కేన్సర్ చికిత్సకు వచ్చే మహిళలు పైట తీసి తన రొమ్మును చూపించేసరికి అసోం వైద్యులకు కూడా వాంతులు వస్తున్నాయట. రొమ్ముకు వచ్చిన కంతి ముదిరి బయటకు వచ్చి, పుండై, పురుగులు పట్టి, వాసన వస్తూ ఉంటుందట. ఇదీ గిరిజన భారత నారి పరిస్థితి.

అతి తేలిగ్గా కనుక్కుని నివారించదగిన కేన్సర్ లలో రొమ్ము కేన్సర్ మొదటిది. కానీ, దీని వల్ల ప్రపంచంలో కెల్లా భారత దేశంలోనే అతిఎక్కువ మరణాలు సంభవిస్తుండడం ఆడదాని దురవస్థకు సంకేతం.

 

2012లో చైనాలో 47,984 మంది అమెరికాలో కేవలం 43,909 మంది రొమ్ము కేన్సర్ కారణంగా చనిపోగా, భారత దేశంలో ఏకంగా 70,218 మంది మరణించారని గణాంకాలు చెబుతున్నాయి. లెక్కకు రాని మరణాలు ఎన్నో ఉన్నాయన్నది అనధికార సత్యం. అంటే మన ఆడవారు ఎంతటి ప్రమాదంలో ఉన్నారో ఘంటికలను మ్రోగించి ఈ గణాంకాలు చెబుతున్నాయి.

girijana

అసోంలోని కేన్సర్ వైద్యులకు అన్నం తినడం కష్టం అవుతోందట అని ఒక మిత్రుడు కొంచెం అతిశయోక్తిగా చెప్పిన నిజాలు గుర్తుకు వచ్చాయి. అసోం గిరిజన, నిరక్షరాస్య మహిళల దీన గాథ ఆ మిత్రుడు చెప్పుకొచ్చాడు. కేన్సర్ చికిత్సకు వచ్చే మహిళలు పైట తీసి తన రొమ్మును చూపించేసరికి అసోం వైద్యులకు కూడా వాంతులు వస్తున్నాయట. రొమ్ముకు వచ్చిన కంతి ముదిరి బయటకు వచ్చి, పుండై, పురుగులు పట్టి, వాసన కూడా వస్తూ ఉంటాయట. ఇదీ గిరిజన భారత నారి పరిస్థితి అంటూ ఆ మిత్రుడు చెప్పాడు. కొన్ని ఫోటోలు కూడా తన దగ్గర ఉన్నాయని కానీ, వాటిని చూడడానికి గుండె ధైర్యం కావాలని అన్నాడు. నేను చూడని ఫోటోలు కాదు కాబట్టీ వాటిని నేను చూడ గలిగాను. అదే సామాన్యులైతే తట్టుకోలేరు.

అందాన్నీ చూడలేరు, వికారాన్నీ చూడలేరు. చాలా మంది అసలు సత్యాన్నే చూడలేరు. సత్యం చూడ గలిగిన వారు అన్నింటినీ చూడ గలుగుతారు. మనసులో ఏ వికారం కలగదు. ఇది ప్రపంచ నాగరికత చూసినవారికి త్వరగా అభ్యాసం అవుతుంది.

మిగిలినవాళ్లకు గుండె ధైర్యంలేదు. నిజాన్ని ఒప్పుకునే ధైర్యం కూడా లేదు.

పదిమందిలో, కనీసం ధైర్యంగా, అందాన్ని చూడడం అలవాటు చేసుకుంటే మెల్లమెల్లగా నిజాన్ని చూడడం అభ్యాసం అవుతుంది. నిజమైన అందాన్ని చూసిన వాళ్లకు ప్రతి దాంట్లోనూ అందం కనిపిస్తుంది.

 

కొందరు పాత్రికేయులు, పోలీసులు, వైద్యులు, న్యాయవాదులు రోజూ నిజాలు చూస్తున్నారు.

మిగిలిన వాళ్లు అబద్ధంలో బతుకుతున్నారు.

ఎందుకంటే, నిజం చూస్తే, మృగంగా జీవించడం కష్టం.

