• భారత దేశంలో ప్రతీ ఆరు గంటలకు ఒక మరణం కేవలం నోటి కేన్సర్ వల్ల కలుగుతోంది. దీనికి పొగాకు, గుట్కా నమలడం ప్రధాన కారణాలు.
 • భారత్ లో మగవారికి వీర్యగ్రంథి కేన్సర్ పై సరైన అవగాహన లేదు.
 • రాబోయే దశాబ్దంలో రొమ్ము కేన్సర్ రాకాసి జడలు విప్పి లక్షలాది మందిని కుంగదీయబోతోంది .
 • బాల్యంలో, యవ్వనంలో కేన్సర్ వచ్చి సరైన వైద్యం సకాలంలో అందిరాగా వైవాహిక జీవితం ప్రారంభించడానికి చేయూతనిచ్చే వ్యవస్థలు ఇంకా అభివృద్ధి చెందలేదు. వీరు బతకడమే ఘనకార్యమైనట్లు చూసే వారి సంఖ్య తామరతంపరగా ఉంది.
 • కేన్సర్ రాకుండా టీకాలు వేయించుకోవచ్చు అని చాలా మందికి తెలియదు.
 • భారత్ లో ప్రతి ఏడాదీ 12 లక్షలు కొత్త కేన్సర్ కేసులు వస్తున్నాయని ఒక ఊహ. ఇందులో కనీసం 10 శాతం అంటే లక్షా ఇరవై వేల కేన్సర్ కొత్త కేసులు తెలుగు రాష్ట్రాల నుంచే నమోదు అవుతున్నాయని ఊహిస్తున్నారు. ఇది ప్రమాద తీవ్రతను చెప్పకనే చెబుతోంది.

రోగాలకు చికిత్స చేసే వైద్య రంగానికి కేన్సర్ పట్టిందా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వస్తోంది. ఈ రంగానికి పట్టిన కేన్సర్ చిహ్నాలు బాహాటంగా బయట పడినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరవడంలేదు. ఆరోగ్య రంగానికి మూలమైన పాలకులు, అధికారులు, వైద్యులు, ఔషథ తయారీ దారులు, అమ్మకందారులు, బీమా సంస్థలు, టిపిఏలు, ఆసుపత్రులు సమష్టిగా కేన్సర్ తో పోరాడాల్సింది పోయి అవినీతి కేన్సర్ ను ప్రత్యక్షంగా పోషిస్తున్నారు. కేన్సర్ పై యుద్ధం చేయాల్సింది పోయి మాచ్ ఫిక్సింగ్ చేసుకుని జాతి మనుగడకే ప్రశ్నార్థకంగా మారుతున్నారు. ఈ దశలో కేవలం కోర్టులు మాత్రమే ఆశపోతు అగ్రరాజ్యాల ఔషథాల కబ్జాను అడ్డుకుంటున్నాయి. వైద్యరంగదేహంలో ఏఏ అంగాలకు కేన్సర్ పట్టిందో ఇప్పుడు గమనిద్దాం.

 పాలకుల పాపాలు:

 కేన్సర్ ను పెంచి పోషిస్తున్న వారిలో అగ్రభాగాన పాలకులే ఉంటారు. నివారించదగిన కేన్సర్ కారకాల్లో పొగాకు ప్రధానమైంది. భారత దేశంలో మొత్తం కేన్సర్ మరణాల్లో కేవలం పొగాకు వల్ల మాత్రమే 60 శాతం కలుగుతున్నాయి. దీని వల్ల పొగాకు సమస్య తీవ్రత తెలుస్తుంది. పొగాకు సాగు, వినియోగం అదుపు చేయడంలో చిత్తశుద్ధిలేదు. గుట్కా నిషేధం పై శ్రద్ధలేదు. కేన్సర్ నియంత్రణకు సరైన పథక రచన చేయాలన్న తలపు లేదు. ప్రపంచ దేశాలు కేన్సర్ నుంచీ తమ ప్రజలను కాపాడుకోవడానికి యుద్ధ ప్రాతిపదికన పాటు పడతుంటే మన పాలకులు మొద్దు నిద్రపోతున్నారు. బీడీ కట్టలపై బొమ్మలతో శవ రాజకీయాలు చేస్తున్నారు. రాత్రికి రాత్రి భారత దేశంలో పొగాకు వినియోగాన్ని అణిచివేయడం అసాధ్యమని అందరికీ తెలుసు. కానీ, కనీసం యువతరం పొగాకు వైపు ఆకర్షితులు కాకుండా పాలకులు ఏ చర్యలు చేపడుతున్నారన్నది ప్రధాన ప్రశ్న. చేతిలో ఉన్న అధికారంతో కేన్సర్ పెనుభూతాన్నిమట్టు పెట్టాల్సింది పోయి, కేన్సర్ వస్తే మీడియాకు కూడా చెప్పకుండా ప్రజా ధనంతో అమెరికాకు పోయి గుట్టుచప్పుడు కాకుండా వైద్యం చేయించుకుంటున్నారు.. కేన్సర్ వచ్చినప్పుడైనా ఈ వ్యాధికి చికిత్స భారతదేశంలో ఎందుకు లేదనే ఆలోచన పాలకులకు రావడంలేదు. ఈ దేశంలో కేన్సర్ కు చికిత్స చేయించుకోలేక, చూస్తూ చూస్తూ తనవారిని చంపుకోలేని సామాన్య మానవుడు ఒకడు కడుపు మండి కేన్సర్ వస్తే మన నాయకులకు విదేశాల్లో చికిత్స చేయించకూడదు. కేవలం భారత దేశంలోనే చికిత్స చేయించుకోవాలని పార్లమెంటులో చట్టం చేయిస్తే కానీ వీళ్ల తిక్కరోగం కుదరదని శాపనార్థాలు పెడుతున్నారు. వీరి మాటల్లో కొంతైనా నిజం ఉందని చుట్టూ ఉన్న కేన్సర్ పేషంట్లు అనడం కేన్సర్ ఆసుపత్రుల్లో తరచూ జరిగే సంభాషణలే. తమ వంతు ప్రీమియం డబ్బులు చెల్లించినా ఏడాది పాటు పాత్రికేయులకు కూడా ఆరోగ్యబీమా ఇవ్వని ప్రభుత్వాల పాలనలో మనం ఉన్నామని సిగ్గుపడదాం.

