ప్రపంచాన్ని జయించి చిన్నారుల చేత కూడా వరుస నవలలు చదివించిన హారీపొట్టర్ రచయిత్రి జెకె రోలింగ్ ఒకప్పుడు తీవ్ర మానసిక వేదనకు లోనయిందట. ఆత్మహత్యకు కూడా ప్రయత్నించిందట. అటువంటి దశలో తాను మానసిక వైద్యం పొందానని దాని అనంతరమే అద్భుతమైన నవలలు రాశానని బాహాటంగా చెప్పుకుంది.

****** ***** ****** ****** * *** ******** **** * * * * * * **  ******* **** ***

కేన్సర్ వల్ల రాబోయే మరణానికి భయపడి రొమ్ము తొలగించుకోవడానికి ఇష్టపడడం వేరు, రొమ్ము తొగించిన తరువాత వచ్చిన శారీరక మార్పు అంగీకరించడం వేరు. ఒకటి ప్రాణ భయం అయితే, మరొకటి మనోవేదన. ఇన్నాళ్లూ తన జీవితంలోఅతి ముఖ్యపాత్ర పోషించిన భాగం అర్ధాంతరంగా రాత్రికిరాత్రి అదృశ్యమైతే అది ఆమెకు కోలుకోలేని ఘాతాన్ని కలిగిస్తుంది. షాకు నుంచీ కోలుకోవడం సామాన్య అంశం కాదు. కేన్సర్ ని జయించవలసిన వారు మొదటి సోపానం దగ్గరే చతికిలపడడం తరచూ జరిగేదే. కనుకనే కేన్సర్ ఆధిపత్యం చెలాయిస్తోంది.

steps

ఇతరుల ముందుకు ఎలా వెళ్లాలి అనే ఆలోచన మనసులో లేనిపోని ఆందోళన కలిగిస్తుంది.

ఆందోళన నుంచీ ఎడతెగని విచారం కలుగుతుంది.

దీని నుంచీ మనోవ్యాకులత వస్తుంది. ఇది అనేక మానసిక రుగ్మతలకు దారితీస్తుంది.

ప్రస్తుతానికి నా పక్కబెడ్ మీది ఆమె ఇదే పరిస్థితిలో ఉంది. ఈ రుగ్మత ఆమె మనసు కబ్జా చేస్తే, దాన్ని ఖాళీ చేయించడం చాలా కష్టం.

నిజానికి రొమ్ము కేన్సర్ అనే ఆలోచన రాగానే ఈ రుగ్మతలు వస్తాయి.

ఆపరేషన్ చేసి రొమ్ము తీసివేయగానే, ఆమెలోని డిప్రషన్ బాహాటంగా బయటకు వస్తుంది.

విచిత్రమేవంటే, ఇదే మనోవ్యాకులతలోకి బంధువులు కూడా ఒకే సారి జారుకుని, హఠాత్తుగా తన చుట్టూ ధైర్యంగా ఉండే వాళ్లే కనిపించరు.

ఇప్పుడు ఆమె ఇదే పరిస్థితిలో ఉంది.

 

ధైర్యం చెప్పాల్సిన తల్లి కూడా కూతురు కాపురం ఏమైపోతుందా అని తల్లడిల్లిపోతోంది.

భర్త వేదన ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరంలేదు. ఆమెకు మించిన వేదనలో అతను ఉంటాడు. శారీరకంగా, మానసికంగా ఒకటైన భర్త తన శరీరం కోతకు పడినట్లుగానే బాధపడతాడు.

పిల్లలకు ఏం తెలియక పోయినా అమ్మకు ఏదో అయింది, నాన్న చాలా బాధపడుతున్నాడు అని తెలిసిపోతుంది. దానితో వాళ్లు కూడా బయటకు చెప్పుకోలేని అపరిపక్వవేదన లో ఉంటారు.

 

ఇదే ఇక్కడ జరుగుతోంది.

ఒక భయంకరమైన ఊబిలో కుటుంబం మొత్తం పడిపోయింది. ఒకేసారి చనిపోతే, ఆ బాధ వేరు. కానీ, ఇది నరకవేదన.