నా మిత్రుడు చూపిన ఫోటోలు చూసి ఉంటే, వాడల్లో, పల్లెల్లో, గూడేల్లో అయిన వారి మధ్యనే ఆమె ఉందా? మృగాల మధ్య బతుకుతోందా? అని జీవితం మీద విరక్తిపుడుతుంది. ఇటువంటి పేషంట్లు చికిత్స కోసం వచ్చినప్పుడు వైద్యులు చేతికి వచ్చిన నాలుగు మందు బిళ్లలు ఇచ్చి పంపించి వేస్తారు. వారిని కనీసం కేన్సర్ వల్ల చచ్చిన వారి జాబితాలో కూడా రాయరు. ఎందుకంటే, ఏ అడవి తల్లో వారిని ఒడిలోకి చేర్చుకుంటుంది కనుక వారి లెక్కలు బయటకు వచ్చే అవకాశమేలేదు.

నిన్నటి వరకూ ప్రతి ఏడాదికి 5 లక్షల మంది మన దేశంలో కేన్సర్ వలన చనిపోతుండగా, 2015 నుంచీ 7 లక్షల మంది కేన్సర్ వల్ల చనిపోబోతున్నారు. దేశంలో కేన్సర్ ఎంతమందికి ఉందో కచ్చితంగా తెలియదు కానీ, 2025 నాటికి , అంటే మరో పదేళ్లలో కేన్సర్ రోగులు 5 రెట్లు పెరగనున్నారు. ఈ గణాంకాలు కాకిలెక్కలు కాదు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు.

 

ఇలా చచ్చిపోయే వారిలో అధిక శాతం మహిళలే ఉండబోతున్నారు. క్షీరదాలైన మానవజాతికి జన్మనిస్తున్న ఆడవారు రొమ్ము, గర్భాశయం కేన్సర్లతో మరణించనున్నారు.

కేవలం 30 ఏళ్లకే ఈ భయంకర రోగాలు వారిని చుట్టు ముట్టబోతున్నాయి. మట్టుపెట్టబోతున్నాయి.

మహాదారుణమైన నిజం అందరూ తెలుసుకుని తీరాల్సింది ఒకటుంది. కేన్సర్ ఉంది అని తెలిసిన 100 మందిలో 70 మంది ఏడాది తిరిగే లోపలే మరణిస్తున్నారు. అంటే, వీళ్లంతా వ్యాధి బాగా ముదిరిన తరువాత వైద్యుడి దగ్గరి వెళుతున్నారన్న మాట.

 

అమెరికాలో కేన్సర్ వచ్చిన వాళ్లు కూడా 70 ఏళ్ల వయసు తరువాతే చనిపోతుంటే, భారత దేశంలో కేవలం 30 ఏళ్ల లోపలి వయసు వాళ్లే కేన్సర్ వల్ల చనిపోతున్నారు.

ఆసుపత్రిలో కదల్లేని స్థితిలో ఉన్నా నా కళ్ల ముందు రోగభారతం కరాళ నృత్యం చేస్తోంది.

 

నా పక్క బెడ్ మీద ఆమెకు తాను ఎంతటి అదృష్టవంతురాలో తనకే తెలియదు. ఏం పాపం చేశామని ఈ రోగం వచ్చిందిరా భగవంతుడా అంటూ అక్షరాలా మూగగా మరణిస్తున్నవారితో పోలిస్తే తనది ఎంతటి అదృష్టమో ఆమెకు తెలియదు.

 

నా ఆలోచనల్లో నేను ఉండగా మధ్యాహ్నం మందులు వేయడానికి నర్సు వచ్చింది.

కల్వంలో మందులు నూరుకొచ్చింది. ఆ పొడిని ముక్కులో నుంచీ పొట్టలోకి పెట్టిన గొట్టం ద్వారా ఎక్కించడానికి బ్యాగులో నీళ్లుపోసి, మందుల పొడి వేసింది. అది అడుగుకు చేరిపోయి గొట్టానికి అడ్డు పడకుండా కదుపుతూ, గాలి బుడగలు లేకుండా జాగ్రత్తగా మందుల పొడి మొత్తం లోపలకు వెళ్లేలా చేసింది. తరువాత బ్యాగు శుభ్రం చేసింది.

అదంతా చూశాక నాకు నవ్వు వచ్చింది. ఎందుకు నవ్వుతున్నారు అని మలయాళం యాసలో అడిగింది.