 అధికారుల అలసత్వం:

 కేన్సర్ రహిత సమాజంగా తయారు చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ పాటుపడుతుంటే మన అధికారులు మాత్రం తమకేం పట్టనట్టు ఉంటున్నారు. అమెరికా వంటి అగ్రరాజ్యప్రభుత్వాధికారులు కేన్సర్ అంతు చూడాలని వ్యూహరచన చేస్తుంటే…. భారత దేశంలో కేన్సర్ పేషంట్లు ఎంత మంది ఉన్నారు అనే ప్రశ్నకు అటు కేంద్ర కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వాధికారుల దగ్గర కానీ సమాధానం లేదు సరికదా కనీసం కాకిలెక్కలు కూడా లేవన్నది కఠిన వాస్తవం. అంటే, ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారిని అంతం చేయడం పట్ల కేంద్ర రాష్ట్రాలు ఎంతటి నిర్లక్ష్యంతో ఉన్నాయో ఈ ఒక్క నిజం వల్ల తెలుసుకోవచ్చు. రోగులెంత మంది ఉన్నారో తెలియకపోతే ప్రభుత్వాలు ఏ ప్రణాళికలు రచిస్తాయి? నిధులు కేటాయిస్తాయి? రోగాలను అదుపు చేస్తాయి? ఎంత మంది రోగులు ఉన్నారో తెలియకపోతే, ఎంత మంది వైద్యుల అవసరం ఉందో ఎలా తెలుస్తుంది? ఎన్ని వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలో ఎలా తెలుస్తుంది? ఎన్ని కేన్సర్ ఆసుపత్రులు కట్టాలో తెలుస్తుంది? కేన్సర్ చికిత్సలో వైద్యులకు పిజీ సీట్లు ఎన్ని ఉండాలో ఎలా నిర్ణయిస్తుంది?…. ఇప్పటి వరకూ ప్రభుత్వం దగ్గర అధికారిక సమాచారం లేదు అంటే కేన్సర్ నియంత్రణ ఎంత అధ్వాన్న స్థితిలో ఉందో అర్ధమవుతుంది. కనీసం రోగులెంత మంది ఉన్నారో తెలిస్తే, తరువాత దశలో ఏ రకం కేన్సర్ కి ఎంత మంది బలవుతున్నారో తెలుస్తుంది. భారత దేశం ఆరోగ్యం గురించి మాట్లాడే వారు ఎవరైనా తడుముకోకుండా చెప్పేది ఒకటే విషయం. భారత్ లో గొంతు, తల, రొమ్ము, గర్భాశయ, వీర్యగ్రంథుల కేన్సర్ లు ఎక్కువ అని చెబుతారు. కానీ, ఏ గణాంకాల సాయంతో చెబుతున్నారు? అంటే నోరు వెళ్లబెట్టవలసిందే.. జనన మరణ రిజిస్ట్రేషనే పరిపూర్ణత సాధించని 120 కోట్ల మంది ఉన్న దేశంలో కేన్సర్ రిజిస్టర్ అనే మాటలకు అర్థమే లేదు. ఇంక బోన్ మారో డోనర్ రిజిస్ట్రీ గురించి మాట్లాడడం హాస్యాస్పదం అవుతుంది. పాపులేషన్ బేస్డ్ కేన్సర్ రిజిస్ట్రీస్ అంటే ఏమిటి అని సచివాలయం దగ్గర మొదలు పెట్టి ప్రభుత్వ ఆసుపత్రుల మీదుగా బీమా ఏజంట్ల వరకూ అందరినీ ప్రశ్నిస్తే ఎంతమంది సరైన సమాధానం చెప్పగలరు? నేషనల్ కేన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రాం అనేది 1981లో ప్రారంభమైనా దీని దగ్గర మచ్చుకు కూడా గణాంకాలు లేవని వేరే చెప్పనక్కర లేదు. వైద్యరంగానికి కేన్సర్ సోకిన తరువాత ఆలస్యంగా నిద్ర లేచిన సర్కారు ఇప్పటికీ దేశంలో పాపులేషన్ బేస్డ్ కేన్సర్ రిజిస్టర్లు కేవలం 27 మాత్రమే ప్రారంభించింది. హైదరాబాద్ లో ఈ తరహా రిజిస్టర్ ఏర్పాటు చేయాలని 2013లో కలగన్నారు. రాష్ట్ర విభజనతో అది ఏ అటక ఎక్కిందో వెతకాల్సి ఉంది.వెనక బడిన రాష్ట్రాలుగా చెప్పుకుంటున్న ఈశాన్య భారతంలో ఎప్పుడో ఈ తరహా రిజిస్టర్లు మొదలైన సంగతి తెలిసి మన రాష్ట్ర ప్రభుత్వాలు సిగ్గుపడాలి. కేన్సర్ అనగానే మా నాన్న, మా తాత, మాబావ అంటూ లెక్కలు చెప్పని కుటుంబాలు లేనేలేవన్నదీ నిజమే.