బయటి ప్రపంచంలో ఎంతో సమర్ధవంత జీవితం ఉన్న వారుకూడా ఏం చేయాలో పాలుపోని స్థితిలోకి జారుకుంటారు. తమను తాము ఊరడించుకోవాలో, ఎదుటివారిని ఓదార్చాలో తెలియని వేదనలో ఉంటారు. ఒకరికి ఒకరు బయటికి గుంభనంగా ఉన్నా లోపల్లోపల మనసులు ఆక్రోశిస్తూ ఉంటాయి. అదృష్టవశాత్తూ భగవంతుడు వాటికి శబ్దం ఇవ్వలేదు. ఇచ్చి ఉంటే సృష్టికర్త లోకం బీటలు బారేది.

ఆమెతో పాటుగా ఆమె తల్లి, భర్త, పిల్లలూ అందరిదీ ఈ మౌన వేదన.

కళ్లు చూస్తూనే ఉంటాయి. కానీ దృశ్యాలు మనసుకు చేరవు.

చెవులు వింటూనే ఉంటాయి, కానీ పలుకులు అర్థం చేసుకోవాలనుకునే ప్రయత్నం ఉండదు.

మాట్లాడుతూనే ఉంటారు, కానీ ఏం మాట్లాడుతుంటారో వారికే తెలియదు.

కేన్సర్ ని జయించాలంటే కీలకమైన దశ ఇదే.

చికిత్స జరిగిన తరువాత రేపటిని ఎలా ఎదుర్కోవాలి అనే వ్యూహరచనా కాలం ఇది.

ఇక్కడ బేలతనంగా ఉంటే అపజయం తప్పదు.

విచిత్రమేమంటే, ఒక కుటుంబం నిలవడానికి మూలమైన భార్య మూలపడితే కుటుంబం కూలిపోతుంది. కనుక, దీన్ని కూలకుండా కాపాడడం ఆమె చేతుల్లోనే ఉంది.

పాక్షికంగా రొమ్ము కోల్పోయిన ఆమె బయట వాళ్లకు తన ముఖం ఎలా చూపాలా అని మథనపడుతోంది.

 

అమెరికా వంటి దేశాల్లో ఇటువంటి మానసిక సమస్యలు పరిష్కరించడానికి సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులూ సిద్ధంగా ఉంటారు. భారత దేశంలో ఈ తరహా వైద్యాలు కూడా ఆడవారికి చేయించగలిగిన వారు ఎంతమంది ఉన్నారో వేళ్లమీద లెక్కవేయవచ్చు. ఇది వృథా ఖర్చుగా నే భావిస్తారు. మానసిక వైద్య ఖర్చు సొంతవారే వేస్టు అనుకుంటారు కనుక గేదె చర్మం బీమా కంపెనీలు కనీసం పట్టించుకోవు. వారి దృష్టిలో మానసిక వైద్యులకూ పాలేళ్లకు తేడాలేదు. భారత దేశంలో మానసిక వైద్యుడు అంటే ఛాప్రాసీల కన్నా తక్కువ భావం ఉంది. మానసిక వైద్యుల దగ్గరకు వెళ్లడం కూడా పరువుతక్కువగా భావించే దురదృష్టకర సమాజంలో మనం ఉన్నాం.

టీవీలు, ఇంటర్నెట్టులు కంప్యూటర్లు బయల్దేరి పుస్తక సరస్వతిని పస్తులు పడుకోబెడుతున్న రోజుల్లో ప్రపంచాన్ని జయించి చిన్నారుల చేత కూడా వరుస నవలలు చదివించిన హారీపొట్టర్ రచయిత్రి జెకె రోలింగ్ ఒకప్పుడు తీవ్ర మానసిక వేదనకు లోనయిందట. ఆత్మహత్యకు ప్రయత్నించిందట. అటువంటి దశలో తాను మానసిక వైద్యం పొందానని దాని అనంతరమే అద్భుతమైన నవలలు రాశానని బాహాటంగా చెప్పుకుంది. ఆ సమాజానికి ఆమె ప్రకటనలు సరిపోయాయి. ఇదే విషయం మన వాళ్లకు చెబితే ఇంతా చేస్తే పిచ్చదా?” అని చప్పరించే మేధావులు ఉన్న సమాజం మనది. ఇటువంటి వారు ఎప్పటికి మారి మానసిక వైద్యానికి కూడా బీమా అవకాశాలు కల్పిస్తారో భగవంతుడికే తెలియాలి.