చిన్నప్పుడు జ్వరం వచ్చినప్పుడు మా అమ్మానాన్నా నా చేత మాత్రలు మింగించడానికి ఎంత కష్టపడేవారో గుర్తొచ్చింది. మీరు చేదు విషాలు కూడా ఇంత తేలిగ్గా వేస్తుండడం చూసి నవ్వు వచ్చింది అన్నాను.

చిన్నపిల్లల వార్డులో ఉంటే మాకు ఇది సమస్య కాదు ఒక యుద్ధం.” అంటూ నవ్వుతూ వెళ్లిపోయింది.

 

మళ్లీ నా ఆలోచనల్లోకి నేను వచ్చాను.

పాక్షికంగా రొమ్ము కోల్పోయిన ఆమె బయట వాళ్లకు తన ముఖం ఎలా చూపాలా అని మథనపడుతోంది.

ఆమె సమస్యకు పరిష్కారం నాకు వెంటనే స్ఫురించింది.

లంచ్ టైం అవుతుండగా నర్సుల డెస్క్ లో వేగం పెరుగుతుంది. పేషంట్లకు వేయాల్సిన మందులు, చేయాల్సిన పరీక్షలతో బిజీగా ఉంటారు. బిపి, సుగర్ పరీక్షించి ఎవరికైనా ఇన్సులిన్ ఇవ్వాల్సి ఉంటే ఇస్తారు. కొంతమందికి జ్వరాలు పరీక్షిస్తారు. మధ్యాహ్నం డూటీకి రాబోయే నర్సులకు డ్యూటీ అప్పగించడానికి అన్నీ సిద్ధం చేస్తారు. ఏ ఏ పేషంటుకు ఏ ఏ మందులు వేశారు, ఇంకా ఏ ఏ మందులు వేయాలో వివరంగా కేస్ షీటులో రాస్తారు. అవసరమైన మందులు తెప్పించి, బిల్లింగులు అప్ డేట్ చేస్తారు.

కాసేపటికి మళ్లీ నా దగ్గరకు వచ్చిన స్టాఫ్ నర్సు మధ్యాహ్నం ఫీడింగుని గొట్టం ద్వారా కడుపులోకి సరాసరి దిగుమతి చేసింది.

వెళుతూ వెళుతూ కాసేపు అటూ ఇటూ నడుస్తుండండి అని మలయాళ యాస ఉన్న ఇంగ్లీషులో చెప్పి వెళ్లిపోయింది.

రోజుల తరబడి నడవకపోతే అరికాళ్లలో రక్తం గడ్డకడుతుంది. అది మరిన్ని ప్రమాదాలకు దారితీస్తుంది. గడ్డ కట్టిన రక్తం నరాల్లో ప్రవహించి మెదడును చేరే ప్రమాదం కూడా ఉంటుంది. కనుక, పేషంట్లను ఐసీయు వార్డులోనే అటూ ఇటూ నడవమని లేదా నడిపించమని నర్సులు ఆదేశిస్తారు.

నర్సు నన్ను వార్డులో అటూ ఇటూ నడవమని చెప్పాక నడవడానికి సిద్ధమై వెళ్లాను.

ముక్కు నుంచీ పొట్టలోకి గొట్టానికి ఒక సంచీ.

నెక్ డ్రెయిన్ కోసం ఒక సంచీ.

చెస్టు డ్రెయిన్ కోసం మరోసంచీ.

మరో సంచీ నుంచీ చేతిలోని నరాల ద్వారా ఎక్కుతున్న సెలైన్ సంచీ.

బోనస్ గా గొట్టం ద్వారా మూత్ర విసర్జనకు మరో సంచీ.

కాకపోతే ఒక మినహాయింపు ఇచ్చారు. సెలైన్ పంపు కట్టేసి గొట్టం పీకేసి నడక అయిపోయాక మళ్లీ తగిలించేవారు. ముక్కు సంచీ అవసరమైనప్పుడు తగిలించి, వెంటనే తీసి సెలైన్ స్టాండ్ కి తగిలించి ఉంచేవారు. యుద్దానంతర శస్ర్తాల్లా.

నేను నడవాలంటే కనీసం మూడు సంచీలు మోసుకుంటూ వార్డులో అటూ ఇటూ నడవాలి.

దాదాపు అరవై గజాల వార్డుది. అదే నాకు సాగర లంఘనం అయిపోయింది.