 వైద్యభైరవులుః

 కేన్సర్ అంశంలో వైద్యులు పాపాల భైరవులుగా మారుతున్నారు. వైద్యరంగంలో అతి ఖరీదైన వైద్యాలలో మొదటి స్థానంలో ఉన్న కేన్సర్ కొందరు వైద్యులకు ప్రధాన వనరుగా మారుతుంటే, ముంబాయిలోని టాటా మెమోరియల్ ఆసుపత్రి వంటి సంస్థలలోని వైద్యులు భూలోకంలోని అశ్వనీ దేవతలుగా మన్ననలు అందుకుంటున్నారు. నిజమైన వైద్యానికి గీటురాళ్లుగా ఉంటున్నారు. “మా తాతగారికి కేన్సర్ వస్తే హైదరాబాద్ ఆసుపత్రుల ఖర్చు తట్టుకోలేక టాటా ఆసుపత్రికి తీసుకువెళ్లాను. ఒకరి తరువాత ఒకరు ముగ్గురు వైద్యులు మాతాతగాని పరీక్షించారు. ఆశ్చర్యం ఏమిటంటే, ఎవ్వరూ తమ కన్సల్టెన్సీ ఫీజు అంటూ నయాపైసా తీసుకోలేదు. అక్కడ అసలు రిజిస్ట్రేషన్ ఫీజే లేదండీఒక పేషంటు ఆనందంగా చెబుతాడు. కనుకనే భారతదేశంలోని అన్ని కేన్సర్ ఆసుపత్రులలోనూ టాటా ఆసుపత్రి ప్రథమస్థానంలో నిలుచుంది. తన దగ్గరకు వచ్చే వారిలో 65 శాతం మందికి ఉచితంగా వైద్యం చేస్తోంది. దీనికి విరుద్ధంగా ఇతర ఆసుపత్రులు, వైద్యులు ఉంటున్నారు. అమెరికా నుంచి వచ్చిన ఒక మిత్రుడు ఏ ఆసుపత్రి అయినా పెట్ స్కానింగు చేయించాలి అని వ్యాధి నిర్థారణ దశలో అంటే ఆ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోకండి.” అని సలహా ఇచ్చాడు. పరమ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కేన్సర్ నిర్ధారణ పరీక్షలకు పెట్ స్కానింగ్ కు ఏ మాత్రం సంబంధంలేదట. అమెరికాలో ఏ పరీక్షలు, ఎవరికి ఎప్పుడు చేయించాలి అనే అంశాలపై కచ్చితమైన నియమావళి ఉంది. దాన్ని అక్కడ వైద్యులు తప్పక పాటిస్తారు. భారత దేశంలో దీనికి విరుద్ధంగా కేన్సర్ వచ్చింది అని నిర్ధారించడానికే సగం ఆస్తులు హరించివేస్తారు. ఇక వైద్యం ప్రారంభించాక మిగిలిన ఆస్తులు కరగదీస్తారు. పేషంటు చనిపోయేలోపల కుటుంబాన్ని అప్పులపాలు చేసేస్తారని ఒక పేషంటు చెప్పుకొస్తాడు. రోగికి వచ్చిన రోగాన్ని విడమర్చి చెప్పి, అందుబాటులో ఉన్న వైద్యవిధానాలు తెలిపి, అందులో మీరేది ఎంచుకుంటారు అని పేషంటును అడిగే వైద్యుడిని ఇండియాలో మీరు చూశారా అని అమెరికా మిత్రుడు ప్రశ్నించాడు. ఒక వేళ కీమోథెరపీ ఎంచుకుంటే, అందుబాటులో ఎన్ని రకాల మందులు ఉన్నాయి? వాటి రేట్ల వివరాలు ఏమిటి, వాటిని ఏ కంపెనీలు తయారు చేస్తున్నాయి? అమ్మేవారి చిరునామా వివరాలు తెలిపే ఆసుత్రులున్నాయా అనేది మరో ప్రశ్న. చాలా మంది వైద్యులు ఇవేవీ పేషంట్లతో చర్చించరని అందరికీ తెలిసిన విషయమే. కీమోథెరపీలో వాడే మందులు రూ. 20 వేలు, 30 వేలు పై మాటే. ఇది అలుసుగా చేసుకుని తయారీ దారులు మాయల ఫకీర్లలా మారి పేషంట్లను దోచుకుంటున్నారు. వీరికీ, ఆసుపత్రి యాజమాన్యాలకూ మధ్య ఈ విషయంలో వైద్యులు నిస్సహాయులుగా మారుతున్నారు.

