత్తిరించలేదు.

నిజానికి అది నర్సుల డ్యూటీ కాదు. కానీ అది థియేటర్ డిసిప్లీన్ లో చాలా ముఖ్యమైంది.

పేషంటుకు గోళ్లు కత్తిరించేవరకూ మొత్తం ఆపరేషన్ ఆగిపోయింది. దీంతో ఆమెను థియేటర్ సూపర్ వైజరీ నర్సు తీవ్రంగానే తిట్టింది. నాకు తెలుసు ఆ రాత్రి ఆ నర్సు నిద్రపోయి ఉండదు. వార్డులో అందరి ముందు, తన సహ ఉద్యోగుల ముందు తిట్లు తినడం ఆమెకు అత్యంత బాధాకరమైన అంశమే. కానీ ఆపరేషన్ ఆగిపోవడం ఇంకా పెద్ద విషయం.

ఇటువంటి క్షణాలు ఎన్నో వాళ్ల జీవితంలో ఉంటాయి.

మరి కొన్ని సార్లు ఎంత జాగ్రత్తగా ఉన్నా దురదృష్టకర పరిస్థితుల్లో ఇంజక్షన్ సూదుల వంటివి ఆమెకు గుచ్చుకుంటాయి. అది ఆమెకు ప్రత్యక్ష నరకం సృష్టిస్తుంది. కేన్సర్ వార్డు లలో పనిచేసే నర్సులు వెంటనే దానికి ఫస్ట్ ఎయిడ్ చేయించుకోవాల్సి ఉంటుంది.

డ్యూటీ మీద ఫోకస్ చేయడం మాకు వృత్తి నేర్పే మొదటి పాఠం. కానీ ఏ మాత్రం మేం అజాగ్రత్తగా ఉన్నా మా మనసు అగ్నిపర్వతంలా పెల్లుబుకుతుందిఆమె చెప్పింది.”కేన్సర్ తో రొమ్ము కోల్పోయి అంగవైకల్యం పొందిన మహిళ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. సాటి మహిళగా మేము కూడా చాలా సింపతీతో ఉంటాం. ఎంతగా వృత్తికి కట్టుబడి ఉన్నా ఇటువంటివి తప్పకుండా మమల్ని కదిలిస్తాయి”

 

కొంత మంది పేషంట్లు నర్సులను దేవతలుగా కొలిచి అత్యంత సన్నిహితమైన వ్యక్తిగా భావిస్తారు. తమ బాధలు వారితో చెప్పుకుంటారు. వాటిలో ఎన్నో హృదయవిదారకమైన విషయాలు ఉంటాయి. వాటిని గుర్తుంచుకుంటే ఆమెకు జీవితం మీద విరక్తి కలుగుతుంది. అటువంటి భావోద్వేగ విషయాలను మనసులోకి తీసుకుపోకూడదు.

అత్త మీద కోడలు చెబుతుంది. కోడలు మీద అత్త చెబుతుంది. భార్య మీద భర్త, భర్తమీద భార్య మనసులో దాగి ఉన్న రహస్యాలు వారికి చెప్పుకుంటారు.

అవి విన్నప్పుడు ఎక్కడో ఒక చోట ఆమె హృదయం కలుక్కుమంటుంది. ఆ సమయంలో ఆమె బరస్ట్ అవుతుంది. ఆ సందర్భాన్ని ఎలా మేనేజ్ చేయాలో అనుభవజ్ఞులైన నర్సులు పాఠాలుగా తమ జూనియర్లకు చెబుతారు. కొత్తగా విధుల్లో చేరిన నర్సులు ముందుగా వీటిని అధిగమించాల్సి ఉంటుంది. పేషంటు చెప్పేది వినకపోతే ఒక తప్పు వింటే మరోతప్పు. చాలా సున్నితమైన సందర్భం అది.

కనుకనే నేడు కొందరు తమ పాఠాలు మార్పుచేసి పేషంటుకు వ్యాధిని దూరం చేయడం పై మాత్రమే కాక, పేషంటుపై నే ఎక్కువ శ్రద్ధ పెట్టాలని బోధిస్తున్నారు.