రెండు రౌండ్లు కొట్టేసరికి నడక అలవాటయింది.

మూడో రౌండు కొడుతుండగా నా పక్క బెడ్ అమ్మాయిని చూశాను.

ఆమె వయసు 30 లోపే ఉంటుంది.

చాలా అందంగా ఉంది.

ఆమె ఏడుస్తూనే నాముఖం చూసింది.

నన్ను చూడగానే ఒక్కసారి తనను తాను మరిచిపోయింది.

ఆమె నన్ను చూస్తోందని నేను ఆగాను.

ఆమె నన్ను తదేకంగా చూసి తీసేసిన తన రొమ్ము స్థానాన్ని తడుముకుంది.

నేను ఆమె సాధారణ స్థితికి వచ్చేవరకూ ఆగాను.

ఆమె నా కళ్లలోకే సూటిగా చూస్తోంది.

ఆమె మొదటి సారి దృష్టి మరల్చి, మళ్లీ రెండోసారి నాముఖంలోకి చూడగానే నేను నవ్వాను.

ఆమె కు ముందుగా ఏమీ అర్థం కాలేదు.

ఆ తరువాత ఆమె కూడా నవ్వింది.

అది కేవలం ప్రత్యుత్తరం కాదు.

కొన్ని నెలల తరువాత కూతురు ముఖంలో నవ్వుచూసిన తల్లి ఆశ్చర్యపోయింది.

బెడ్ ఎదురుగా నిలుచున్న నన్ను చూసింది.

ఉబ్బిపోయి పరమ వికారంగా ఉన్న నా ముఖం చూసింది.

Photo0446

మళ్లీ కూతురు ముఖంలోని నవ్వు చూసింది.

ఆమె తన గుండె తడుముకోవడం చూసి, కుర్చీ లో నుంచీ లేచి తన చేత్తో ఆమె గుండెల మీద రాయబోయింది. కూతురు అవసరం లేదని వారించింది.

కాసేపు జరుగుతోంది ఏమిటో తెలియక, చివరిగా పలకరింపుగా నన్నుచూసి ఆమె తల్లి కూడా నవ్వింది.

నేనూ నవ్వుతూనే బదులిచ్చి, నా మధ్యాహ్నం వాక్ ఐసీయూలో కొనసాగించాను.

అది మొదలు ఆమె ఏడ్చినట్లు లేదు.

ఆమె ముఖంలోనే కాదు, ఆమె తల్లి ముఖంలో కూడా తెరపి స్పష్టంగా కనిపించింది.

మర్నాడే ఆమె అత్తగారు, ఆడపడుచులు, వదినలు ఆసుపత్రికి వచ్చి తనను చూడడానికి ఒప్పుకుంది.

ఆమర్నాడు మగవారు వచ్చిచూశారు.

అది మొదలు ఆమె తల్లి నన్ను అత్యంత ఆత్మీయుడిని చూసినట్లు చూసేది.

అయితే, ఏనాడు నా బెడ్ దగ్గరకు వచ్చేది కాదు. నా గురించి వివరాలు అడిగేది కాదు. నా వస్తువులు కానీ, నన్ను కానీ తాకేది కాదు. నాతోనే కాదు నాకు తెలిసి ఆమె వార్డులో ఎవరితోనూ ఈ విధంగా ప్రవర్తించలేదు. ఇది గమనించిన నాకు ఆసుపత్రిలో ఎలా ప్రవర్తించాలో బాగా తెలిసినవారని అర్థం అయింది.

ఇంటెన్సివ్ కేర్ లోని పేషంట్లు చాలా సున్నితంగా ఉంటారు. వీళ్లకు ఇన్ఫెక్షన్లు త్వరగా వస్తాయి. రోజుల తరబడి స్నానం చేసే వీలుండదు. శరీరాన్ని శుభ్రపరుచుకునే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. కనుక, పక్క బెడ్ వారిని కూడా తాకడం లేదా వారిచ్చినవి తినడం తాగడం వంటివి చేయకూడదు. ఎవరి వస్తువులు వారివే. అలాగే, రోగ వివరాలు చికిత్సవిధానాలు, లోపాలు ఐసీయులో చర్చించకూడదు. ఈ తప్పులేమీ ఆమె చేయలేదు. కేవలం చూపుతోనే ఆప్యాయత పలికించేది.