 బీమా ధీమా వద్దుః

 బీమా ఉందని ధైర్యంగా బతికే అవకాశం బీమా కంపెనీలు ఇవ్వలేకపోతున్నాయి. లక్షరూపాయల మెడికల్ ఇన్సూరెన్స్ ఉందికదాఅని భరోసాగా బతికేసే వారికి గుండె, కేన్సర్ విభాగాలు దారుణమైన దెబ్బ కొడుతున్నాయి. ఒకసారి గుండె విభాగానికి లేదా కేన్సర్ విభాగానికో వెళితే లక్షరూపాయలూ అరగంటలో హారతి అయిపోతాయి. దీని తరువాత ఏం చేయాలో పాలుపోని పరిస్థితి పేషంట్లకు ఎదురవుతుంది. నేడు ఖర్చు పరిమితి లేని ఆరోగ్య బీమా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా లేదన్నది వాస్తవం. ఇటువంటి పరిస్థితులు ఎలా ఎదుర్కోవాలో మధ్యతరగతి వారు గమనించడంలేదు. బీమా సంస్థలు కూడా రోగాలు రానంత వరకే బీమా చేస్తాయి. కానీ, ఒకసారి రోగం వస్తే బీమా పాలసీలు ఇవ్వవు . అంతేకాదు టాప్ అప్ పాలసీల గురించి పేషంట్లలో అవగాహన లేదు. బీమా కంపెనీలలో ఉన్న పోటీల వల్ల వీళ్లు సహజంగానే ఆరోగ్యవంతులపై ఎక్కువ శ్రద్ధ చూపుతుంటారు. వ్యాధిగ్రస్తులైన పాత కష్టమర్లను చూసి ముఖం చాటేస్తారు. పాలసీని అమ్మేటప్పుడు చూపించే సినిమాలు, క్లైముల సమయంలో చూపించరు. పేరు తప్పు ఉందని చెప్పడం దగ్గర నుంచీ మొదలు పెడితే డిశ్చార్జి సమయంలో సంతకం వరకూ అనేక ఆంక్షలు పెడతారు. బీమా సొమ్ము కోసం పానిపట్టు యుద్ధాలు చేసే పేషంట్లు కూడా కోకొల్లలు. ఇదేంటీ అని అడిగితే పాలసీ తీసుకునేటప్పుడే మీరు జాగ్రత్తగా ఉండాలని చల్లగా అంటారు. వైద్యరంగంలో ఉన్న లోపాలు బీమా సంస్థలకు తెలియక కాదు. దీన్ని సరిచేయాలనే ఉద్దేశం వీరికి లేకపోవడమే ప్రధాన కారణం. దీనికి తోడుగా ఆరోగ్య వ్యవస్థలో చోటు చేసుకున్న నియంత్రణ లేమిని ఇవి భారీ ఎత్తున సొమ్ము చేసుకుంటున్నాయి. దీన్ని వివరించడానికి కొన్ని ఉదాహరణలు చెప్పితీరాలి.

 

కేన్సర్ వచ్చినప్పుడు శస్త్రచికిత్స ద్వారా దోషం ఉన్న శరీర భాగాన్ని తీసివేయడం సర్వసాధారణ విషయం. దోషం ఉన్న భాగాన్ని మాత్రమే కాదు దరిదాపులోని కొంత ఆరోగ్య భాగాన్ని కూడా తీసివేస్తారు. ఈ విధంగా తీసివేసిన తరువాత ఆ ప్రాంతం పూరించడానికి శరీరంలోని మరో భాగం నుంచీ కండనో ఎముకలనో తీసి శస్త్రచికిత్స చేస్తారు. కేన్సర్ ఉన్న భాగాన్ని తీయడాన్ని ప్రాణాలు కాపాడే శస్త్రచికిత్సగా వైద్యశాస్త్రంలో పరిగణిస్తారు. ఖాళీ ప్రాంతాన్ని పునర్నిర్మించే శస్త్రచికిత్సను కాస్మోటిక్ సర్జరీ అంటారు. భారత దేశంలో ఏది ప్రాణాధార శస్త్రచికిత్స ఏది కాస్మోటిక్ సర్జరీ అని నిర్దేశించే వ్యవస్థ పటిష్టంగా బీమా రంగాన్ని శాసించడం లేదు. ఎందుకంటే, కాస్మోటిక్ సర్జన్లు చేసినంత మాత్రాన ప్రతీదీ కాస్మోటిక్ సర్జరీ కాదు. ఉదాహరణకు ఒక నోటి కేన్సర్ వచ్చిన వ్యక్తికి ఆపరేషన్ చేసి బుగ్గల్లోని కండలు కోసి, దవడ ఎముక తీసివేశారు అనుకుందాం. ఇలా తీసివేయడంతో కేన్సర్ శస్త్రచికిత్స ఐపోతుంది. దీని తరువాత కాస్మోటిక్ సర్జన్ వచ్చి రొమ్ము నుంచో, చేతి నుంచో, తొడల నుంచో కండ తీసుకువచ్చి బుగ్గల దగ్గర పునర్నిర్మిస్తాడు. మరో ఉదాహరణలో ఒక ఆడదానికి రొమ్ము కేన్సర్ వస్తే రొమ్ము తీసివేసి సిలికాన్ రొమ్ము కూడా అమరుస్తారు. ఇంకో ఉదాహరణలో యోని కేన్సర్ వచ్చిన వనితకు యోని తీసి వేసి అమెరికా కాస్మోటిక్ వైద్యులు కృత్రిమ యోని తయారు చేస్తారు. ఈ విధంగా జరిగే ఆపరేషన్లు అన్నీ ఒకే గాటన కట్టడానికి వీలు లేదు. వీటిలో ఏవి ముఖ్యమైనవి? ఏవి కాస్మోటిక్ శస్త్రచికిత్సలు అని నిర్ణయించి చెప్పి బీమా సంస్థలను శాసించే వ్యవస్థ ఏది? బీమా సంస్థలు ఎవరిష్టం వారిదిగా పనిచేస్తున్నాయి.