 

వైద్యం చేయించకపోతే చచ్చిపోతుందని వైద్యులు చెబితే తప్ప ఆడదానికి వైద్యం ప్రారంభించని సమాజంలో మానసిక వైద్యాలు కూడా అందించగల పరిపూర్ణత ఎప్పుడు వస్తుంది?

పక్క బెడ్ మీద తల్లీ కూతుళ్ల ప్రేమ యుద్ధం మొదలైంది.

తల్లి బ్రేక్ ఫాస్ట్ చేయమంటోంది. కూతురు వద్దంటోంది.

తల్లి ఆమెను వదలదు. కూతురు పట్టు వదలదు.

చాలా సైలంట్ గా ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతోంది.

చివరిగా వాళ్ల అమ్మ అస్ర్తం ప్రయోగించింది. “నువ్వు నేను చెప్పిన మాట వినడంలేదు. నేనింక ఇక్కడ ఉండలేను. మీ అత్తగారిని రమ్మంటాను. ఆవిడే నీకు సరైన జోడీఅని బెదిరించింది.

నా అంచనా నిజమే అయితే ఆమె ఠక్కున బ్రేక్ ఫాస్ట్ చేసి ఉండాలి. ఎందుకంటే బ్రేక్ ఫాస్ట్ యుద్దం అయిపోయింది. మళ్లీ లంచ్ దాకా యుద్ధ విరమణే.

అయితే ఆమె రోదన మాత్రం కొనసాగుతోంది.

మీ అత్తగారు ఆడబిడ్డా వస్తామంటున్నారు రమ్మన్నాతల్లి అడిగింది.

వద్దనే అన్నదని నాకు అనిపిస్తోంది.

అది సహజమే. ఆమె అత్తగారు తన కొడుక్కు కలిగిన బాధ గురించి ఆలోచిస్తుంది కానీ, కోడలికి కలిగిన కష్టం గురించి ఆలోచిస్తుందా? ఎంతటి అంజలీదేవి లాంటి అత్తగారినైనా, ఈ సమయంలో సూరేకారం అత్తగారిలాగే అనుమానించాలి. “వాడు ఎంత సంపాదిస్తేనేం, సంపాదించేదంతా ఈమె రోగాలకే సరిపోతోంది. “ అనకుండా ఉంటే చాలు. అంటుందనే భయం ఆమెను వణికించేస్తోంది. ఎంత ఉన్నత వర్గానికి వెళ్లినా కోడలు కోడలే, అత్త అత్తే.

ఇంగ్లండ్ కి మహారాణి అయినా కోడలి దగ్గరకు వచ్చే సరికి అత్తగారే అవుతుంది. అది ప్రకృతి సహజం.

సూటి పోటి మాటలు అనడం సర్వసాధారణం. కానీ, ఆమె ఏదయితే భయపడుతోందో అదే జరిగింది. ఆమె అత్తగారు వార్నింగ్ లేని తుఫాన్ లా విరుచుకుపడింది. ఆమె రావడం వలన కూతురు కన్నా తల్లే ఎక్కువ భయపడింది.

వస్తూ వస్తూనే పచ్చం పెట్టారాఅని అడిగింది.

మాటలో మార్దవం తెచ్చిపెట్టుకున్నట్టే ఉంది.

డాక్టరు గారు ఈ వేళే మొదలుపెట్ట మన్నారు. కానీ ఏమీ తినడం లేదు. ఒకటే ఏడుపు

హూ ఏడ్చి ప్రయోజనం ఏముంది. అనవసరంగా …కుట్లు కదులుతాయి. ఇంతకీ ఎందుకొచ్చిందన్నారు? డాక్టరు గారు

అది ఇంకా తెలియదండీ, పరీక్షలకు ఆపరేషన్ రోజునే శాంపిల్స్ పంపించారు, రిపోర్టులు రావడానికి ఐదు రోజులు పడుతుందన్నారు . రేపు ఎల్లుండిలో రిపోర్టులు రావచ్చు.”

అయినా మీ అమ్మాయి వాడే వన్నీ ఫారిన్ బాడీలే కదా, లోకల్ బ్రాలైతే వచ్చిందనుకోవచ్చు.”