పేషంట్ల కళ్ల వెంట జాలువారే కన్నీళ్లు ఎన్ని వచ్చినా దూదితో సుతారంగా తుడుస్తారు. కానీ, వారి కంటి వెంట వచ్చే కన్నీరు ఇతరులకు కనిపించరాదు. నీళ్లలోని చేప ఏడిస్తే ఎవరికి తెలుస్తుంది?

ఒక వేళ అదే జరిగితే ఆ కన్నీళ్లు ఆమె వృత్తికే ఎసరు తెస్తాయి. ఆ నర్సు చాలా ఎమోషనల్ అని ముద్రపడితే కెరీర్ లో బ్యాడ్ రిమార్క్ పడినట్లే. కనుకనే గుండె ఎసరులా మరుగుతున్నా పైకి పొంగనీయరు. కొన్ని సందర్భాల్లో ఆమె కన్నీరు పేషంట్లలో బేలతనాన్ని మరింత పెంచుతుంది.. అది పేషంట్లకు మంచిది కాదు.

ఎంత కాదనుకున్నా ఏదో ఒక కోణంలో నుంచీ పేషంటు మా హృదయాన్ని గాయపరుస్తారు. తండ్రిగానో, తల్లిగానో, చెల్లిగానో లేదా మా వ్యక్తిగత జీవితంతో సంబంధం ఉన్న ఉద్యోగాలు చేస్తూనో మాకు తెలియకుండా మాకు దగ్గరైపోతారు. అది మాకున్న మెంటల్ బేలన్స్ పోగొడుతుంది. వాళ్లకు ఏదైనా జరగకూడనికి జరిగితే మేం కూడా బాధపడతాం. డ్యూటీలో కన్నీళ్లు పెట్టడం మీద ఒకప్పుడు చాలా కఠినంగా ఉండేవారు ఇప్పుడు కొంత రిలాక్స్ చేస్తున్నారు.” అని కాసేపు ఆగింది.

కానీ, వుయ్ షుడ్ వైప్ ఆఫ్ అవర్ టియర్స్ విత్ ఓన్ హాండ్స్

ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోవడానికి భాష మార్చడం ఒక పద్ధతి. ఆమే కొనసాగించింది.

 

 

 

ఎంత వద్దనుకున్నా మాలో ఎమోషన్లు ఎగసి పడుతూనే ఉంటాయి. కాన్పుపోసి మొదటి సారి బిడ్డ ఏడుపు విన్నప్పుడు అప్పటి వరకూ మేము పడ్డ కష్టం మరిచిపోయి సంతోషంతో నిండిపోతాం. తల్లీ బిడ్డా క్షేమంగా ఉంటే సంతోషం పెరుగుతుంది, లేదా విచారం కూడా అదే స్థాయిలో ఉంటుంది.”

బిడ్డను ప్రపంచంలోకి తొలిసారి ఆహ్వానించేది తల్లి కన్నా ముందు వీరే. వీరి చేతులనుంచే తల్లి దగ్గరికి బిడ్డవెళతాడు.

వీరి చేతుల్లోనే ఒక వ్యక్తి మరణించేది కూడా. అయిన వాళ్లంతా గోడ అవతల ఉంటారు. కానీ, మృత్యువుతో చివరి వరకూ పేషంటుతో పాటుగా పోరాడేది వీరే.

 

అప్రయత్నంగా నా వేలిమీద ఉన్న మైక్రో ఎస్ డి కార్డు వంక తదేకంగా చూశాను.

ఎమోషనల్ స్ర్టెస్ ఎక్కువగా ఉన్నప్పుడు హాస్యాన్ని ఆశ్రయించమని మాకు నేర్పుతారు. అందుకే నర్సింగ్ డెస్క్ దగ్గర అప్పుడప్పుడు మీకు నవ్వులు వినిపిస్తూ ఉంటాయి. అయితే, దీనికి కూడా చాలా పరిమితులు ఉంటాయి. మేం ఎక్కువగా నవ్వితే కొంతమంది పేషంట్లు తమ గురించే చెప్పుకుని నవ్వుకుంటున్నారనో, లేక పోతే తాము బాధపడుతుంటే వీళ్ల నవ్వులేమిటనో విసుక్కుంటారు. కనుక నవ్వు కూడా మాకు ఔషథమే. చాలా జాగ్రత్తగా వాడుకోవాలి.”