 అవినీతి కూడలిలో టిపియేలుః

 ఆరోగ్య రంగంలో వార్షిక బీమా పాలసీలు వచ్చాక పుట్టుకొచ్చిన వ్యవస్థ టిపియే. వీరు బీమా కంపెనీలకు, వైద్యశాలలకు మధ్యవర్తులుగా ఉండి రోగులకు ప్రత్యక్షసేవను అజ్ఞాతంగా చేస్తుంటారు. అంటే ఒక విధంగా మూడుదారుల కూడలిలో టిపియేలు ఉన్నాయి అన్న మాట. పాలసీలు బట్వాడా దగ్గర నుంచీ క్లైముల పరిష్కారం వరకూ అన్నీ వీరే చేస్తారు. ఏ కంపెనీ మందులు ఎంత రేట్లకు ఉన్నాయి, ఏ ఆసుపత్రి ఏ రకమైన పేషంటుకు ఏ రకమైన బిల్లు వేస్తోందీ, ఏ బీమా కంపెనీ ఏ రూల్స్ ప్రకారం క్లైములు పరిష్కరిస్తోంది అనే చిట్టా కేవలం వీరి దగ్గరే ఉంటుంది. ఏ సూపర్ కంపూటర్ల ద్వారా ఇంత సమాచారాన్ని వీళ్లు క్రోడీకరించి సకాలంలో క్లైములు పరిష్కరిస్తారో ఆ భగవంతుడికే తెలియాలి. అంతేకానీ, ఇన్ని రకాల టారీఫ్ లు ఏమిటి అని వీరు ఆసుపత్రులను ప్రశ్నించరు. మీ బీమా పాలసీ రూల్స్ లో ఈ లోపాలు ఉన్నాయని బీమా కంపెనీలకు చెప్పరు. ముక్కు మూసుకుని హైదరాబాద్ చెత్తకుండీలు శుభ్రం చేసే కార్మికుల మాదిరిగా వీళ్లు కూడా పని చేస్తుంటారు. కాకపోతే, వీరు ఏసీ గదుల్లో, ఇంగ్లిపీసు మాట్లాడుతూ ఉంటారు. ఇదే వీరికీ పారిశుధ్యకార్మికునికీ ఉన్న తేడా. వైద్య రంగంలో ఉన్న అవినీతి కేన్సర్ కి ప్రత్యక్షసాక్షులు వీరే. మీరెందుకు మాట్లాడరు అని ఇందులో పనిచేసే ఒక ఉద్యోగిని అడిగితే మేం ఏం చెప్పడానికి వీలు లేదండీ. కాకపోతే మేం చెప్పే సలహా ఒక్కటే. జేబులో నుంచి పది రూపాయలు పోతే పదేళ్లు బాధపడే వాళ్లు కూడా తమ లక్షరూపాయల బీమా కార్డులో ప్రతి రూపాయి ఏవిధంగా ఖర్చు అవుతోంది అని తెలుసుకోరు. పాలసీలోని లక్షరూపాయలు కూడా తమ జేబులోని లక్షరూపాయలే అని గుర్తుంచుకున్న రోజునే వ్యవస్థ బాగుపడుతుంది. పేషంట్లలో ఈ అవగాహనా లోపమే ఈ వ్యవస్థలోని అవినీతికి ప్రధాన కారణం. అన్నింటికీ మించి తాము చేరుతున్న ఆసుపత్రి ఏ రకమైంది అనే కనీస సమాచారం కూడా తెలుసుకోకుండా చేరుతుంటారు.” అని అన్నారు.

 అవగాహన లేని వ్యవస్థః

కేన్సర్‌ సమస్యలపై వైద్యవ్యవస్థలో సరైన అవగాహన లేదు. ఇది అర్థం కావాలంటే ఈ ఉదాహరణలు తెలుసుకోవాలి. కేన్సర్‌ వచ్చినప్పుడు శస్త్రచికిత్సద్వారా దోషం ఉన్న భాగాన్ని తొలగించి వేస్తారు. ఇలా తొలగించేటప్పుడు చెడు భాగంతో పాటుగా కొంత మంచిభాగాన్ని కూడా తొలగించి వేస్తారు. ఈ విధంగా తీసివేసిన తరువాత ఏర్పడిన ఖాళీ ప్రాంతాన్ని పూరించడానికి శరీరంలోని మరో భాగం నుంచీ ఆరోగ్యవంతమైన కండను, అవసరమైతే ఎముకలను తీసి పునర్నిర్మిస్తారు. ఈ విధానంలో కేన్సర్‌ ఉన్న భాగాలను ఆంకాలజీ శస్త్రవైద్యులు తొలగిస్తారు. దీని తరువాత ఆ భాగాలను పునర్నిర్మించే బాధ్యతను కాస్మేటిక్‌ సర్జన్లు చేస్తారు. ఇక్కడే అసలు సమస్య దాగిఉంది. ఆంకాలజీ వైద్యుల శస్త్రచికిత్సను బీమా సంస్థలు ప్రాణాలు కాపాడే సర్జరీగా పరిగణిస్తాయి. కాస్మేటిక్‌ సర్జన్ల శస్త్రచికిత్సకు డబ్బులు బీమా సంస్థలు చెల్లించవు. ఎందుకంటే బీమా సంస్థలకు ఈ ఆపరేషన్లపై సరైన అవగాహనలేదు. భారత దేశంలో కేన్సర్‌ శస్త్రచికిత్సలలో ఏది అత్యవసరం? ఏది కాస్మేటిక్‌ సర్జరీ అనే విభజన సరిగా జరగలేదు. దీనిపై విధానపర నిర్ణయాలు సాధికారంగా లేవు. దీంతో ఒక్కో బీమా కంపెనీ ఒక్కో విధంగా పరిహారాలు చెల్లించడానికి నిబంధనలు ఏర్పరచుకుంటున్నాయి. దీని వల్ల కేన్సర్‌ పేషంట్లకు అన్యాయం జరుగుతోంది. ఈ సమస్య అర్థం కావడానికి ఈ ఉదాహరణలు గమనించండి.