మనసులో ఉన్న అక్కసు బయట పెట్టిందావిడ. నిజానికి ఏ రకం కేన్సర్ ఏ విధంగా వస్తుందో కచ్చితమైన సమాచారం వైద్యుల దగ్గర కూడాలేదు.

ఆపరేషన్ ఎలా జరిగిందన్నారు? బాగా జరిగిందన్నారా? ఏదైనా అనుమానాలున్నాయన్నారా?”

బాగానే జరిగిందన్నారండీ.” అన్నింటికీ తల్లే జవాబిస్తోంది.

రేడియేషన్ అవసరంలేదన్నారా?”

అదేం అవసరం లేదు. దాని గురించేం చెప్పలేదు.”

అయితే అదృష్టవంతులమే. ఈ మధ్య డబ్బు కోసం ఆపరేషన్ చేశాక కూడా, రేడియేషన్ చెయ్యాల్సి వస్తుంది అంటున్నారు లెండి. “

అటువంటి దేం లేదండీ

ఏం వైద్యాలో ఏమిటో, ఇల్లు ఒళ్లు గుల్ల చేయడం తప్ప కేన్సర్ కి వీళ్లు చేయగలిగిందేముందీ? ” ఒక భారీనిట్టూర్పు కొసరి వడ్డించిందావిడ.

మనసులో ఉన్న మాలిన్యాన్ని బయట పెట్టుకునేందుకు ఇదొక మార్గం. ముందుగా ఎలా వచ్చిందో అనే ఆరాతో ప్రారంభించి, తాము చేయలేనివి వాళ్లు చేసి ఉంటే ఫలానా జాగ్రత్తలు తీసుకున్నారు కనుక మీకు రాకూడదే అంటారు. లేదా ఫలానా దురలవాటు ఉందా అయితే మీకు వచ్చి తీరాల్సిందే అనే తీర్మానం చేసేస్తారు. అప్పటికి వాళ్ల మనసు కుదుటపడుతుంది. ప్రాణం ఉండగానే పీక్కుతినడం అంటే ఇదే.

 

బూట్లు టకటకలాడిస్తూ సెక్యూరిటీ గార్డు వచ్చాడు.

వాళ్ల అమ్మ అతడిని చూసి  అమ్మయ్యా అని అనుకుని ఉంటుంది.

నా అంచనా నిజమే అయింది. విజిటింగ్ అవర్స్ అయిపోయాయి బయటకు వెళ్లిపోవాలని అన్నాడు. అదే అదనుగా వియ్యపురాలిని జబ్బిచ్చుకుని బయటకు తీసుకుపోయి ఉంటుంది. ఇంక మాటలేం వినపడడంలేదు. ఆమె ఏడుపు షరామామూలుగా కొనసాగుతోంది.

ఆరోగ్యవంతులను కూడా డీప్ డిప్రషన్ లోకి తీసుకెళ్లగలిగిన వాళ్లు ఇటువంటి వాళ్లే. ఇటువంటి వాళ్లు ఆసుపత్రులకు రాకుండా ఉండడమే మంచిది. పేషంట్లతో మాట్లాడకుండా ఉండడమే మంచిది.

తల్లి త్వరగానే తిరిగి వచ్చింది. ఆవిడకు కూడా వియ్యపురాలి దగ్గర ఎక్కువ సేపు ఉండడం ఇష్టం లేదనుకుంటాను.

తల్లిని చూసి ఇంకా ఎక్కువగా ఏడవడం మొదలు పెట్టింది.

నేను ఇల్లు గుల్ల చేస్తున్నానట, చూడు ఎట్టా మాట్టాడుతోందో. ఆవిడను ఎవరు రమ్మన్నారు? అసలు ఇంత కావడానికి ఆవిడే కదా కారణం …” అంటూ ఘొల్లుమంది.

నా కెందుకీ వైద్యాలు హాయిగా ప్రాణాలు తీసేసినా బాగుండు. ఆపరేషన్లోనే చచ్చిపోయినా బాగుండేది.” అంటూ ఏడుపు లంఘించుకుంది.

ఆమెలో ఆత్మహత్యా ధోరణి ప్రవేశిస్తోంది. ఇది  రాతి మనుషులు, చేదు మందుల ప్రభావమే.

ఇంక నాకేం వైద్యాలు అవసరం లేదు. పోదాం పద…” అంటూ లేవబోయిందనుకుంటాను.