ఆమె చెప్పేవన్నీ కొత్త విషయాలే.

నిజానికి రోదించడం మంచి మెడిసిన్ ఇది మనసులోపలి స్ట్రెస్ ను రిలీజ్ చేస్తుంది.” ఆమె వేగంగా చెబుతూనే ఆపరేషన్ కుట్లకు డ్రెస్సింగ్ చేస్తోంది.

కొ్న్ని సందర్భాల్లో పేషంట్లు తమకున్న బాధలు ముందుగా మాతోనే చెబుతారు. ఎందుకంటే, పేషంటు దగ్గర 24 గంటలూ మేమే ఉంటాం కనుక. కానీ, మాకు తెలుసు వారి బాధలు తీర్చే శక్తి ఉన్న మందులు వైద్యశాస్ర్తంలో లేవని. అటువంటి సమయాల్లో మేం నిస్సహాయంగా మారిపోతాం. నీరసం వస్తుంది. ఉత్సాహం ఉండదు.”

కాసేపు ఆగి బలంగా ఊపిరి పీల్చుకుంది.

అంతెందుకు, అమెరికాలో కూడా పేషంట్ల బంధువులు తాగొచ్చి గొడవ చేస్తారు. వారిని మృదువుగా పంపించి వేయాలి. విదేశాల్లో జరిగిన ఒక పరిశోధన జరిగింది ఇందులో పేషంట్లకు ఉత్తమస్థాయి వైద్యం అందిస్తూ సందర్భాలను బట్టీ భావోద్వేగంతో నర్సులు ఉండడం వలన లాభం ఉంటుందని కనుగొన్నారు. ”

డ్రెస్సింగు చేయడం అయిపోయింది. తన ట్రే సద్దుకుని వెళ్లిపోతూ నాకేసి సూటిగా చూస్తూ అన్నది.

mourning1

అవును నేను 13వ నెంబర్ పేషంటుకు ఎమోషనల్ గా దగ్గరయ్యాను. బహుశా నా జీవితాంతం ఆమెను మర్చిపోలేనేమో? ఇదంతా మీ వల్లే వచ్చింది“

వెళిపోతూ నన్ను బ్లేం చేసి వెళ్లిపోయింది.

నాలో నేను నవ్వుకున్నాను. పెరుగున్న స్ర్టెస్ తగ్గించుకోవడానికి..

తరువాయి భాగం రేపు ఇదే చోట

https://yeluripati.wordpress.com/

దయచేసి ఈ కింది చిరునామాలోని Facebook group: Cancer -prevention, control and cure లో చేరి మీ మద్దతు తెలుపండి.

https://www.facebook.com/groups/cancerpcc/

ఒక విన్నపం : ఇందులోని పాత్రలు కేవలం కల్పితాలు మాత్రమే. ఇవి ఎవరైనా మరణించినా లేక జీవించిన వ్యక్తులను లేదా సంస్థలను పోలినట్లైతే అది కేవలం యాదృచ్ఛికం మాత్రమే. నా జీవితంలోని కొన్ని యదార్థ ఘటనలకు, సత్యాలకు, అంశాలకు నాటకీయత జోడించి, సున్నితమైన కేన్సర్ సమస్యల పట్ల, నిర్లక్ష్యంగా ఉంటున్న సమాజలోపాలను చూపడానికి,  పరిష్కారమార్గాలు కనుగొనడానికి చేస్తున్న అతిపెద్ద ప్రయత్నం. రెండు దశాబ్దాల పాత్రికేయ రంగ అనుభవంతో మూడేళ్లు చేసిన పరిశోధనాత్మక నివేదికకు ధారావాహిక రూపమే ఇది.