వాళ్లను చూసి నేను ఆసుపత్రి మేనర్సు చాలా నేర్చుకున్నాను.

డిశ్చార్జి రోజున ఆమె కుమార్తె వెళ్లిపోతూ పరిపూర్ణ ఆత్మవిశ్వాసంతో నన్ను చూసింది.

తన పిల్లలతో ఏదో చెప్పింది, ఆమె పిల్లలు నాకు టాటా చెప్పారు.

ఆమె తల్లి నాకు నమస్కారం చేసింది.

నేనూ ప్రతి నమస్కారం చేశాను.

***** ****** ***** ***** ******* ******* ******* ******* ******

కేన్సర్ మూగబోయిన మనసు – 1 – ఏలూరిపాటి

ముందస్తు హెచ్చరికలు లేకుండా ఐసియూలోని అందరి కర్టెన్లు నర్సులు మూసివేస్తున్నారు. ఐసియు సంప్రదాయాల ప్రకారం అలా నర్సులు కర్టెన్లు మూసివేస్తే తిరిగి వారే వచ్చి తెరిచే వరకూ ఎవరూ కర్టెన్లు తెరవకూడదు. తెరిస్తే బ్రహ్మప్రళయం రాదు, కాకపోతే చూడగూడని దృశ్యం ఏదో చూడాల్సి వస్తుంది.

 

 

నా కర్టెన్ కూడా మూసివేయడానికి నర్సు వచ్చింది. కానీ, దాన్ని పూర్తిగా మూసివేయలేదు. ఐసియులో నర్సులు తప్పులు చేయరు. ఆమె కావాలనే అరకొరగా తెరిచి ఉంచింది. ఎందుకంటే ఆమెకు అంతా తెలుసు.

13వ నెంబర్ పేషంట్ ని స్ట్రచర్ మీద తీసుకువెళుతున్నాడు , వార్డుబాయ్.

కొంచెం తెరిచి ఉంచిన కర్టెన్లలో ఆమెను చివరిసారి చూశాను.

ఆమె నాకు ఇచ్చిన మైక్రో ఎస్ డి మొమోరీ కార్డు నా చూపుడు వేలు అంచున ఒక వ్యక్తి జీవితాన్ని భద్రపరిచి పదిలంగా ఉంది.

నిన్న రాత్రి ఆమె నాతో అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి.

వార్డు దాటి స్ట్రచర్ వెళ్లిపోగానే, నర్సులు అందరి కర్టెన్లు తెరిచారు.

నా బెడ్ దగ్గర డ్యూటీ చేస్తున్న నర్సు కొంచెం ఆలస్యంగా వచ్చి కర్టెన్ తీసింది.

సెలైన్ బాటిల్ మారుస్తున్న ఆమెను చూశాక నాకు ఒక నిజం తెలిసింది.

డ్యూటీలో ఉండగా నర్సులు కూడా రోదిస్తారు.

తరువాయి భాగం రేపు ఇదే చోట

https://yeluripati.wordpress.com/

దయచేసి ఈ కింది చిరునామాలోని Facebook group: Cancer -prevention, control and cure లో చేరి మీ మద్దతు తెలుపండి.

https://www.facebook.com/groups/cancerpcc/

ఒక విన్నపం : ఇందులోని పాత్రలు కేవలం కల్పితాలు మాత్రమే. ఇవి ఎవరైనా మరణించినా లేక జీవించిన వ్యక్తులను లేదా సంస్థలను పోలినట్లైతే అది కేవలం యాదృచ్ఛికం మాత్రమే. నా జీవితంలోని కొన్ని యదార్థ ఘటనలకు, సత్యాలకు, అంశాలకు నాటకీయత జోడించి, సున్నితమైన కేన్సర్ సమస్యల పట్ల, నిర్లక్ష్యంగా ఉంటున్న సమాజలోపాలను చూపడానికి,  పరిష్కారమార్గాలు కనుగొనడానికి చేస్తున్న అతిపెద్ద ప్రయత్నం. రెండు దశాబ్దాల పాత్రికేయ రంగ అనుభవంతో మూడేళ్లు చేసిన పరిశోధనాత్మక నివేదికకు ధారావాహిక రూపమే ఇది.

ప్రకటనలు