వాళ్ల అమ్మ లేవకు లేవకు అంటూ వారిస్తోంది.

 

నర్సు పరిగెత్తుకుంటూ వచ్చింది. విషయం అర్థం చేసుకుంది.

సెక్యూరిటీకి ఫోన్ చేసి బెడ్ నెంబర్ చెప్పి ఇకమీదట ఎవరు ఆమెను చూడడానికి వచ్చినా లోపలకు పంపించవద్దని చెప్పింది.

పేషంటులో ఆత్మహాని లక్షణాలు రావడం ఆమె గమనించి ఉంటుంది.

ఇప్పటి వరకూ ఆమె ఎందుకు అత్తగారిని కూడా చూడాలని లేదు అని అంటోంది అనుకుంటూండే వాడిని. నిజమే ఈ సమయంలో ఆమె రాకుండా ఉంటేనే మంచిది అనిపించింది.

కొన్ని రకాల మందులకు సైడ్ ఎఫెక్టుగా డిప్రషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ, భారతదేశంలో ఏ వైద్యుడూ ఈ సంగతి పేషంట్లకు చెప్పడు. కేవలం తన అబ్జర్వేషన్లలో వీటిని గమనిస్తాడు. వాటిని సైడ్ ఎఫెక్టుల్లో కొట్టి పారేసి ప్రధాన చికిత్స మీదే శ్రద్ధపెడతాడు. బంధువులకు కూడా పేషంటు మానసిక లోపాలు వైద్యులకు చెప్పాలని తెలియదు. కానీ వైద్య సిబ్బంది వీటన్నింటినీ పరిశీలిస్తూనే ఉంటారు.  అయితే, ఆత్మహాని స్థాయి నుంచీ పోరాటం వైపు మళ్లించే తీరిక చాలామంది వైద్యులకు లేదు. నిజానికి అది వారి పని కూడా కాదు. మానసిక వైద్యులకు రిఫర్ చేయడమే వారి పని. కానీ, భారతదేశంలో ఏ డాక్టరూ ఆ పనిచేయరు. అతి కొద్ది మంది వైద్యులు మాత్రమే మనోవ్యాకులతకు మందులు ఇస్తారు. అదీ, పేషంట్లు మానసిక సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తేనే.

 

మందుల ప్రభావమో, ఆపరేషన్ ప్రభావమో ఏదయితేనేం? భయపడి ఎంతకాలం ముఖం చాటేస్తుంది?

గుండెలవిసేలా ఏడిస్తే ప్రయోజనం ఏముంది? మనోవ్యాకులత మరింత పెరుగుతుంది తప్ప.

పేషంటు డిప్రషన్ లోకి జారుకునే కొలదీ కేన్సర్ జయిస్తుంది.

సందేహం లేదు నా కళ్ల ముందే ఒక పేషంటు చిగురుటాకులా రాలిపోవడానికి సిద్ధంగా ఉంది.

కానీ నేనేం చేయగలను?

తరువాయి భాగం రేపు ఇదే చోట

https://yeluripati.wordpress.com/

దయచేసి ఈ కింది చిరునామాలోని Facebook group: Cancer -prevention, control and cure లో చేరి మీ మద్దతు తెలుపండి.

https://www.facebook.com/groups/cancerpcc/

ఒక విన్నపం : ఇందులోని పాత్రలు కేవలం కల్పితాలు మాత్రమే. ఇవి ఎవరైనా మరణించినా లేక జీవించిన వ్యక్తులను లేదా సంస్థలను పోలినట్లైతే అది కేవలం యాదృచ్ఛికం మాత్రమే. నా జీవితంలోని కొన్ని యదార్థ ఘటనలకు, సత్యాలకు, అంశాలకు నాటకీయత జోడించి, సున్నితమైన కేన్సర్ సమస్యల పట్ల, నిర్లక్ష్యంగా ఉంటున్న సమాజలోపాలను చూపడానికి,  పరిష్కారమార్గాలు కనుగొనడానికి చేస్తున్న అతిపెద్ద ప్రయత్నం. రెండు దశాబ్దాల పాత్రికేయ రంగ అనుభవంతో మూడేళ్లు చేసిన పరిశోధనాత్మక నివేదికకు ధారావాహిక రూపమే ఇది.

ప్రకటనలు