ఒక వ్యక్తికి నోటి కేన్సర్‌ రావడంతో అతనికి దవడలో కొంతభాగం, బుగ్గల్లో కొంత కండ భాగం ఆంకాలజీ వైద్యులు తీసివేస్తే, దీన్ని కాస్మేటిక్‌ సర్జన్లు పునర్నిర్మిస్తారు. ఈ విధంగా పునర్నిర్మించడం అత్యావశ్యకం. అయితే, బీమా కంపెనీలు మాత్రం కాస్మేటిక్‌ సర్జరీకి డబ్బులు ఇవ్వవు.

మరో ఉదాహరణలో ఒక వనితకు రొమ్ము కేన్సర్‌ రావడంతో దాన్ని ఆంకాలజీ వైద్యులు తొలగించారు. కాస్మేటిక్‌ వైద్యులు సిలికాన్‌ జెల్‌ తో పునర్నిర్మించారు. రొమ్ము తీసివేసే సర్జరీకి బీమా కంపెనీలు డబ్బులు ఇస్తాయి. కాస్మేటిక్‌ సర్జరీకి ఇవ్వవు. ఇక్కడ, చాలా సున్నితమైన సమస్య ఉంది. యవ్వనంలో లేదా మధ్యవయస్సులోనూ ఉన్న స్త్రీ రొమ్ములేకుండా సమాజంలో సాధారణ స్థాయిలో నివసించడం అసంభవం. ఆమెకు అనేక రకాల మానసిక సమస్యలు వచ్చి ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంది. కనుక, 40 ఏళ్ల లోపల వయసున్న మహిళలకు రొమ్ము పునర్నిర్మాణం కూడా అత్యవసరమైందే కానీ, కాస్మేటిక్‌ సర్జరీగా చూడరాదని అనుభవజ్ఞులైన వైద్యులు అంటున్నారు.

ఇంకో ఉదాహరణలో ఒక స్త్రీకి యోనిలో కేన్సర్‌ వచ్చి యోనిని ఆంకాలజీ వైద్యులు తీసివేస్తే, కాస్మేటిక్‌ వైద్యులు పునర్నిర్మించారు. ఈ కేసులో ఇది వైద్య చర్చనీయాంశం. ఎందుకంటే, ఒక ప్రైవేటు పార్టు పునర్నిర్మాణం చేయకపోవడం ఆమె సమాజంలో సాధారణ స్థాయిలో జీవించడానికి అడ్డంకి కాదు. మరొక ఆపరేషన్‌ లో ఒక వ్యక్తికి మలద్వార కేన్సర్‌ వస్తే ఆంకాలజీవైద్యులు దాన్ని తొలగించివేస్తే, కాస్మేటిక్‌ వైద్యులు పునర్నిర్మించారు. ఇది అన్ని విధాలుగా అత్యవసర వైద్యమే. ఈ విధంగా చెప్పుకుంటే అనేక రకాల ఉదాహరణలు బీమా సంస్థల అవగాహనా లేమిని, సాధికార వైద్య మండలి నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతాయి. కేవలం కాస్మేటిక్‌ సర్జన్లు చేసినంత మాత్రాన అవి అనవసరమైన ఆపరేషన్లుగా భావిండం వైద్యవిద్యను అవమానించినట్లే.

అవకరాల ఆసుపత్రులుః

కేన్సర్‌ ఆసుపత్రులకు అనారోగ్యం సోకింది. ఇవి తమ ఇష్టం వచ్చినట్లు పరీక్షలు చేస్తూ, చికిత్సలు చేస్తూ పేషంట్లను దోచుకుంటున్నాయి. ఇది అర్థం కావాలంటే అసలు ఎన్ని రకాల వైద్యశాలలు ఉన్నాయో మనం తెలుసుకోవాలి. దేశంలోనే కేన్సర్‌ ఆసుపత్రులలో ప్రథమ స్థానంలో ఉన్న ఆసుపత్రి టాటా మెమోరియల్‌ కేన్సర్‌ ఆసుపత్రి. ఇది భారత వ్యాపార చక్రవర్తి టాటా కంపెనీ ఆథ్వర్యంలో నడుస్తోంది. దీనికి ప్రధాన మంత్రి అండదండలు కూడా ఉన్నాయి. ఒక విధంగా ఇది ప్రధాన మంత్రి స్వీయ పర్యవేక్షణలో ఉన్నా, ఈ ఆసుపత్రికి స్వీయపాలనా యంత్రాంగం ఉంది. దీని తరువాత చెప్పుకోవాల్సింది. బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆసుపత్రి. ఇది నందమూరి బాలకృష్ణ ఆథ్వర్యంలో నడుస్తోంది. ఇది భారత దేశంలోని ప్రధాన కేన్సర్‌ ఆసుపత్రులలో మనరాష్ట్రం నుంచీ మొదటి 15 స్థానాలలో ఉన్న ఏకైక ఆసుపత్రి. ఒక ధార్మిక సంస్థగా నందమూరి కుటుంబం ప్రారంభించిన ఆసుపత్రికి అనేక మంది ఎంపీలు తమ లాడ్స్‌ నిధుల నుంచీ విరాళాలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా హితోదిక సాయాలు అందించింది. టాటా చారిటబుల్‌ ట్రస్టు ఒక బ్లాకు నిర్మించి ఇచ్చింది. దీని తరువాత చెప్పుకోతగినది ఎం ఎన్‌ జే కేన్సర్‌ ఆసుపత్రి. దీన్ని జవహర్‌ లాల్‌ నెహ్రూ 1950వ దశకంలో ప్రారంభించారు. ప్రస్తుతం ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో, రాష్ట్ర ప్రభుత్వ ఆథ్వర్యంలో నడుస్తోంది.ఈ ఆసుపత్రికి కేంద్ర ప్రభుత్వ ప్రాంతీయ కేన్సర్‌ ఆసుపత్రి హోదా కూడా ఉంది.ఇటువంటి ఆసుపత్రులు రాష్ట్రానికి ఒకటే ఉంటుంది. ప్రస్తుతం ఇది తెలంగాణా, ఎపీల కేన్సర్‌ పేషంట్లకు ఉమ్మడిగా సేవలు చేస్తోంది. దీని తరువాతది నిమ్స్‌ ఆసుపత్రి దీని గురించి కొత్తగా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు.

ఇక మిగిలినవి అన్నీ కార్పొరేటు ఆసుపత్రులు.

వీటిలో టాటా, ఎం ఎన్‌ జె ఆసుపత్రులు దాదాపు ఉచితంగా కేన్సర వైద్యం చేస్తున్నాయి. టాటాలో 65 శాతం రోగులు ఉచితంగా వైద్యం పొందుతుంటే, ఎం ఎన్‌ జేలో 95 శాతం మంది ఆరోగ్యశ్రీ లబ్ధిదారులే ఉంటారు. మిగిలిన 5 శాతంలో కూడా కొంత మందికి ఉచిత వైద్యం చేసేందుకు కేంద్ర రాష్ట్ర నిధులు వారి దగ్గరున్నాయి. ఈ ఆసుపత్రులలో టాటా, బసవతారకాలు బహిరంగంగా తాము వసూలు చేసే పరీక్షల రేట్లు, చికిత్సల రేట్లు ప్రకటించాయి. ఎం ఎన్‌ జె, నిమ్స్‌లు కూడా ప్రభుత్వరంగ ఆసుపత్రులు కనుక వాటి ధరలు కూడా అందరికీ తెలిసే అవకాశం ఉంది. కానీ, ఇతర ఆసుపత్రులలో ఈ సౌకర్యంలేదు. అంతేకాక, కేన్సర్‌ ఆసుపత్రులలో ఒకే చికిత్సకు, ఒకే పరీక్షకు పేషంటును బట్టీ వివిధ రేట్లు వసూలు చేస్తారు. ఆరోగ్యశ్రీకి ఒక రేటు, ఒక్కో బీమా కంపెనీకి ఒక రేటు, కేంద్ర ఉద్యోగికి ఒక రేటు, రాష్ట్ర ద్యోగికి ఒక రేటు, ఇఎస్‌ఐ వినియోగదారులకు ప్రత్యేక రేటు, కార్పొరేటు ఉద్యోగులకు అనేక రకాల రేట్లు ఉంటాయి. ఇక నగదు చెల్లించే అభాగ్యులకు మరో రేటు ఉంటుంది. ఇన్ని రకాల రేట్లు ఆసుపత్రిని బట్టీ మారుతుంటాయి కూడా. ఇక్కడే అసలు దోపిడీ ఉంది.

ఔషథ తయారీలో పాములుః

కేన్సర్‌ మందుల తయారీలో పరిశోధనలు చాలా కీలకమైనవి. అమెరికా వంటి అగ్రరాజ్యాలు బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు చేసి ఒక్కోరకమైన కేన్సరుకీ ఒక్కోరకమైన మందు తయారు చేస్తాయి. ఎందుకంటే, బిలియన్ల కొద్దీ ధనాన్ని వెచ్చించడమే కాక, అక్షరాలా కాలకూట విషాలు సేకరించి మందులు సృష్టిస్తాయి. కొంతమంది తమ ప్రాణాలు పణంగా పెట్టి ఆఫ్రికా వంటి చీకటి ఖండాలకు వెళ్లి మహాసర్పాలు, తేళ్లు, బల్లులు, సాలీళ్లు, చెట్లు నుంచీ విషాలు సేకరించి పరిశోకులకు అందజేస్తారు. పరిశోధనాశాలలో వీటి నుంచీ వైజ్ఞానికులు మందులు తయారు చేస్తారు. ఈ విధంగాతవారం ఒక తేలు విషం నుంచీ మెదడు కేన్సర్‌కు మందు తయారైంది. ఈ రకమైన మందులు ఆ కంపెనీ గుత్తాధిపత్యంలో కొంతకాలం అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం ఉంటాయి. వీటిని ప్రపంచంలో ఎవరూ ఆ సమయంలో తయారు చేయకూడదు. దీనిపై కొన్ని అభ్యంతరాలు ఉన్నా, కొంత వరకూ సమంజసమే అని చాలా మంది అంగీకరించారు. అయితే, ఈ కంపెనీలు కాలదోషం పట్టిన తరువాత కూడా ఈ మందులను అభివృద్ధిచెందుతున్న దేశాలకు అందివ్వడం లేదు. ఈ మందులను మార్చి కొత్త మందులు సృష్టిస్తున్నాము అని నాటకాలు ఆడి తమ గుత్తాధిపత్యాన్ని కొనసాగించాలని చూస్తున్నాయి. ఇటువంటి ఆశపోతు బహుళజాతి కంపెనీకి ఇటీవల భారత సుప్రీం కోర్టు లెంపకాయలు వేసింది.
వక్రమార్గంలో అమ్మకాలు

మందుల తయారీ తరువాత అమ్మకాలు చేసే వారి దోపిడీ మొదలవుతుంది. అన్ని మందులలాగా కేన్సర్‌ మందులకు కూడా ఈ చీడ పట్టింది. అంతేకాక, కేన్సర్‌ మందులలో కాలకూట విషాలు ఉండడంతో, ఇవి పేషంట్ల చేతికి మందుల షాపులు ఇవ్వవు. సరాసరి ఆసుపత్రులకు మాత్రమే ఇస్తాయి. ఇక్కడి వైద్యవిధానంలోని లోపాన్ని ఆసరాగా చేసుకుని మందుల అమ్మకందారులు పేషంట్లను దోచుకుంటున్నారు. ఆసుపత్రుల యాజమాన్యాలను తేలిగ్గా బుట్టలో వేసుకుని ఒక సీసా కొంటే మరోసీసా ఫ్రీ వంటి పథకాలతో పాటు అనేక రకాల డిస్కౌంటులు ఇస్తాయి. కేన్సర్‌ పేషంటుకు ఈ లొసుగులు తెలిసినా మంచి వైద్యుడిని వదులుకోలేక ఆసుపత్రుల దోపిడీకి దాసోహం అనాల్సివస్తోంది. కేన్సర్‌ మందులు వేలల్లో మొదలై చికిత్స పూర్తయ్యేనాటికి లక్షల్లో ఉంటుంది. అంటే, ఈ దోపిడీ నిమ్స్‌లో వెలుగుచూసిన స్టంట్ల కన్నా ఎన్ని రెట్లు అధికంగా ఉంటుందో ఊహించడం సామాన్యులకు కష్టం.
సిబ్బంది చేతివాటాలుః

ఇంత అవినీతిలో కూరుకు పోయిన వ్యవస్థలో నర్సులుకూడా అతీతులు కారు. ఒక్కోబాటిల్‌ 20 వేలు, 30 వేలు ఉంటుంది కనుక తమ చేతి వాటాన్ని ధారాళంగా ప్రదర్శిస్తారు. చూపుడు వేలంత బాటిల్‌ దక్కించుకుంటే 20 వేలకు పై మాటే దక్కుతుంది కనుక జాక్‌పాట్‌ కొట్టినంత ఆనందంగా ఉంటారు. అయితే, బసవతారకం వంటి మంచి ఆసుపత్రులలో కొన్ని ఆరోగ్యపద్ధతులు పాటిస్తారు. మందులు రాగానే అవి పేషంట్ల బంధువులకు చూపుతారు. బంధువుల ఎదుటే వాటి సీళ్లు ఓపెన్‌ చేస్తారు. వాటిని సెలైన్‌లో మిక్స్‌ చేస్తారు. ఇది పేషంట్ల బంధువుల హక్కులని చెప్పకనే చెబుతారు. అందరు నర్సులనూ అనుమానించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, వారిలో నిజమైన సేవ చేసే వారు అధికంగా ఉన్నారు. పేషంట్లకు మందులు ఇచ్చే క్రమంలో సూదులు ఏ మాత్రం సిబ్బందికి గుచ్చుకున్నా అవి ప్రాణాంకం అవుతాయి. కనుకనే, నర్సులు ఇతర సిబ్బంది చాలా అప్రమత్తంగా ఉంటారు.

నిపుణులు చెప్పిన మార్గదర్శకాలు:

 

 1. ప్రతి ఆసుపత్రీ తమ చికిత్సల రేట్ల వివరాలు బహిరంగా ప్రకటించాలి.
 2. మందులు, రకాలు, కంపెనీలు, పంపిణీదార్ల ఫోన్ నెంబర్లు బహిరంగంగా ప్రకటించాలి. పోటీ కంపెనీలకు పేషంట్లు ఫోన్లు చేసి డిస్కౌంట్లు, ఆఫర్లు తామే పొందే సౌకర్యం ఆసుపత్రులు కల్పించాలి.
 3. ఏ ఏ రకాల సమస్యలతో వచ్చే వాళ్లకు ఏఏ పరీక్షలు అవసరమో తెలిపే పట్టికలు ప్రకటించాలి. అనవసర పరీక్షలు చేసే ఆసుపత్రుల భరతం పట్టే ప్రభుత్వ వ్యవస్థ సామాన్యుడికి అందుబాటులోకి రావాలి.
 4. ఇన్ని రకాల టారీఫ్లు తీసివేసి అందరికీ ఒకటే టారీఫ్ అమలు చేసే వ్యవస్థ ఉండాలి. కేవలం, విదేశీ పేషంట్లకు మాత్రమే ఎక్కువ టారీఫ్ ఉండేట్లు అనుమతించవచ్చు.
 5. కేన్సర్ పేషంట్ల డేటా శ్రద్ధగా ప్రభుత్వాలు సేకరించాలి. ఇది వారి కనీస బాధ్యత.
 6. బీమా సంస్థలను నియంత్రిస్తూ వైద్య రంగ మార్గదర్శకాలు ప్రభుత్వం రూపొందించాలి.
 7. చికిత్స జరుగుతున్న తీరు తెన్నులను సమీక్షించే సాధికార సంస్థలను ప్రభుత్వాలు ఏర్పచాలి. ఇవి కేన్సర్ రోగులకు అవగాహన కల్పించడం, మందులలోని రకాలు విడమర్చి చెప్పడం, ఏ పరీక్షలు అవసరమో చెప్పడం 24 గంటల టెలీఫోన్ సేవల ద్వారా చేయాలి. ఇవి వైద్యరంగంలోని అవినీతికి అడ్డుకట్ట వేసే సేవ చేయాలి.
 8. బీమా కంపెనీలు తమ పాలసీ వివరాలు స్పష్టంగా ప్రాంతీయ భాషల్లో రాసి వెబ్ సైట్లలో ఉంచాలి. చదువురానివారి కోసం ఈ వివరాలు వీడియోల ద్వారా వెబ్ సైట్లలో ఉంచాలి.

 

-రచయిత సీనియర్ పాత్రికేయులు

oped2

art3